డిసెంబర్ 15కల్లా గోదావరి జలాలు
♦ పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
♦ నగరంలో తాగునీటిపై వాటర్‌వర్క్స్ అధికారులతో సమీక్ష
♦ గోదావరి మొదటి దశ, కృష్ణా మూడో దశ పనుల తీరుపై ఆరా
♦ టోలిచౌకి, ప్రశాసన్‌నగర్‌లలో గ్యాప్ వర్క్ 15 రోజుల్లో పూర్తికి ఆదేశం
♦ రూ. 1,900 కోట్లతో పది శివారు మున్సిపాలిటీలకు తాగునీరు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నిరంతరం తాగునీరు సరఫరా చేసేందుకు తగి న ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులను పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశిం చారు. బంజారాహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం మెట్రో వాటర్ వర్క్స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. రానున్న వేసవిలో నగర ప్రజలకు ఎలాంటి తాగునీటి కొరత లేకుండా చూసేందుకు కావాల్సిన నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కేటీఆర్ సూచించారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి నీళ్లు తీసుకువచ్చేందుకు జరుగుతున్న పనులపై ఆరా తీశారు.
గోదావరి మొదటి దశ నీటి సరఫరా పనుల్లో శామీర్‌పేట్, గుండ్లపోచంపల్లి వద్ద జరుగుతున్న పనులను సమీక్షించారు. ఈ పనులు పూర్తయితే సుమారు 86 ఎంజీడీల గోదావరి నీళ్లు నగరానికి వస్తాయని అధికారులు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. డిసెంబర్ 15 నాటికి హైదరాబాద్‌కు గోదావరి జలాలు అందిస్తామన్నారు. అలాగే కృష్ణా మూడో దశ పనులు చేస్తున్న కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధు లు, అధికారులతో సమావేశమయ్యారు. పనులను వేగంగా చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా టోలిచౌకి, ప్రశాసన్‌నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న రింగ్ మెయిన్ పైపు.. గ్యాప్ వర్క్‌ను 15 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు.
అయితే తమకు రాత్రి సమయంలోనే పనులు చేపట్టేలా అనుమతులు ఇచ్చారని, దీంతో పనులు మందకొడిగా కొనసాగుతున్నాయ ని అధికారులు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి కేటీఆర్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డికి ఫోన్ చేశారు. వరుసగా సెలవులు ఉన్న నేపథ్యంలో రోజంతా పనులు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో వారం పాటు రోజంతా పనులు చేసుకునేలా కమిషనర్ అనుమతి ఇచ్చారు. అయితే పనులు జరిగే ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, డైవర్షన్ రోడ్లను ఒక్క రోజులోనే మరమ్మతు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను మంత్రి ఆదేశించారు.
ఈ పనులు పూర్తయితే 45 ఎంజీడీల నీరు ప్రశాసన్‌నగర్ రిజర్వాయరుకు చేరుతుందని, దీంతో కూకట్‌పల్లి, ఖైరతాబాద్, శేరిలింగంపల్లిలోని ప్రాంతాలకు నీటి సరఫరా అవుతుందని మంత్రి తెలిపారు. అలాగే రూ.1,900 కోట్లతో 10 శివారు మున్సిపల్ సర్కిళ్ల గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూపొందించిన ప్రతిపాదనలపై అధికారులతో మంత్రి చర్చించారు. ఈ పనులు చేపట్టేందుకు హడ్కో రూ.1,700 కోట్లు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చిందని, ఈ మేరకు హడ్కో ఇచ్చిన హామీ పత్రాన్ని జలమండలి అధికారులకు మంత్రి చూపించారు.
అయితే ఈ పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన పాలనాపరమైన అనుమతులు వేగంగా ఇప్పించాలని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే ఉత్తర్వులు ఇప్పించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో బుధవారమే పాలనాపరమైన అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో 138ని జారీ చేసింది. వచ్చేనెల మొదటి వారంలోగా ఈ కార్యక్రమానికి టెండర్లు పిలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జలమండలి ఎండీ జనార్దన్‌రెడ్డితో పాటు ఎంఈఐఎల్ కంపెనీ డెరైక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.