దేవరకొండ : రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు మొట్టమొదటిసారిగా దేవరకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గతంలో జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ప్రజలతో భాగస్వామ్యం పంచుకునే కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రం ఇదే మొదటిసారి కావడం, అదీ మారుమూల మండలమైన చందంపేట మండలంలోనూ పర్యటించనుండటంతో దేవరకొండ ప్రజాప్రతినిధులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు టీఆర్‌ఎస్ దేవరకొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ బాధ్యతలు వహిస్తుండటంతో మంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను ఆయన దగ్గరుండి చూస్తున్నారు.
కలెక్టర్ సత్యనారాయణరెడ్డితో కలిసి బాలునాయక్ మంత్రి పర్యటించే చందంపేట, దేవరకొండ, చింతపల్లి మండలాల్లో గురువారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు చింతపల్లి మండలం నెల్వలపల్లి గ్రామంలో ఏర్పా టు చేసే గ్రామసభ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడినుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు దేవరకొండలో నిర్వహించే బైక్ ర్యాలీలో పాల్గొంటారు. ఆ తర్వాత నేరుగా చందంపేటకు వెళ్తారు. మండల కేంద్రంలోని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసే గ్రామసభ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బంగారు తెలంగాణను సాధించే క్రమంలో కేటీఆర్ కృషి అభినందనీయమని, ఆయన నియోజకవర్గంలో పర్యటించడం దేవరకొండ ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన పర్యటన సందర్భంగా దేవరకొండ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని ఆయన కోరారు.
నేడు జిల్లాకు కేటీఆర్
Published Fri, Aug 21 2015 12:39 AM | Last Updated on Wed, Aug 15 2018 7:56 PM
Advertisement