
కరోనా వైరస్ వ్యాప్తి భారతదేశంలోని పారిశుధ్య కార్మికులపట్ల మన అవగాహనను ఉన్నట్లుండి మార్చివేసింది. ఇన్నాళ్లుగా వీరిని నీచంగా చూస్తూ, గౌరవించడానికి, ఆత్మగౌరవానికి అర్హత లేనివారిగా భావిస్తూ వచ్చిన సంపన్నులు తమ ప్రాణాలు.. ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు ప్రమాదంలో పడిపోవడంతో డాక్టర్లు, నర్సులతో సమానంగా పారిశుధ్య కార్మికులను గుర్తించడం మొదలెట్టేశారు. ఇది కరోనా మహమ్మారి తెచ్చిన మార్పు. ఎలాంటి రక్షణ సామగ్రి ధరించకుండానే ప్రాణాం తక వైరస్‌కు వ్యతిరేకంగా రాత్రింబవళ్లు రహదారులు శుభ్రం చేస్తూ, బ్లీచింగ్ పౌడర్ స్ప్రే చేస్తూ వస్తున్న సఫాయి సైనికుల శ్రమను ఇన్నాళ్లుగా మన సమాజం విలువలేని పనిగా చూస్తూ వచ్చింది.
ఇప్పుడు సరిహద్దుల్లోని సైనికుల త్యాగాన్ని, సాహసాన్ని పోలిన పనిగా సఫాయి కార్మికుల సేవలను జాతి గుర్తిస్తోంది.
కానీ తమ పని ముగించిన తర్వాత ఇంట్లో వారు కనీస సౌకర్యాలతో జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతి రక్షకులుగా సఫాయి కార్మికులను మన జాతీయవాదం ఎన్నడైనా గుర్తిం చిందా? వారికి మంచి జీవన పరిస్థితులను అందించిందా? కరోనా సైతాన్ లేక కరోనా రక్కసి సంపన్నులూ, నిరుపేదలూ తేడా లేకుండా అందరి ప్రాణాలూ తీస్తున్న సమయంలో జాతి ప్రాణాలు కాపాడటానికి ఎంతమంది పవిత్ర మూర్తులు మన రహదారులపై పోరాడుతున్నారో కదా. ఆలయాలూ, చర్చీలూ, మసీదులూ, విహా రాలు మొత్తం లాక్‌డౌన్ అయి ఉంటున్న నేపథ్యంలో మన పూజారులూ, సన్యాసులూ, బిషప్‌లూ, ముల్లాలు, సాధువులూ అందరూ సామాన్య మానవుల్లాగా ఇంటిపట్టునే ఉండిపోతున్నారు. ఈశ్వరుడూ, ప్రభువూ, అల్లా వాస్తవంగానే మన సఫాయి సైనికుల్లో కనిపిస్తున్నారు.
నిస్సందేహంగానే కరోనా అనంతరం ప్రపంచంలోంచి మతం అంతరించిపోదు. కానీ పూజారులు, బిషప్‌లు, ముల్లాలు, సన్యాసుల కంటే రహదారులను శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికులే దేవుళ్లుగా కనిపిస్తున్నారిప్పుడు. సఫాయి కార్మికులే ప్రస్తుతం అత్యంత పరిశుద్ధమైన, స్వచ్ఛమైన ప్రజలు. ఇకనుండి కరోనా అనంతర ప్రపంచంలో వీరికే అత్యంత గౌరవం లభించాల్సి ఉంటుంది. భారత్‌లో సఫాయి కార్మికులు దాదాపుగా అంటరానితనం నేపథ్యంలోంచి వచ్చినవారే అన్నది మరవరాదు. మనలో చాలామంది భార్యాపిల్లలను సైతం ముట్టకుండా భౌతిక దూరం పాటిస్తున్న కాలంలో యావన్మంది ప్రాణాలు కాపాడటానికి ఈ సఫాయి కార్మికులు ఎందుకోసం, ఎలా పనిచేస్తున్నారు? దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటిస్తున్న సమయంలో ప్రధాని నరేంద్రమోదీ.. రాష్ట్రపతి నుంచి కింది స్థాయి వరకు అధిక వేతనాలు పొందుతున్న వారి వేతనాల్లో 30 శాతం కోత విధిస్తున్న్టట్లు ప్రకటిం చారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమవైన వేతనాల కోతను ప్రకటించాయి. కానీ సఫాయి కార్మికుల వేతనాలను 30 శాతం వరకు పెంచడం జాతీయవాద చర్య కాదా? అలాంటి సానుకూల జాతీయవాద చర్యగురించి ప్రధాని ఎందుకు ఆలోచించరు?
ఒక గొప్ప జాతీయవాద పనిని సాహసంతో, నిబద్ధతతో చేస్తున్న సఫాయి కార్మికులను ప్రశంసించడంతో సరిపెట్టుకోకూడదు. కరోనా వైరస్ నేపథ్యంలో రహదారులను శుభ్రం చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న వారికి సంపన్నులు పది రూపాయల నోట్ల దండ వేసి అలంకరించడం నైతికంగా సరైంది కాదు. మాతృభూమి నిజమైన సేవకుల వేతనాలు ఎల్లప్పుడు తక్కువగానే ఉంటున్నాయని దేశానికి, జాతీయవాదులకూ తెలుసు. వారిప్పుడు పొందుతున్న వేతనాలు మంచి తిండి తినడానికి, చక్కటి ఇంట్లో ఉండటానికి, పారంపర్యంగా వస్తున్న వృత్తినుంచి బయటపడేయగల మంచి చదువును తమ పిల్లలకు అందించడానికి ఏమాత్రం సరిపోవడం లేదు. పైగా వీరి వృత్తిని సాధారణంగా అగౌరవించడమే మనకు తెలుసు. దాన్ని హీనంగా భావించడమే మనకు తెలుసు. నిజానికి కరోనా మహమ్మారి మన సంపన్నులను ఒక్కసారిగా నేలమీదికి దింపింది. మీరు ఎంత ఎక్కువగా ప్రయాణిస్తే అంత ఎక్కువగా ఈ సైతాన్ బారిన పడడం ఖాయమని కరోనా తేల్చిచెప్పేసింది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆసుపత్రులు కూడా ఇప్పుడు మిమ్మల్ని రక్షించలేవు. అదే సమయంలో సఫాయి సైనికులు ఈ మహమ్మారికి ఎందుకు భయపడటం లేదు? ఎందుకంటే వారు ఈ మట్టిలో పుట్టారు. ఈ మట్టిలో పెరుగుతున్నారు. సంపన్నులు తినడానికి ఇష్టపడని తిండి (గొడ్డు మాసంతో సహా) తింటున్నారు. అయినప్పటికీ ముఖాలకు మాస్కులు కూడా లేకుండానే వీరు వీధుల్లో, రహదారుల్లో కరో నాతో తలపడుతున్నారు. ఇదెలా సాధ్యమైంది?
ఎలాగంటే, ఈ మట్టిలో ఎంత ఎక్కువగా మీరు గడిపితే, మీ చేతులతో ఈ నేలను శుభ్రం చేస్తే.. అంత ఎక్కువ ధైర్యం, ఆత్మవిశ్వాసం, శక్తితో మీరు ఈ మహమ్మారితో పోట్లాడగలరు. బంగ్లా లలో కాకుండా గుడిసెల్లో జీవిస్తున్న ఈ నిరుపేదలకు అంతటి ధైర్యం, నమ్మకం, శక్తి ఎక్కడినుంచి వస్తున్నాయి? తాము మట్టినుంచే వచ్చామని, మహమ్మారి తమపై దాడిచేస్తే అదే మట్టిలో తాము కలిసిపోతామన్న కనీస విజ్ఞతనుంచి వారికి ఈ లక్షణాలు అబ్బుతున్నాయి. అలాంటి ఎన్నో మహమ్మారుల బారినపడే వారు జీవిస్తూ వచ్చారు. ఇలా కాకుండా ఏసీలతో కూడిన అసమానమైన జీవితం గడుపుతున్నట్లయితే సంపన్నులకు ఇక భద్రత ఉండదని కరోనా తేల్చి చెప్పింది. ఆసుపత్రులు మిమ్మల్ని కాపాడలేవని, తాము ఇన్నాళ్లుగా ద్వేషిస్తూ వస్తున్న నిరుపేదలే నిజంగా మిమ్మల్ని కాపాడగలరని కరోనా వారికి తేటతెల్లం చేసింది.
ఈ కరోనా సంక్షోభకాలంలో తమకూ సమాన సమానస్థాయి వేతనాలు ఇవ్వాలని, మానవుల్లాగా తమనూ సమానస్థాయిలో గౌరవించాలని వీరు ఒక్కరోజు సమ్మెకు దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అదే జరిగితే కరోనా వైరస్ భయంతో మనందరం రోడ్లమీదే చనిపోతాం. మనం నిజంగా జాతీయవాదులమే అయితే, ఈ ప్రాణాంతక వైరస్ బాంబు బారినుంచి మనల్ని కాపాడటానికి దేశవ్యాప్తంగా వీధివీధిలోనూ పోరాడుతున్న సఫాయి సైని కుల జీవితాలను మెరుగుపర్చడం ద్వారా అసమానతలను తగ్గించాలని తీర్మానించుకుందాం.
ప్రొ‘‘ కంచ ఐలయ్య
షెపర్డ్
వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్
సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇన్‌క్లూజివ్ పాలసీ
Comments
Please login to add a commentAdd a comment