
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు సేవలు అమోఘమని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కొనియాడారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తరపున వారికి ధన్యవాదాలు తెలిపారు. కరోనా నివారణ చర్యలపై సీఎం కేసీఆర్ మాటలకు, చేతలకు చాలా తేడా ఉందని ఆయన విమర్శించారు. 20 రోజులుగా లాక్‌డౌన్ కొనసాగుతుందని.. నేటికి పేదలకు రేషన్, నగదు చాలా వరకు అందలేదన్నారు. కరోనా నియంత్రణ చర్యల పట్ల నిర్లక్ష్యం వహించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని పేర్కొన్నారు.
కరోనా పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. బత్తాయి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేలా చూడాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మార్కెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. వైద్య సిబ్బందికి తగినన్ని పీపీఈ కిట్లు, రక్షణ పరికరాల అందుబాటులో ఉంచాలన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వైద్య సౌకర్యాల మెరుగు కోసం మినరల్ ఫండ్ వాడుకోవాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment