ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2013 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ‘ప్రపంచ టాయిలెట్ దినోత్సవం’ జరుపుకుంటున్నా నేటికీ ప్రపంచంలో 350 కోట్ల ప్రజలకు టాయిలెట్ (మరుగుదొడ్డి) సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. టాయిలెట్ సౌకర్యలేమి కారణంగా ముఖ్యంగా మహిళలు, పిల్లలు, బాలికలు... తీవ్రమైన మానసిక, ఆరోగ్య, సామాజిక సమస్యలకు గురవుతున్నారు. అనేక పాఠశాలలు, పరిశ్రమలు, ఇతర పని ప్రదేశాల్లో సరైన టాయిలెట్ సదుపాయాలు, మంచినీటి సౌకర్యం వంటివి లేకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 41.9 కోట్లమంది బహిరంగ మలవిసర్జన చేస్తున్నారనీ, సుమారు 220 కోట్లమంది ప్రజలకు మంచినీటి సౌకర్యం లేదనీ, 11.5 కోట్లమంది కుంటలూ, చెరువులు, బావులు వంటి వాటిలోని సురక్షితం కాని నీరు తాగుతున్నారనీ గణాంకాలు చెబుతున్నాయి. సరైన మంచినీరు, శానిటేషన్, ఆరోగ్య సదుపాయాలు లేకపోవడంతో ప్రతిరోజూ వెయ్యి మంది ఐదేళ్ల లోపు పిల్లలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ఇక మన భారతదేశంలో 2019–21లో విడుదలైన ఒక నివేదిక ప్రకారం 69.3 శాతం మంది మాత్రమే మరుగుదొడ్ల సౌకర్యాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నేటికీ 19.4 శాతం మంది మనదేశంలో బహిరంగ మలవిసర్జన చేస్తున్నారు. 2014 అక్టోబర్ 2వ తేదీన దేశ వ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్ మిషన్‘ ప్రారంభించినా నేటికీ అందరికీ టాయిలెట్ సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు.
చదవండి: మలబద్ధకంతో మహాబాధ... నివారణకు ఇలా చేయండి!
మనదేశం త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా ఆవిర్భవించాలనే లక్ష్యాలను నిర్దేశించుకుంది. కనీసం ప్రజలందరికీ టాయిలెట్ సౌకర్యం కల్పించకుండా ఇది సాధ్యంకాదు. అందుకే ప్రభుత్వాలు ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలి.
– ఐ. ప్రసాదరావు; ఉపాధ్యాయుడు, కాకినాడ
(నవంబర్ 19న ప్రపంచ టాయిలెట్ దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment