మురికికాల్వలు, చెత్తకుప్పల పక్కన ఒక ఐదు నిమిషాలు నిలబడటానికే అల్లాడిపోతాం.. అటువంటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ నగరాన్ని రోగాల బారినుంచి రక్షణ కల్పిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది మాత్రం పలు రోగాలతో అర్ధంతరంగా తనువు చాలించాల్సి వస్తోంది... గత ఐదేళ్లలో సుమారు 14 వందల మంది పారిశుద్ధ్య సిబ్బంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందో ఊహించుకోవచ్చు..
సాక్షి, ముంబై: నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న బీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ లేకుండా పోయింది. కార్పొరేషన్ ద్వారా అందుతున్న అరకొర మందులు, ఇతర రక్షణ సామగ్రి కొరత కారణంగా వారు అనారోగ్యానికి గురవుతున్నారు. ఫలితంగా అర్థాంతరంగా వారి ప్రాణాలు హరీ మంటున్నాయి. చెత్త తొలగించడం, మురికి కాల్వలు, నాలాలు శుభ్రం చేయడానికి బీఎంసీలో సుమారు 35 వేల కార్మికులు ఉన్నారు. ఇందులో కొందరు కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నారు.
నిత్యం వీరు చెత్త తొలగించడం, మురికి కాల్వల్లో పనిచేయడంవల్ల విధుల్లో చేరిన 15-20 సంవత్సరాల్లోనే ఆనారోగ్యం పాలవుతున్నారు. చెత్త, మ్యాన్ హోల్స్‌లో దిగడం, మురికి నీరు నుంచి వచ్చే దుర్గంధాన్ని భరించలేక అనేక మంది కార్మికులు గుట్కా, పాన్, పొగాకు, మద్యం లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. వీరు చేస్తున్న పనివిధానాన్ని బట్టి చూస్తే బీఎంసీ పరిపాలన విభాగం తగిన రక్షణ సదుపాయాలు కల్పించడం లేదని స్పష్టమవుతోందని బీఎంసీలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఆంబేకర్ అన్నారు. అత్యధిక శాతం పారిశుద్ధ్య కార్మికులు 50-55 ఏళ్ల వయసులోనే మృత్యువాత పడుతున్నారు.
గడిచిన ఐదేళ్లలో ఏకంగా 1,356 మంది సఫాయి కార్మికులు మృతి చెందారు. ‘మ్యాన్ హోల్స్‌లో దిగి పనిచేసేందుకు కార్మికులకు తగిన రక్షణ కవచాలు ఇప్పటికీ అందుబాటులో లేవు. వీరు అందులో దిగినప్పుడు తప్పనిసరిగా ఆక్సిజన్ మాస్కులు వాడాల్సి ఉంటుంది. అయితే అవి అందుబాటులో ఉండకపోవడంతో మామూలుగానే మ్యాన్‌హోల్స్‌లో దిగుతూ.. వాటిలో ఉత్పతయ్యే విషవాయువులను పీల్చుకుని అందులోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు కోకొల్లలు...అయినప్పటికీ బీఎంసీ తగిన పరికరాలు వారికి అందజేయడం లేద’ని ఆంబేకర్ ఆరోపించారు.
సాధారణంగా ఈ పనులు చేయడానికి ఎవరూ ముందుకురారు. మత్తులో ఉంటే తప్ప మ్యాన్ హోల్స్‌లో దిగడం, చెత్తను తరలించే సాహసం చేయరు. అందుకే వీరంతా చెడు వ్యాసనాలకు బానిసలవుతున్నారు. మృతుల సంఖ్య తగ్గించాలంటే నెలకు ఒకసారి వారి ఆరోగ్యాన్ని పరిక్షించాల్సిన అవసరం ఎంతైన ఉందని అంబేకర్ స్పష్టం చేశారు. వారు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం బిళ్లలు, టానిక్‌లు ఉచితంగా పంపిణీ చేయాలని ఆయన సూచించారు.
ప్రాణాలు పణంగా ‘పారిశుద్ధ్యం’!
Published Fri, Dec 19 2014 10:30 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement
Advertisement