‘‘పారిశుద్ధ్య కార్మికులు నిజమైన దేవుళ్లని ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమంలో మీరే అన్నారు. ఇప్పుడు న్యాయమైన కోరికలు తీర్చాలని అడిగితే ఆ దేవుళ్లు దయ్యాలయ్యారా?..’’ అని సీఎం కేసీఆర్‌పై విపక్షాల నేతలు మండిపడ్డారు. కార్మిక దేవుళ్లు రోడ్డున పడి ధర్నాలు చేస్తుంటే పట్టించుకోవడం లేదేమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం దేవుళ్లకు వందల కోట్లు ఖర్చు చేస్తోందని, అందులో కొంత డబ్బు కేటాయించినా కార్మికుల బతుకులు బాగుపడతాయని పేర్కొన్నారు. మున్సిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద జరిగిన ‘మహా ధర్నా’లో వివిధ పార్టీల నేతలు పాల్గొని మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్ మొన్న యాదగిరిగుట్టకు వెళ్లి లక్ష్మీనరసింహ స్వామికి రూ.200 కోట్లు ఇచ్చారు. పండుగలూ బ్రహ్మండంగా చేస్తున్నారు. లక్ష్మీ నరసింహ స్వామి ఏమైనా సమ్మె చేశారా?’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఓ అలవాటు ఉందని. ఆయనకు దండం పెడితే కోరికలు తీరవని, దండం తీస్తేనే తీరుతాయని వ్యాఖ్యానించారు. పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వం గడ్డిపోచ కింద లెక్కగడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఆ గడ్డిపోచలు కలిస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉరితాడు తయారవుతుందని మరిచిపోవద్దని.. కార్మికుల సమస్యల పరిష్కారంపై పట్టింపులకు పోవద్దని కేసీఆర్‌కు సూచించారు. మన రాష్ట్రం, మన ప్రభుత్వం వచ్చిందనుకుంటే రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు ‘చెత్తశుద్ధి’ ఉంటే స్వచ్ఛ హైదరాబాద్ అంటూ మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఇప్పుడు రోడ్లపైకి పంపాలని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఎద్దేవా చేశారు. ఈ మహాధర్నాలో టీడీపీ నేత కృష్ణయాదవ్, బీజేపీ నేత కృష్ణమూర్తి, అన్వేష్ (సీపీఐఎంఎల్), జానకీరాములు (ఆర్‌ఎస్‌పీ), వెంకట్‌రెడ్డి(ఆప్), కార్మిక సంఘాల నేతలు పాలడుగు భాస్కర్ (సీఐటీయూ), ఏసురత్నం (ఏఐటీయూసీ), కృష్ణ (ఐఎఫ్‌టీయూ), సుధీర్(ఏఐటీయూసీ), రామారావు మాట్లాడారు.
Published Sun, Jul 12 2015 9:35 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement