వేతనాలు పెంచలేం! | Wages can not be hike | Sakshi
Sakshi News home page

వేతనాలు పెంచలేం!

Published Mon, Mar 26 2018 2:13 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

Wages can not be hike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునిసిపల్‌ కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికుల వేతనాలను ప్రభుత్వం పెంచితే తాము చెల్లించలేమని పురపాలికలు చేతులెత్తేశాయి. ప్రస్తుత వేతనాలనే మూడు, నాలుగు నెలలకోసారి కార్మికులకు చెల్లిస్తున్నామని, ఈ పరిస్థితిలో వేతనాలు పెంచితే చెల్లించడం సాధ్యం కాదని తేల్చాయి. ఆదివారం రామగుండంలో రాష్ట్ర మునిసిపల్‌ మేయర్లు, చైర్‌పర్సన్ల సంఘం అధ్యక్షుడు, కరీంనగర్‌ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ నేతృత్వంలో మునిసిపల్‌ కార్పొరేషన్ల మేయర్లు, మునిసిపాలిటీల చైర్‌పర్సన్లు, మునిసిపల్‌ కమిషనర్లు సమావేశమై పారిశుధ్య కార్మికుల వేతనాల పెంపునకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. మునిసిపల్‌ పారిశుధ్య కార్మికుల వేతనాలను పెంచకపోతే ఈనెల 31 తర్వాత ఏ క్షణం నుంచైనా రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని తెలంగాణ రాష్ట్ర మునిసిపల్‌ కార్మిక సంఘాల జేఏసీ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో పురపాలక మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు ఈ సమావేశం నిర్వహించారు.  

సానుకూలంగా ఉన్నాం
పురపాలక మంత్రి కె.తారకరామారావుతో త్వరలో సమావేశమై మునిసిపల్‌ పారిశుధ్య కార్మికుల వేతనాల పెంపు ప్రతిపాదనలను సమర్పిస్తామని సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ తెలిపారు. కార్మికుల వేతనాల పెంపు అంశంపై సానుకూలంగా ఉన్నామని, త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -- రవీందర్‌ సింగ్‌

ప్రభుత్వమే పెంచాలి
మునిసిపల్‌ కార్మికులకు జీవో నం.14 ప్రకారం వేతనాలు పెంచే అధికారం ప్రభుత్వానిదేనని తెలంగాణ మునిసిపల్‌ వర్కర్స్, ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఖమర్‌ అలీ, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ స్పష్టం చేశారు. కార్మికుల వేతనాలను మునిసిపాలిటీలే పెంచుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించడం సరి కాదన్నారు. ప్రభుత్వమే వేతనాల పెంపు నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ఈనెల 31 తర్వాత ఏ క్షణం నుంచైనా నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. -- ఖమర్‌ అలీ, పాలడుగు భాస్కర్‌ 

ఆదాయం అంతంత మాత్రమే..
జీహెచ్‌ఎంసీ తరహాలో రాష్ట్రంలోని మిగతా 72 మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పారిశుధ్య కార్మికుల వేతనాలను రూ.14 వేలకు పెంచే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మొత్తం 72 పురపాలికల్లో 16 వేల మంది కార్మికులు పని చేస్తుండగా, వారి వేతనాలను రూ.8,300 నుంచి రూ.14 వేలకు పెంచితే ఏటా రూ.75 కోట్ల అదనపు భారం పడనుంది. పురపాలికలకు పన్నులు, ఇతర రుసుముల ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉందని, వేతనాలు పెంచితే పడే భారాన్ని 70 శాతం పురపాలికలు భరించే పరిస్థితిలో లేవని తేల్చారు.

చివరిసారిగా 2011లో కార్మికుల వేతనాలు పెంచిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ వేతనాల పెంపు ఆవశ్యకత ఏర్పడిందని, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఆర్థిక చేయూ త అందిస్తేనే ఇది సాధ్యమవుతుందని మేయర్లు, చైర్‌పర్సన్లు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో కార్మికుల వేతనాల పెంపుపై ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఉంచాలని నిర్ణయించారు. మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల మధ్య ఉన్న ఆర్థిక అంతరాల మేరకు ఆయా సంస్థల కార్మికుల వేతనాలను వేర్వేరుగా పెంచాలని ఓ ప్రతిపాదన రూపొందించారు. ప్రభుత్వం సహాయం చేసేందుకు ముందుకు వస్తే కార్మికుల వేతనాలను రూ.14 వేలకు పెంచాలని మరో ప్రతిపాదన సిద్ధం చేశారు. చివరగా కార్మికుల వేతనాలను కనీసం రూ.12 వేలకు పెంచాలని, ఇందుకు ప్రభుత్వ సహాయం కోరాలని నిర్ణయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement