ముంచుకొస్తున్న హెచ్‌ఎంపీవీ..నఖ శిఖం పరిశుభ్రంగా ఉందామిలా..! | Hmpv Virus Total Body Hygiene Practices Keep Body Clean And Healthy | Sakshi
Sakshi News home page

ముంచుకొస్తున్న హెచ్‌ఎంపీవీ..నఖ శిఖం పరిశుభ్రంగా ఉందామిలా..!

Published Tue, Jan 7 2025 11:02 AM | Last Updated on Tue, Jan 7 2025 12:25 PM

Hmpv Virus Total Body Hygiene Practices Keep Body Clean And Healthy

చాలామంది రోజూ ఉదయం బ్రష్‌ చేసుకోవడం తర్వాత స్నానం మొదలు దేహ పరిశుభ్రతను చకచకా చేస్తుంటారు. ఈ క్రమంలో దేహమంతా శుభ్రమవుతుందో లేదో చూడరు.ఉదాహరణకు స్నానం సమయంలో  చెవుల వెనక భాగంలో...  చెవి వెనక భాగం తలతో కనెక్ట్‌ అయ్యే ప్రాంతంలో, మెడ వెనక, చెవుల ముడతల్లో ఇలాంటి చోట్ల శుభ్రమవుతోందా, కావడం లేదా అన్నది చూడరు. రోజువారీ హైజీన్‌ పాటించకపోతే అది మరికొన్ని ఆరోగ్య సమస్యలకూ, దేహ / చర్మ సమస్యలకు దారితీయవచ్చు. అందులోనూ మరో మహమ్మారి హెచ్‌ఎంపీవీ(HMPV) వైరస్‌ చైనా(China)లో కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆ వైరస్‌ కేసులు మనదేశంలో కూడా నమోదవ్వుతున్నాయి. ఈ తరుణంలో చక్కటి జాగ్రత్తలతో మన శరీర పరిశుభ్రత పాటించడం ఎలాగో తెలుసుకోవడం కోసమే ఈ కథనం.

దేహ పరిశుభ్రత కోసం పళ్లు తోముకోవడం మొదలుకొని, కాళ్లూ, పాదాల శుభ్రత వరకు ఎలాంటి హైజీన్‌ పాటించాలో చూద్దాం. పైగా ఇప్పుడు కొత్త కొత్త వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయన్న పుకార్లు వ్యాపిస్తున్న తరుణంలో ఆపాదమస్తకం శుభ్రత పాటించడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత జాగ్రత్తలతో మరింత మెరుగైన ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా, మరెన్నో వ్యాధులను నివారించుకోవచ్చు కూడా.

ప్రతిరోజూ మనందరమూ పొద్దున్నే పళ్లను బ్రష్‌ చేసుకుంటాం. ఇలా బ్రష్‌ చేసుకునే టైమ్‌లో ముందువైపునకే ప్రాధాన్యమిస్తాం. కానీ పలువరసలో అన్నివైపులా శుభ్రమయ్యేలా బ్రష్‌ ఉపయోగించాలి. అలాగే ఆహారం తీసుకున్న ప్రతిసారీ పళ్లను కొద్దిగా నీళ్లతో నోరు పుక్కిలించాలి. నోరు అనేక సూక్ష్మజీవులకు నిలయం. 

ఆహారం తీసుకున్న ప్రతిసారీ బ్రషింగ్‌ చేసుకోవడం కుదరదు కాబట్టి... కొద్దిగా నీటిని నోట్లోకి తీసుకుని పుక్కిలిస్తూ నోరంతా శుభ్రం చేసుకోవడం అవసరం. ఆహారం తీసుకున్న తర్వాత నోట్లో బ్యాక్టీరియా పెరిగేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి ఈ పుక్కిలింతల వల్ల అది నోరు శుభ్రమవుతుంది. 

ఇక ప్రతిరోజూ ఉదయం, రాత్రి నిద్రపోబోయే ముందు బ్రషింగ్‌ చేసుకోవడం అవసరమన్నది మనందరికీ తెలిసినప్పటికీ చాలా మంది ఈ నియమం పాటించరన్నది తెలిసిందే. బ్రషింగ్‌ తర్వాత పళ్లపైనా, చిగుర్లపైనా వేలి చివరలతో గుండ్రంగా తిప్పుతూ మసాజ్‌ చేసుకుంటున్నట్లుగా రాయాలి. దీనివల్ల చిగుర్లకు రక్తప్రసరణ పెరిగి చిగుర్ల వ్యాధులు నివారితమవుతాయి. 

పొగాకు వంటివి నమలడం, జర్దాపాన్‌ వంటివి తినడం, ఖైనీ, గుట్కా, పాన్‌మసాలాల వంటి దురలవాట్లు నోటి దుర్వాసనతో పాటు శారీరకంగా కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నోటి క్యాన్సర్లు మొదలుకొని ఇతరత్రా అనేక ఆరోగ్య సమస్యలకు తావిస్తాయి. అంతేకాదు... నలుగురిలో మాట్లాడటానికి ఇబ్బందిగా ఉండే వాతావరణాన్ని కలిగిస్తాయి. అలాంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి. మార్కెట్‌లో దొరికే మౌత్‌వాష్‌లతో తరచూ నోరు కడుక్కుంటూ ఉండటం కూడా మంచిదే. ముఖ్యంగా నోటి దుర్వాసనతో బాధపడేవారు తరచూ మౌత్‌వాష్‌తో శుభ్రం చేసుకోవడం ఇంకా మంచిది.

స్నానం..
ప్రతి రోజూ ప్రతివారూ స్నానం చేస్తారు. అయితే చాలామంది దేహం శుభ్రమవుతోందా లేదా అన్నది చూసుకోకుండా యాంత్రికంగా ఈ పని చేస్తుంటారు. ముఖ్యంగా చిన్నారుల్లో (కొందరు పెద్దవాళ్లలనూ) ఈ ధోరణి కనిపిస్తుంది. చాలామంది తమ చెవుల వెనక భాగాలనూ, శరీరంలో మడతపడే చోట్లను శుభ్రం చేసుకునే విషయాన్ని అంతగా పట్టించుకోరు. వాస్తవానికి చర్మం ముడతలు పడే ప్రాంతాలైన కీళ్లు, బాహుమూలాలు, మోకాలి వెనక భాగాలతో పాటు ప్రైవేట్‌ పార్ట్స్‌పై కొద్దిగా ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరముంటుంది. 

తలస్నానం ఎలాగంటే...:  తలస్నానం వారంలో రెండుసార్లు చేయడం మంచిది. తలలో చుండ్రు వంటి సమస్యలు ఉన్నవారు రోజు విడిచి రోజు తలస్నానం చేయడమూ మంచిదే. తలస్నానం చేసే ముందర కొందరు తలకు నూనె రాస్తారు. అందరూ తలకు నూనె రాయాల్సిన అవసరం లేదు. 

కేవలం పొడిబారినట్లు ఉండే చర్మమూ, వెంట్రుకలు ఉన్నవారు మాత్రమే తలస్నానానికి ముందర నూనెతో మృదువుగా మసాజ్‌ చేసుకోవాలి. జిడ్డుచర్మం ఉండేవారు తలకు నూనె రాయక΄ోయినా పర్వాలేదు. ఆ తర్వాత అదంతా శుభ్రమయ్యేలా మంచి షాంపూతో స్నానం చేయాలి. మైల్డ్‌ షాంపూ వాడటమే మేలు. కొందరు మెడికేటెడ్‌ షాంపూలు వాడతారు. అలాంటివి కేవలం డాక్టర్‌ సలహా మీద మాత్రమే వాడాలి. 

మరికొన్ని జాగ్రత్తలు... 
ఆహ్లాదం కలిగించి అనేక ఆరోగ్య సమస్యలను దూరంపెట్టే  స్నానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలివి... స్నానానికి ఉపయోగించే నీళ్లు మరీ చల్లగా లేదా మరీ బాగా వేడిగా ఉండకూడదు. చన్నీటి స్నానం మంచిదనేది కేవలం అపోహ. చల్లటి స్నానం వల్ల సైనస్, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారికి చల్లటినీళ్ల స్నానం దాన్ని ట్రిగర్‌ చేసే అవకాశాలెక్కువ. ఇక మరీ బలహీనంగా ఉన్నవాళ్లుగానీ లేదా వృద్ధులుగానీ మరీ ఎక్కువగా చల్లగా ఉండే నీళ్లతో స్నానం కాని, మరీ ఎక్కువ వేడిగా ఉండే నీళ్లతో స్నానం గానీ చేయడం సరికాదు 

ఒకవేళ తప్పని పరిస్థితుల్లో చల్లటి నీళ్లతో స్నానం చేయాల్సి వస్తే... ఆ స్నానం వ్యవధిని వీలైనంతగా తగ్గించడం మంచిది ఒకవేళ చల్లటి నీళ్లతో స్నానం చేయాల్సి వస్తే... దానికి ముందర వార్మప్‌గా కాస్తంత వ్యాయామం మంచిది కడుపు నిండా తిన్నవెంటనే స్నానం చేయకూడదు. భోజనం తర్వాత రెండు మూడు గంట తర్వాతే స్నానం చేయడం మంచిది. చన్నీళ్లు లేదా వేణ్ణీళ్లతో గానీ స్నానం తర్వాత తలనొప్పి, జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే అది మీ ఆరోగ్యానికి అంతగా సరిపడదని గుర్తుంచుకుని, ఇలాంటివాళ్లు కేవలం గోరువెచ్చటి నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి. 

చెవులసంరక్షణ
చెవులను చాలా జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. చాలామంది చెవుల వెనక భాగాన్ని శుభ్రం చేసుకోవడం మరచిపోతుంటారు. కానీ స్నానం సమయంలో చెవుల వెనకభాగంతో పాటు... బయటి చెవి (ఎక్స్‌టర్నల్‌ ఇయర్‌ పిన్నా)ను చెవిలోపలివరకూ శుభ్రం చేసుకోవాలి. 

మన చెవుల్లో వచ్చే గులివి / గుమిలి చెవికి రక్షణ కల్పించడం కోసమే పుడుతుంది. కాబట్టి దాన్ని శుభ్రం చేసుకోడానికి పిన్నీసులు, ఇయర్‌బడ్స్‌ లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. చెవి లోపల గువిలి మరీ ఎక్కువగా ఉంటే ‘డీ–వ్యాక్స్‌’ అనే చుక్కల మందును వేసుకోవాలి. మరీ చెవులు మూసుకుపోయినంతగా గువిలి ఉత్పన్నమవుతుంటే ఈఎన్‌టీ డాక్టర్‌(ENT Doctor)ను సంప్రదిస్తే వారే సురక్షితమైన రీతిలో చెవులను శుభ్రం చేస్తారు.

ఇయర్‌బడ్స్‌ వద్దు :  కొందరు ఇయర్‌ బడ్స్‌తో తమ చెవులను తరచూ శుభ్రపరుస్తుంటారు. ఏమీ తోచనప్పుడు, ఏ పనీ లేనప్పుడు కూడా చెవుల్లో ఇయర్‌బడ్‌ పెట్టుకుని తిప్పేస్తుంటారు. నిజానికి చెవులు తమంతట తామే శుభ్రపరచుకుంటాయి. ప్రకృతి వాటినలా డిజైన్‌ చేసింది. వాస్తవానికి ఇయర్‌బడ్స్‌ వాడినప్పుడు కొన్నిసార్లు గువిలి చెవి లోపలికి ఇంకా లోతుగా వెళ్తుంది. చెవిలోకి ఏదైనా బయటి వస్తువు / పురుగు ప్రవేశించినప్పుడు అడ్డుకుని, చెవిని రక్షించడం కోసమే ఈ గువిలి స్రవిస్తుంటుంది.

ఇయర్‌బడ్స్‌తో లేదా అగ్గిపుల్లలతో శుభ్రం చేయడం మొదలుపెట్టగానే చెవిలోని గ్రంథులు మరింత ఎక్కువగా గువిలిని స్రవిస్తాయి. దాంతో సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే చెవులను తరచూ శుభ్రపరచుకునే వారిలోనే గువిలి లేదా వ్యాక్స్‌ ఎక్కువగా స్రవిస్తుంది. కాబట్టి ఇయర్‌బడ్స్, అగ్గిపుల్లలు, పుల్లలు, పెన్నులు, పిన్నీసులు వంటి వాటితో చెవులను శుభ్రం చేసుకోకూడదు. 

పిల్లలూ... పదునైన వస్తువులు : కొంతమంది పిల్లలు తమ తెలిసీ తెలియనిదనంతో గుచ్చుకు΄ోయేలా ఉండే వాడిౖయెన / పదునునైన వస్తువులు చెవుల్లో పెట్టుకుంటారు. ఉదాహరణకు పెన్సిళ్లు, పుల్లలు, పెన్నులు, పిన్నులు  వంటివి. వాటితో కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు కూడా ఉంటుంది. దాంతో భవిష్యత్తులో వినికిడి సమస్యలు రావచ్చు. అందుకే అలాంటి వస్తువుల నుంచి చిన్నారులను దూరగా ఉంచాలి. 

నూనె పోయకూడదు : చెవులను శుభ్రం చేయడానికి కొందరు కొబ్బరి నూనె, ఆముదం లాంటివి చెవుల్లో పోస్తుంటారు. అలా ఎంతమాత్రమూ చేయకూడదు. అలా చేయడం వల్ల చెవి ఇన్ఫెక్షన్‌తో పాటు మరెన్నో సమస్యలు రావచ్చు. ఏవైనా సమస్యలుంటే ఈఎన్‌టీ వైద్యులతో సరైన చికిత్స తీసుకోవాలి.

చర్మ సంరక్షణకోసం... 
కొంతమందిలో చర్మం పొడిబారడం ఓ సమస్యగా మారుతుంది. ఇలాంటివారు తరచూ మాయిశ్చరైజింగ్‌ క్రీమ్స్‌ రాసుకోవాలి. వేసవికాలంలో ఈ సమస్య పెద్దగా లేక΄ోయినా చలికాలంలో వారిని మరింతగా బాధపెడుతుంటుంది. అందుకే ఆ సీజన్‌లో తప్పనిసరిగా రాసుకోవాలి. లేకపోతే చర్మం మీద మంట, దురద వస్తాయి. పొడిచర్మం ఉన్నవారి పైచర్మం దోక్కుపోయినప్పుడు... కిందిచర్మం తేలిగ్గా ఇన్ఫెక్షన్‌(Infection)కు దారితీయవచ్చు. 

ఎండలోకి వెళ్లేటప్పుడు అది సీజన్‌ అయినా సరైన ఎస్‌పీఎఫ్‌ ఉన్న సన్‌ స్క్రీన్‌ రాసుకోవాలి. దీన్ని ప్రతి మూడు గంటలకోమారు రాసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు శరీరమంతా కప్పేలా ఫుల్‌ స్లీవ్స్‌ వేసుకోవడం మంచిది. ముఖం మీది చర్మం కూడా కవర్‌ అయ్యేలా స్కార్ఫ్‌ ధరించడం మేలు 

ఇక శరీరంప్లై చర్మం ముడుతలు పడి ఉండే మెడ, భుజాలు, బాహుమూలాల వద్ద, తొడలు, గజ్జల వంటి చోట్ల శుభ్రంగా, పొడిగా ఉంచుకోకపోతే అక్కడ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే స్నానం తర్వాత చర్మం ముడుతలు ఉన్నచోట్ల ప్రత్యేకంగా పూర్తిగా పొడిగా అయ్యేలా టవల్‌తో తుడుచుకోవాలి.

డయాబెటిస్‌ ఉన్నవారి పాదసంరక్షణకు...
ఇవి డయాబెటిస్‌ ఉన్నవారికే కాకుండా, ఆరోగ్యవంతులు కూడా పాటించడానికి అనువైన నియమాలని గుర్తుంచుకోండి. కాకపోతే డయాబెటిస్‌ ఉన్నవారికి మరింత మేలు చేస్తాయి. 

  • తరచూ తామే స్వయంగా కాలిని పరీక్షించుకుంటూ ఉండాలి. ఇలా చేసే సమయంలో కాలి పైభాగాన్నీ నిశితంగా పరీక్షించుకోవడం వీలవుతుంది. కానీ కిందనుండే పాదం భాగం కనిపించదు కాబట్టి దాన్ని పరిశీలించడానికి పాదాల కింద అద్దం పెట్టి చూసుకోవాలి. అలాగే కాలి వేళ్ల మధ్య భాగాలనూ అంతే నిశితంగా పరీక్షించుకుంటూ ఉండాలి. మొత్తం కాలిభాగంలో ఏ చిన్న పొక్కులాంటిది ఉన్నా దాన్ని విస్మరించకూడదు. భవిష్యత్తులో అది పుండుగా మారే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్‌ సమస్యతో బాధపడేవారిలో పుండ్లు పడటం వల్ల గ్యాంగ్రీన్‌ ఏర్పడితే ఒక్కోసారి పూర్తి పాదాన్ని, కాలిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాదాలను ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. 

  • రోజూ కాళ్లు కడుక్కున్న తర్వాత వెంటనే పూర్తిగా పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య కూడా పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా పొడిబారడం కోసం కాలివేళ్ల మధ్య పౌడర్‌ రాసుకోవడం మంచిది. 

  • మరీ వేడి వస్తువులూ, పదార్థాల నుంచి కాళ్లను దూరంగా ఉంచుకోవాలి.  డయాబెటిస్‌ ఉన్నవారు హాట్‌ వాటర్‌ బ్యాగ్‌తో కాళ్లకు కాపడం పెట్టుకోక΄ోవడమే మంచిది. పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుక్కున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వాజిలైన్‌ను కాలికీ, వేళ్లకూ మధ్య రుద్దుతూ, ఆ వాజిలైన్‌ తడిదనం, జిడ్డుదనం పోయేలా పూర్తిగా పొడిబారేంతవరకు మృదువుగా రుద్దాలి. అలా ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి.  

  • కాళ్ల మీద పులిపిరి కాయలూ, కాలి కింద ఆనెకాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే వెంటనే డాక్టర్‌కు చూపించుకోవాలి. 

  • కాలిగోళ్లను క్రమం తప్పకుండా తొలగించుకోవాలి. ఇలా చేసేటప్పుడు గోళ్లను మరీ లోపలికి కట్‌ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరు మూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్‌ కావచ్చు. అలా జరిగిన కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. ఇది డయాబెటిస్‌ రోగుల్లో చాలా ప్రమాదం. 

  • కాలికి చెప్పులు, బూట్లు వంటి పాదరక్షలు లేకుండా నడవకూడదు. ఇవి కూడా కాలికి చాలా సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా ఆ పాదరక్షలు వాడకూడదు. ఎందుకంటే మన సొంత పాదరక్షల వల్ల ఏదైనా చిన్నపాటి గాయం అయినా మళ్లీ అదే గాయం రేగి ఎప్పటికీ మానక΄ోతే అది గ్యాంగ్రీన్‌గా మారే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్‌ బాధితుల్లో దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. 

  • ఇంట్లో కూడా పాదరక్షలు లేకుండా నడవకండి. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు (ఆమాటకొస్తే పురుషులు కూడా) స్లిప్పర్స్‌ వంటివి తొడుక్కునే తమ రోజువారీ ఇంటి పనులు చేసుకోవడం మంచిది. 

  • డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులైతే కనీసం ఏడాదికోసారి ఆర్థోపెడిక్‌ లేదా మెడికల్‌ స్పెషలిస్ట్‌ వంటి కాలి వైద్య నిపుణులకు చూపించుకుంటూ ఉండాలి.

చేతుల పరిరక్షణ
ఆహారం తీసుకునే ముందర  చేతుల్ని తప్పనిసరిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇక  మూత్ర, మల విసర్జన తర్వాత (అంటే వాష్‌రూమ్‌కు వెళ్లి వచ్చాక) రెండు చేతులనూ తప్పనిసరిగా శుభ్రంగా కడుక్కోవాలి. దీనికో కారణముంది. వాష్‌రూమ్‌ తలుపు తెరిచే సమయంలో ‘నాబ్‌’ను చాలామంది ముట్టుకుంటారు. వాళ్ల చేతుల్లో ఏవైనా బ్యాక్టీరియల్, వైరల్, ఏకకణజీవుల వంటి పరాన్నజీవులు ఉంటే... వారు ముట్టుకున్న చోటిని మళ్లీ మనం ముట్టుకోవడం వల్ల మనకూ ఆ వైరస్, బ్యాక్టీరియా, ఏకకణజీవులు సంక్రమించవచ్చు. ఇలా జబ్బు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడాన్ని  ‘ఫోమైట్‌ ట్రాన్స్‌మిషన్‌’గా చెబుతారు. ఇలా ఈ మార్గంలో వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున వాష్‌రూమ్‌కు వెళ్లివచ్చాక తప్పక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. 

కాళ్లు / పాదాల శుభ్రత...
కాళ్లు లేదా పాదాలకు సమస్య వచ్చినప్పుడు తప్ప వాటి ఉనికినే మనమెవరమూ గుర్తించం. ప్రతిరోజూ పాదాలను పరీక్షించుకుంటూ ఉండటం అవసరం. మరీ ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవారైతే... రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పాదాలు, మడమలు శుభ్రంగా ఉన్నాయా లేక ఏవైనా పగుళ్లు ఉన్నాయా అన్నది పరీక్షించుకోవాలి. పాదాలపై పుండ్లుగానీ, ఇన్ఫెక్షన్లుగానీ, పగుళ్లుగానీ ఏర్పడకుండా సంరక్షింకుంటూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాదాలు కడుక్కున్న తర్వాత అవి పూర్తిగా ΄÷డిగా మారేలా తుడుచుకోవాలి. కాలివేళ్ల గోళ్లు తీసుకుంటూ ఉండాలి.

గోళ్లను..
గోళ్లను క్రమం తప్పకుండా ట్రిమ్‌ చేసుకోవాలి. అంటే గోరు చివరకంటా కత్తిరించకుండా, కొద్దిపాటి గోరంచు ఉండేలా ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గోళ్లలో మట్టి చేరదు. ఇలా మట్టిచేరకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవడం వల్ల మనం భోజనం చేసే సమయంలో గోళ్ల ద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది. 

(చదవండి: నిజమైన ప్రేమ అంటే ఇది కదా..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement