
నగరపంచాయతీలో పారిశుద్ధ్య లోపం
- రోడ్డు మీదకు చేరిన మురికి నీరు
- కదలని అధికార యంత్రాంగం
జోగిపేట : జోగిపేట నగర పంచాయతీని పట్టించుకునే వారేలేకపోవడంతో ప్రతి వార్డులో ఏదో రకమైన సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు ఇతర పనులను అప్పగించడం వల్ల కాలనీల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. పట్టణంలో ఏ వార్డు చూసినా చెత్తే దర్శనమిస్తుంది.
అసలే వర్షాకాలం కావడంతో చెత్త ఎక్కడపడితే అక్కడే పేరుకుపోయి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. స్థానిక ఆస్పత్రిలో డయేరియాతో బాధపడుతున్న కేసుల్లో జోగిపేట, అందోలు ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. జోగిపేటలో 20 వార్డులు ఉన్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అన్ని వార్డుల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. ఎమ్మెల్యే సమస్యలను పట్టించుకోకపోవడానికి కారణం నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం అధికారంలో ఉండడమే కారణమని చెప్పవచ్చు.
కదలని అధికార యంత్రాంగం
పట్టణంలోని వాసవీనగర్ ప్రధాన రహదారిపై చెత్త పేరుకుపోయింది. వర్షం కురియడంతో చెత్తంతా రోడ్డుమీదకు వచ్చి చేరి దుర్గంధం వ్యాప్తిస్తోంది. వాసవీనగర్‌లో కూడా పారిశుద్ధ్య సమస్యలున్నాయి. మురికికాల్వలు సక్రమంగా లేకపోవడంతో కొద్దిపాటి నీటికే రోడ్డుపైకి మురికినీరు చేరుతోంది. 15వ వార్డులో చెత్తకుండీ చుట్టూ చెత్త ఉండడంతో వర్షం కురియడంతో ఆ
రోడ్డు గుండా నడిచే పరిస్థితే లేదు.
చుట్టుపక్కల వారు పగలు కూడా ఇళ్లకు తలుపులు పెట్టుకునే పరిస్థితి నెలకొంది. 17వ వార్డులోని పెద్దమఠం వెనక భాగంలో కాలనీ వాసులు రోడ్డుమీదే చెత్త వేయడంతో దుర్వాసన వస్తోంది. 19 వార్డు పరిధిలోని ఆక్స్‌ఫర్డ్ పాఠశాల సమీపంలోని వీధిలో వర్షం కురిస్తే చాలు వారంరోజుల పాటు ఆ రహదారి గుండా రాకపోకలు బంద్.
వీధులు తిరగని కమీషనర్లే...
నగర పంచాయతీ ఏర్పడి మూడేళ్లవుతోంది. ఇప్పటి వరకు 5 మంది కమిషనర్లు వచ్చి బదిలీ అయ్యారు. ఒకరు విధుల నిర్లక్ష్యం కారణంగా సస్పెన్షన్‌కు గురయ్యారు. వీరిలో ఎవరు కూడా వీధుల్లో తిరిగిన వారు లేరు.. ఏ వార్డు ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో పనిచేసి బదిలీ అయ్యారు. ఇటీవలే కమిషనర్ సస్పెన్షన్ కావడంతో జిల్లా అధికారికి అదనపు బాధ్యతలను అప్పగించారు.
]
కొత్త కమిషనర్‌తోనైనా సమస్యలు తీరేనా
ఇటీవల విధుల నిర్లక్ష్యంతో సస్పెన్షన్‌కు గురైన రవీందర్‌రావు స్థానంలో జిల్లా ఆర్వీఎం పీఓగా పనిచేస్తున్న యాస్మిన్ బాషాకు జోగిపేట నగర పంచాయతీ ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో వారం క్రితం బాధ్యతలు చేపట్టారు. సమస్యలను ఎప్పటికప్పుడు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే అధికారిగా పేరున్న ఆమె హయాంలోనైనా సమస్యలు తీరుతాయన్న ఆశాభావంతో ప్రజలు ఉన్నారు.