తాగునీటి ఇబ్బందులు రానీయొద్దు
- వేసవి ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ సమీక్ష
- అవసరమైతే అదనంగా నిధులిస్తాం
- ఉపాధి హామీ పనులను ముమ్మరం చేయాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: వేసవి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు కలెక్టర్లను ఆదేశించారు. వేసవి కార్యాచరణ ప్రణాళిక కోసం తాగునీటి సరఫరాకు ఇప్పటికే రూ.263 కోట్లు విడుదల చేశామని, అవసరమైతే అదనంగా మరిన్ని నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు, ఉపాధి హామీ పనుల కల్పన వంటి అంశాలపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ సమీక్షించారు.
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మెరుగైనందున గ్రామీణ మంచినీటి పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించాలని మంత్రి సూచించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యుఎస్)తో సమన్వయం చేసుకొని అవసరమైన ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేయాలని, ప్రతిరోజూ నివేదికలు తెప్పించుకొని నీటి సరఫరా తీరును పర్యవేక్షించాలని ఆయన కోరారు.
వరంగల్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు మాట్లాడుతూ.. గతేడాది వేసవి ప్రణాళికకు సంబంధించిన బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని పేర్కొనగా, మంత్రి స్పందిస్తూ.. ప్రైవేటు బోరు బావులకు గతంలో చెల్లించాల్సిన బకాయిలు ఉన్నట్లైతే వెంటనే చెల్లించే ఏర్పాటు చేస్తామన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను వినియోగించుకోవాలని, అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. జిల్లాస్థాయిలో పబ్లిక్ కాల్ సెంటర్లకు వచ్చే ఫిర్యాదులు, మీడియాలో వచ్చే కథనాలకు అధికారులు స్పందించాలన్నారు.
సబ్‌స్టేషన్ల నిర్మాణానికి 300 కోట్లు: తెలంగాణ తాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన విద్యుత్ సరఫరా ఏర్పాట్లకోసం రూ.300 కోట్లు కావాలని విద్యుత్ సంస్థ(డిస్కం)లు ప్రభుత్వానికి నివేదించాయి. ఈ ప్రాజెక్టు అమల్లో భాగస్వాములైన వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆరు సెగ్మెంట్లలో చేపట్టిన ఇంటేక్‌వెల్స్, ఇంటర్‌మీడియెట్ స్టేషన్ల నిర్మాణానికై విద్యుత్ సరఫరా కోసం తొలివిడతగా రూ.100కోట్లు వెంటనే విడుదల చేస్తామన్నారు.
ఇంటేక్‌వెల్స్ సమీపంలో అవసరమైన మేరకు సబ్‌స్టేషన్లు, డెడికేటెడ్ లైన్స్ పనులు వెంటనే ప్రారంభించాలని డిస్కంల మేనేజింగ్ డెరైక్టర్లను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో సెంట్రల్, నార్తరన్ డిస్కంల మేనేజింగ్ డెరైక్టర్లు రఘుమారెడ్డి, వెంకటనారాయణ, అటవీ సంరక్షణాధికారి శోభ, జలమండలి ఎండీ జగదీశ్వర్, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ విభాగాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు ఇంతియాజ్, సత్యనారాయణరెడ్డి, సురేందర్‌రెడ్డి, జాతీయ రహదారుల విభాగం చీఫ్ ఇంజనీర్ రవీందర్‌రావు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ తదితరులు పాల్గొన్నారు.
ముమ్మరంగా ఉపాధి హామీ పనులు..
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను ముమ్మరంగా చేపట్టాలని మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి గ్రామంలోనూ పనులను ప్రారంభించాలని అన్నారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలను తీసుకొని క్షేత్రస్థాయి సిబ్బంది ‘ఉపాధి హామీ’ ద్వారా ఉపయోగకరమైన పనులను చేపట్టాలన్నారు.
ముఖ్యంగా కరువు పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. ఉపాధి కల్పించాలని కోరిన ప్రతి వ్యక్తికి జాబ్‌కార్డు అందజేయాలని సూచించారు. ఈ నెల 9,10 తేదీల్లో ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించనున్న కలెక్టర్ల సదస్సుకు సమగ్ర సమాచారంతో రావాలని మంత్రి కోరారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, కమిషనర్ అనితా రామచంద్రన్, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.