ఢిల్లీలో దీపం వెలిగిస్తున్న కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై మానవాళి ఐక్యంగా పోరాటం చేయాల్సిన సమయంలో కొంతమంది పనిగట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఒకవైపు విపత్కర పరిస్థితులు నెలకొంటే దీపాలు వెలిగించే అంశాన్ని కొంతమంది రాజకీయం చేయడం మంచిదికాదన్నారు. దీపాలు వెలిగించడం చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలని హితవు పలికారు. ఇలాంటి నేతలకు జ్ఞానం లేదా? అంటూ మండిపడ్డారు. కుల, మతాలకు, రాజకీయాలకు అతీతంగా కరోనాపై పోరాటం చేయాల్సిన సమయం ఇదని గుర్తు చేశారు.
కరోనా మహమ్మారిని ఓడించాలంటే ఆత్మవిశ్వాసం, ఐకమత్యం,సేవాభావం, అంకిత భావమే మార్గాలని స్పష్టం చేశారు. ప్రజలు ఆత్మస్థైర్యంతో పోరాడాలన్నారు. కరోనాతో జరుగుతోన్న యుద్ధంలో పాల్గొంటున్న సివిల్ సర్వీసెస్ మొదలుకుని గ్రూప్ 4 ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బంది కనీసం గంట కూడా కుటుంబ సభ్యులతో గడపలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment