వీధుల్ని శుభ్రం చేస్తూ.. స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన కల్పిస్తున్న జీవీఎంసీ సిబ్బంది
విశ్వ నగరి విశాఖను స్వచ్ఛత విషయంలోనూ అత్యున్నతమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రజలు భుజానికెత్తుకున్నారు. సిటిజన్ ఫీడ్‌బ్యాక్ విషయంలో ఇన్నాళ్లూ వెనుకబడిన విశాఖ నగరం.. ఇప్పుడు ప్రజా చైతన్యంతో ఏకంగా ఉత్తరాది రాష్ట్రాలతో పోటీపడి దూసుకుపోతోంది. నేటితో స్వచ్ఛ సర్వేక్షణ్ ముగియనుండటంతో చివరిరోజు ఉన్న అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని జీవీఎంసీ అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌ని ఓ క్రతువులా నిర్వహిస్తుండటంతో ప్రజల్లో యాప్ డౌన్‌లోడ్ విషయంలో చైతన్యం వెల్లివిరుస్తున్నప్పటికీ యాప్ వినియోగించే విషయంలో మాత్రం నిర్లక్ష్యం చూపిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రజలు ఇదే రీతిలో స్పందించి ఈ స్థానాన్ని నిలబెడితే నగరం కచ్చితంగా టాప్–10లో నిలుస్తుంది.
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మహా నగరం స్వచ్ఛత విషయంలోనూ పరుగులెడుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో మొదటి రెండేళ్లూ టాప్ 5లో చోటు దక్కించుకున్న విశాఖ గతేడాది మాత్రం ఒక్కసారిగా చతికలపడిపోయింది. ఈసారి మాత్రం టాప్–10లో ఉండేందుకు జీవీఎంసీ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ర్యాంకు విషయంలో ప్రజలే కీలక పాత్ర పోషించాల్సిన నేపథ్యంలో వైజాగ్ వాసులు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాన్ని అగ్ర భాగాన నిలబెట్టేందుకు విశేషంగా స్పందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆయా నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రదానం చేస్తోంది. నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన, ఇళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణం, రవాణా వ్యవస్థ, చెత్తశుద్ధి నిర్వహణ మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు నగరాల్ని ఎంపిక చేస్తోంది.
నేడే చివరి రోజు
ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించినా ఈ నెల 4 నుంచి 31 వరకూ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రధానమైన భాగం. ఈ సమయంలోనే దేశంలో ఉన్న అన్ని నగరాల్లో స్వచ్ఛ బృందం పర్యటించి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తారు. విశాఖ నగరంలో ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అయితే గార్బేజ్ ఫ్రీసిటీ(జీఎఫ్‌సీ) స్టార్ రేటింగ్ ఇచ్చేందుకు పరిశీలన బృందం కూడా నగరంలో ఉంది. శుక్రవారం సాయంత్రంతో ఈ రేటింగ్ పరిశీలన కూడా పూర్తి కానుంది. గతేడాది 2 స్టార్ రేటింగ్‌లో ఉన్న నగరం ఇప్పుడు 5 స్టార్ రేటింగ్ కోసం దరఖాస్తు చేసుంది. మరోవైపు శుక్రవారం చివరి రోజు కావడంతో నగర ప్రజలు సహకరించాలని జీవీఎంసీ విజ్ఞప్తి చేస్తోంది. స్వచ్ఛతా హెల్ప్‌లైన్ నంబర్ 1969కి పౌరులు ఫోన్ చేసి తమ ప్రాంతంలోని పరిశుభ్రత, తదితర అంశాలపై ఫీడ్ బ్యాక్ తెలియపరచవచ్చు. లేదా స్వచ్ఛతా యాప్, స్వచ్ఛ సర్వేక్షణ్–2020 పోర్టల్ ద్వారా గానీ, ఓట్ ఫర్ యువర్ సిటీ యాప్ ద్వారా గానీ పౌరులు స్పందన తెలియజేసేందుకు శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకే సమయం ఉంది. ఈ కొద్ది గంటల పాటు ప్రజలు నగర గౌరవం కోసం శ్రమిస్తే.. స్వచ్ఛతలో టాప్–10లో చోటు దక్కించుకోవచ్చు.
ఉత్తమ స్థానంలో నగరాన్ని నిలబెడదాం..
స్వచ్ఛ సర్వేక్షణ్–2020 నిబంధనల్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తడిపొడి చెత్త విభజన, సేకరణ, రవాణాకు అధిక ప్రాధాన్యమిచ్చాం. చెత్త ప్రొసెసింగ్ దినచర్యగా మారుతోంది. ఇప్పటి వరకు ఉన్న 7 తడి చెత్త, 5 పొడిచెత్త ప్రొసెసింగ్ యూనిట్లు పూర్తి సామర్థ్యంతో వినియోగిస్తున్నాం. ఓఎఫ్‌డీ ప్లస్ ప్లస్ నగరంగా కొనసాగేందుకు జీవీఎంసీ పరిధిలో ఉన్న 328 కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణలో లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. చివరి రోజున ప్రజలంతా విశాఖ నగరాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సహకరించాలి.– జి.సృజన, జీవీఎంసీ కమిషనర్
ప్రజలే వారధులు
స్వచ్ఛతలో నగరాన్ని అత్యుత్తమ స్థాయిలో నిలబెట్టేందుకు జీవీఎంసీ తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రజలు కూడా మంచి సహకారం అందిస్తున్నారు. కీలకమైన ప్రశ్నలకు మంచి సమాధానాలు ఇస్తే.. వైజాగ్ మంచి ర్యాంకు సాధించగలదు. కమిషనర్ సూచనలతో నగర వ్యాప్తంగా 8 ప్రశ్నలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రజల సహకారం చివరి రోజూ అదే స్థాయిలో అందిస్తే టాప్–10లోకి దూసుకుపోతాం. – విశ్వనాథ సన్యాసిరావు, జీవీఎంసీ అదనపు కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment