టాయిలెట్స్ ఎవరు కడగాలి?
World Toilet Day 2021: ఇది భలే సహజ విషయం. స్త్రీలకు సహజంగా కేటాయించబడిన విషయం. పిల్లలు పుడితే వారి టాయిలెట్‌ను శుభ్రం చేయడం స్త్రీల పని. ఇంట్లో బాత్రూమ్లను క్లీన్ చేయడం స్త్రీల పని.
వయసు మీరిన వారు లావెటరీ వరకు వెళ్లలేకపోతే కూతురు, కోడలు లేదా పనిమనిషి మొత్తానికి స్త్రీలే వాటిని ఎత్తి పోసే పని. టాయిలెట్స్ కట్టే వరకు స్త్రీలు ఒక అవస్థ పడ్డారు. కట్టాక చీపుళ్లు పట్టుకు నిలబడుతున్నారు. పురుషులకు రెండు చేతులు ఉన్నాయి. వారు ఎందుకు ఈ పని షేర్ చేసుకోరు? ఈ పని స్త్రీలు మాత్రమే ఎందుకు చేయాలి? ఎంతకాలం చేయాలి?
మొత్తం మీద పని మనుషులు తమ ఆత్మగౌరవాన్ని చాటుకుంటున్నారు. ఇంటి పని ఒప్పుకునే ముందు ‘టాయిలెట్లు తప్ప’ అని చెబుతున్నారు. ఒకప్పుడు ఇంటి పనిలో టాయిలెట్లు శుభ్రం చేయడం కూడా ఉండేది. కాని ఇప్పుడు పని మనుషులు ఒప్పుకోవడం లేదు. అంట్లు, బట్టలు, ఇల్లు ఓకే. టాయిలెట్లు? ఎవరికి వారు శుభ్రం చేసుకోవడం కదా సంస్కారం.
అయితే అది దాదాపు అన్ని ఇళ్లల్లో స్త్రీ సంస్కారం మాత్రమే. పురుషుడిది కాదు. గాంధీజీ ఏ విషయానికైనా గొప్పవారే. ఆయన తానే ఒక పార పట్టుకుని బహిర్భూమికి వెళ్లేవారు. వచ్చే ముందు పారతో మట్టిపోసి వచ్చేవారు. విసర్జనం ఒక నిత్యకృత్యం. శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మాత్రమే కాదు అందుకై వాడే స్థలం కూడా ఎవరికి వారు శుభ్రం చేయాలి. కాని పురుషుడై ఉంటే అందునా భర్త అయితే ఈ చోటు శుభ్రం చేసే పని భార్యదిగా ఉంటుంది. భార్యది మాత్రమే ఎందుకు?
తరతరాల ఇబ్బంది
భారతదేశంలో రోజు వారీ తప్పని ఈ అవసరానికి స్త్రీలను తరాలుగా ఇబ్బంది పెట్టారు. టాయిలెట్లు కట్టక, స్తోమత ఉన్నా మూఢత్వం కొద్దీ కట్టక, వారి మర్యాదను పట్టించుకోక ఇబ్బంది పెట్టారు. స్త్రీలు బహిర్భూమికి సిగ్గుతో చితుకుతూ ఊరికి దూరంగా వెళ్లాల్సి రావడం ఒక అంశమైతే రాత్రి పొద్దుపోయాక లేదా తెల్లవారుజామున తుప్పల్లోకో పొదల్లోకో వెళ్లి ప్రమాదాల్లో పడ్డారు. దాడులకు గురయ్యారు.
తొంగి చూసే ఆకతాయిల వల్ల అవమానాలు పడ్డారు. ‘స్వచ్ఛభారత్’ వల్ల గాని, దానికి ముందు ప్రభుత్వాలు చేసే ప్రచారం వల్లగాని ఈ సమస్య ఒక కొలిక్కి వస్తున్నా ఇంకా టాయిలెట్లు లేని ఇళ్లు, టాయిలెట్లకు నోచుకోని పేదజనం ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ‘వరల్డ్ టాయిలెట్ డే’ నిర్వహించేది ప్రతి మనిషి శుభ్రత కలిగిన, మరుగు కలిగిన ప్రదేశంలో గౌరవం చెడకుండా కాలకృత్యాలు తీర్చుకునే హక్కు కలిగి ఉన్నాడని చెప్పేందుకే. సరే... టాయిలెట్లు వచ్చాయి. వాటిని కడగడం ఎవరి వంతు?
నీటి సమస్య... శుభ్రత సమస్య
టాయిలెట్లు కడగడం అంటే ఆ కొద్దిపాటి స్థలం కడగడం మాత్రమే కాదు. అందుకు నీళ్లు కావాలి. ఈ దేశంలో 90 శాతం ఇళ్లలో నీళ్లు పట్టాల్సిన, మోయాల్సిన, పొదుపు చేయాల్సిన బాధ్యత స్త్రీలది. నలుగురు కుటుంబ సభ్యులు కాలకృత్యాల కోసం రోజులో ఐదారుసార్లు టాయిలెట్లను వాడితే ప్రతిసారీ నీరు ఖర్చవుతుంది. ఆ నీరు మోసే పని భారం స్త్రీ మీద పడుతుంది.
తమ టాయిలెట్ అవసరాలకు నీరు మోసుకోవాలని పిల్లలకు నేర్పాల్సి ఉంటుంది. భర్త తానే పట్టి తెచ్చి ఉదాహరణగా నిలవాల్సి ఉంటుంది. ఈ రెండూ జరగడం మృగ్యం. ఇంకా సమస్య ఏమిటంటే ‘టాయిలెట్ ఎటికెట్’ను పాటించకపోవడం. టాయిలెట్ వాడి చేతులూపుకుంటూ వచ్చేస్తే ‘నీళ్లు కొట్టండ్రా’ అని స్త్రీలు వారి వెనుక వెళ్లి ప్రతిసారీ నీళ్లు కొట్టాలి. నీళ్లు మోయాలి.. నీళ్లు కొట్టాలి... అన్నిసార్లు టాయిలెట్‌ను చూడాల్సి రావడం ఎవరికైనా వికారంగానే ఉంటుంది. స్త్రీలకు ఆ వికారం ఎందుకు?
ఈ శ్రమ ఎవరిది?
ఇంట్లో వయసు మీరిన వారుంటే వారు జబ్బున పడితే స్త్రీల పైప్రాణాలు పైనే పోతాయి. దానికి కారణం వారి టాయిలెట్ అవసరాలు చూడాల్సి రావడమే. ఈ సమస్యను పురుషులు సరిగా అడ్రస్ చేయకపోవడం వల్ల కుటుంబ నిర్మాణంలో అనేక అంతరాలు, అవాంతరాలు వస్తున్నాయి. వయసు మీరిన అత్తగారిని, మావగారిని ఇంట్లో ఉంచుకోవడానికి ‘కొందరు కోడళ్లు’ సుముఖంగా లేరు అని అనడం వింటూ ఉంటే ‘ఆ పెద్దల సేవను ఎవరు చేయాలి?’ అనే ప్రశ్నకు సమాధానం పురుషుడు చెప్పాల్సి ఉంటుంది.
ఆర్థిక కారణాల రీత్యా ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టే వీలు లేదు. ఈ సేవకు పురుషుడు సిద్ధ పడడు. మరి స్త్రీనేగా చేయాలి. చేయడానికి ఆమె నిరాకరించదు, పురుషుడు కనుక ఆ పనిలో భాగం పంచుకుంటే. ఈ పనిని, సేవను గొప్పగా చేసిన పురుషులు ఉన్నారు. కాని వారి శాతం స్వల్పం. ఒకరిపై ఆధారపడేలా టాయిలెట్ అవసరాలు తీర్చుకునే పెద్దవారు ఉంటే పురుషుడు అప్రమత్తం కావాలి. స్త్రీతో చర్చించాలి. ఆ శ్రమను సరిగా విభజన చేయాలి. సెంటిమెంట్లు, బాధ్యతలు ఏ పనిలో అయినా సరే కాని ఈ పనిలో కాదు.
ఫినాయిల్, బ్రష్ పట్టండి
ఇల్లు శుభ్రంగా ఉండటం ఎంత ముఖ్యమో టాయిలెట్ శుభ్రంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. సబ్బు వాసనలు వచ్చే టాయిలెట్లో వెళ్లడానికి ఇష్టపడతారు ఎవరైనా చెడు వాసనలు వచ్చే టాయిలెట్ కంటే. కనుక పురుషులు తమకు సమయం చిక్కినప్పుడు నెలకు ఇన్నిసార్లు అని టాయిలెట్‌ను తప్పక శుభ్రం చేయాలి. ఇంట్లో ఉన్న మగపిల్లల చేత చేయించాలి. ఫినాయిల్ వాడటం, బ్రష్ పట్టుకుని కమోడ్లను తోమడం కూడా నేర్చుకోవాలి. నీటి సమస్య ఉన్న ప్రాంతాలైతే మరింత బాధ్యతగా వ్యవహరించాలి. టాయిలెట్లు కూడా క్లీన్ చేయలేవా అని గీరగా భార్య వైపు చూసే భర్తలు ఒకసారి బాత్రూమ్లో చీపురు, నీళ్లు పట్టుకుని అడుగుపెట్టండి. ప్లీజ్.
ఈ పనిని, సేవను గొప్పగా చేసిన పురుషులు ఉన్నారు. కాని వారి శాతం స్వల్పం. ఒకరిపై ఆధారపడేలా టాయిలెట్ అవసరాలు తీర్చుకునే పెద్దవారు ఉంటే పురుషుడు అప్రమత్తం కావాలి. స్త్రీతో చర్చించాలి. ఆ శ్రమను సరిగా విభజన చేయాలి. సెంటిమెంట్లు, బాధ్యతలు ఏ పనిలో అయినా సరే కాని ఈ పనిలో కాదు.