మూస పద్ధతిలో ప్రతిపాదనలు వద్దు
పంచాయతీరాజ్ ‘బడ్జెట్’పై అధికారులతో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను మూస పద్ధతిలో కాకుండా అవసరాలకు అనుగుణంగా తయారు చేయాలని మంత్రి కె.తారక రామారావు ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ అంచనాలపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాబోయే మూడేళ్లకు సంబంధించిన విజన్‌పైనా సమీక్షించారు. గతేడాది బడ్జెట్‌లో కేటాయింపులు, వ్యయంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యయం, ప్రాధాన్యతలపై చర్చించారు.
రానున్న ఆర్థిక సంవత్సరంలో వంతెనల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని, ప్రతీ గ్రామ పంచాయతీని బీటీ రోడ్డుతో అనుసంధానించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతమున్న పంచాయతీ రోడ్లను అవసరమైన చోట విస్తరించాలని, రోడ్ల నిర్మాణంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం వాడాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపడుతున్న ఇంజనీరింగ్ పనులను డిజిటలైజ్ చేసేందుకు, పనులను ఆన్‌లైన్‌లో పర్యవేక్షించేందుకు టూల్ రూపకల్పన కోసం బడ్జెట్‌లో ప్రతిపాదించాలన్నారు. మిషన్ భగీరథకు అధిక నిధులు కేటాయిస్తామని, అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై మంత్రి ఆరా తీశారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.55 లక్షల టాయిలెట్స్ నిర్మాణానికి గతంలో కన్నా ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉంటుందన్నారు. గ్రామజ్యోతిలో దత్తత తీసుకున్న గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపడతామని ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ తెలిపారు. 1,000 గ్రామ పంచాయతీ భవనాలు, 1,064 అంగన్‌వాడీ కేంద్ర భవనాల నిర్మాణాలను పూర్తి చేసేందుకు 2016-17 బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)-2016 డైరీని కేటీఆర్ ఆవిష్కరించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్, కమిషనర్ అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.