కరువుపై అధికారులు స్పందించాలి
రాయచూరు రూరల్ : రాష్ట్రంలో 125 తాలూకాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, అధికారులు విధులు నిర్వహించేందుకు స్పందించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి హెచ్‌కే.పాటిల్ అధికారులను కోరారు. ఆయన గురువారం జిల్లా పంచాయతీ సభాంగణంలో తాగునీటి ఎద్దడి, కరువు ఆధ్యయన పరిస్థితిపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో మాట్లాడారు. అధికారులు శాఖల మధ్య సమన్వయం చేసుకుని యుద్ధ ప్రాతిపదికన తాగునీటి పథకాలకు త్వరితగతిన విద్యుత్ సౌకర్యం కల్పించి నీరందించాలని కోరారు. అవ సరం ఉన్న చోట్ల నీటి ట్యాంకుల ద్వారా పంపిణీ చేయాలని కోరారు. రాయచూరు జిల్లాలో కరువు సహాయక పనుల కింద 27 లక్షల మానవ ఆహార పనులకు గానూ రూ.181 కోట్ల నిధులు ఖర్చు అయ్యాయన్నారు. 11 పశుగ్రాస కేంద్రాలను ప్రారంభించి 49,5978 మెట్రిక్ టన్నుల పశుగ్రాసాన్ని నిల్వ ఉంచామన్నారు. 269 చెరువుల్లో తాగునీటిని నిల్వ చేయడం జరిగిందన్నారు. కరువు సహాయక అధికారులు సంబంధం లేని విధంగా వ్యవహరించడం తగదన్నారు. తాగునీటి సమస్యలున్న గ్రామాలను గుర్తించక పోవడంపై పంచాయితీరాజ్ ఇంజనీర్‌లపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 185 గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, 467 గ్రామాల్లో ఏ విధంగా అధికారులు పని చేశారనేది అర్థం కావడం లేదన్నారు.
అధికారులు కరువు గ్రామాల్లో పర్యటించాలన్నారు. పశు గ్రాసాన్ని సబ్సిడీ రూపంలో లభించే విధంగా చూడాలన్నారు. లింగసుగూరు, మాన్వి, మస్కి, రాయచూరు గ్రామీణ, రాయచూరు ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు సంబంధించి శాసన సభ్యులు మంత్రికి విన్నవించారు. సమావేశంలో రాష్ట్ర వైద్య విద్యా శాఖా మంత్రి శరణు ప్రకాశ్ పాటిల్, నగరాభివృద్ధి, మైనార్టీ శాఖా మంత్రి ఖమరుల్ ఇస్లాం, మహిళ శిశు సంక్షేమ శాఖా మంత్రి ఉమాశ్రీ, జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు వీరలక్ష్మి, ఉపాధ్యక్షులు గీత, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బోసురాజు, బాదర్లి హంపన గౌడ, ప్రతాప గౌడ పాటిల్, బసవరాజ పాటిల్ ఇటగి, అధికారి మౌనేశ, జిల్లాధికారి శశికాంత సింతల్, సీఈఓ కూర్మారావులున్నారు.