టవర్‌సర్కిల్ : పారిశుధ్య కార్మికుల నియామకం కోసం రూ.10 కోట్ల విలువైన టెండర్లను అర్హత లేని శ్రీరాజరాజేశ్వర ఏజెన్సీకి కట్టబెట్టేందుకు నగరపాలక సంస్థ అధికారులు అన్నీ సిద్ధం చేసిన....
త్వరలోనే కొత్త టెండర్లు.. అప్పటివరకు పొడిగింపు
కరీంనగర్ నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికుల నియామకానికి నిర్వహించిన టెండర్లను అధికారులు రద్దు చేశారు. అవకతవకలు జరిగాయని తేటతెల్లమైనప్పటికీ మొదట నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన అధికారులు... ‘సాక్షి’ వరుస కథనాలతో మొద్దునిద్ర వీడారు. అక్రమాలు నిజమేనని, దిద్దుకోలేని చర్యగా భావిస్తూ రద్దుకే మొగ్గు చూపారు. త్వరలో కొత్త టెండర్లు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.
టవర్‌సర్కిల్ :
పారిశుధ్య కార్మికుల నియామకం కోసం రూ.10 కోట్ల విలువైన టెండర్లను అర్హత లేని శ్రీరాజరాజేశ్వర ఏజెన్సీకి కట్టబెట్టేందుకు నగరపాలక సంస్థ అధికారులు అన్నీ సిద్ధం చేసిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అక్రమాలపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడం, బల్దియా ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు తేలడంతో టెండర్లు రద్దు చేస్తూ కమిషనర్ శ్రీకేశ్ లట్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రస్థాయిలో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంజినీరింగ్‌శాఖ అధికారులు చేసిన తప్పిదంతో నగరపాలక సంస్థ పరువు బజారున పడినట్టయింది. టెండర్లను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం, టెక్నికల్ బిడ్ తెరవడం మొదలుకుని ఫైనాన్స్ బిడ్ ఓపెన్ చేసేవరకూ అంతా గందరగోళంగానే జరిగింది. అర్హత లేని ఏజెన్సీలను గుర్తించి కూడా అత్యుత్సాహంతో సదరు ఏజెన్సీలకు సంబంధించిన ఫైనాన్స్‌బిడ్ తెరిచినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయంపై ఏకంగా ఉన్నతాధికారులను, పాలకవర్గాన్ని తప్పుదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి బండారం బయటపడింది. అక్రమాల చిట్టా బయటపడడం కార్పొరేషన్‌ను ఒక కుదుపు కుదిపింది. అయితే బాధ్యులని తేలిన తర్వాత కూడా సదరు అధికారులను ఉపేక్షించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మళ్లీ పొడిగింపులే...
నగరపాలక సంస్థగా రూపాంతరం చెందిన తొమ్మిదేళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే శానిటేషన్ కార్మికుల నియామకం కోసం టెండర్లు జరిగాయి. 2005లో ఒకసారి టెండర్లు జరగగా, అప్పటినుంచి 2013 వరకు పొడిగింపులే జరిగాయి. 2013లో టెండర్లు నిర్వహించగా పాతవారికే పనులు దక్కాయి. 2014 జూలై 31తో టెండర్ల గడువు ముగియగా టెండర్ల ప్రక్రియ అప్పటినుంచి మూడు నెలలు కొనసాగింది. ఈ మూడు నెలలతోపాటు కొత్త టెండర్లు పూర్తయ్యేవరకు మరో మూడు నెలలు పాత కాంట్రాక్టర్‌కే పొడిగింపు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.