సాక్షి, హైదరాబాద్ : శత్రుసైన్యం దాడులను తిప్పికొట్టడానికి యోధులతో కూడిన సైనిక బలగాన్ని ముందు వరుస (ఫ్రంట్‌లైన్)లో మోహరించడం యుద్ధ వ్యూహం. ప్రాణాలను లెక్కచేయకుండా శత్రువులపై ఈ బలగం విరుచుకుపడి అంతు చూస్తుంది. ఒకవేళ శత్రువుల ధాటికి ముందు వరుసలోని సైన్యం దెబ్బతింటే పోరాటం కష్టంగా మారుతుంది. ప్రస్తుతం కరోనాతో యుద్ధం చేస్తున్న వైద్యులపైనా వైరస్ ఇలాగే దాడి చేస్తోంది. వివిధ దేశాల్లో కరోనా బారిన పడిన ప్రజలను రక్షించేందుకు వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తుండగా పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు సైతం ముందు వరుసలో నిలిచి వారి వంతు పాత్ర పోషిస్తున్నారు.
అయితే వివిధ దేశాల్లో అనూహ్యంగా పుంజుకుంటున్న వైరస్ ఈ క్రమంలో వందల మంది వైద్యులు, వైద్య సిబ్బందిని బలితీసుకుంది. మన దేశంలోనూ 31 మంది వైద్యులు, ముగ్గురు నర్సులు కరోనాతో మరణించినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఇటీవల ప్రకటించింది. పీపీఈ కిట్లు, ఎన్–95 మాస్కులు, చేతి గ్లౌజులు ధరించి వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా బారి నుంచి తప్పించుకోలేకపోయారు. రాష్ట్రంలోనూ పదుల సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, జర్నలిస్టులకు కరోనా సోకింది. వారిలో కొందరు మరణించడం సామాన్యుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులకు సైతం..
జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న ఐదుగురు పారిశుద్ధ్య సిబ్బంది సైతం కరోనా బారినపడ్డట్లు ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. కంటైన్మెంట్ జోన్లలో పనిచేయడం వల్ల వారిలో చాలా మందికి వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. వైరస్ బారిన పడకుండా గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలను జీహెచ్‌ఎంసీ సరఫరా> చేసినా కార్మికులకు కరోనా సోకడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అంబర్‌పేటలో పనిచేస్తున్న మహిళా స్వీపర్‌తోపాటు ఆమె కుటుంబంలోని నలుగురికి కరోనా సోకింది. లంగర్‌హౌజ్‌లో పనిచేసే ఓ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్‌తోపాటు జియాగూడలో మరో పారిశుద్ధ్య కార్మికుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని బల్దియా వర్గాలు తెలిపాయి.
15 మంది జర్నలిస్టులకు కూడా..
హైదరాబాద్‌లో 15 మంది జర్నలిస్టులు కరోనా బారినపడగా వారిలో ఓ న్యూస్ చానల్‌లో పనిచేస్తున్న రిపోర్టర్ ఆదివారం మరణించారు. హైదరాబాద్ నుంచి పనిచేస్తున్న ఓ జాతీయ న్యూస్ చానల్‌లో 8 మందికి, మరో ప్రముఖ అంగ్ల మీడియా సంస్థలో నలుగురికి, మరో రెండు స్థానిక మీడియా సంస్థల్లో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది.
63 మంది వైద్యులకు...
ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, పేట్ల బురుజు ప్రసూతి, నిమ్స్, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 63మంది వైద్యులు, పదుల సంఖ్యలో వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, అనుబంధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 44 మంది పీజీ రెసిడెంట్ డాక్టర్లు, నలుగురు వైద్య అధ్యాపకులు, గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఇద్దరు పీజీ రెసిడెంట్ డాక్టర్లు, ఓ సీనియర్ రెసిడెంట్ డాక్టర్, ఓ అధ్యాపకుడు, నిమ్స్‌లో 9మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, ముగ్గురు వైద్య అధ్యాపకులకు కరోనా పాజిటివ్ నమోదైంది. నిమ్స్‌లో ఒక ప్రొఫెసర్ సహా నలుగురు కార్డియాలజిస్టులు వ్యాధి బారినపడటంతో ఓపీ సేవలు ఆపారు. సహజ, సిజేరియన్ ప్రసవాలతోపాటు చెకప్‌ల సమయంలో గర్భిణులను ముట్టుకోవాల్సి రావడం వారితో గైనకాలజిస్టులే ఎక్కువగా వైరస్ బారినపడ్డారు.
ఖాకీలపైనా పంజా...
పోలీసులు సైతం వైరస్ నుంచి ముప్పు ఎదుర్కొంటున్నా రు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 మంది కరోనా బారినపడినట్టు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. పాతబస్తీ పరిధిలోని పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న 23 మంది, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నలుగురు, ఇతర విభాగాల్లో మరో నలుగురికి కరోనా సోకిందని తెలుస్తోంది. కరోనా సోకిన పోలీసు సిబ్బంది ద్వారా వారి కుటుంబ సభ్యుల్లో చాలామంది వైరస్ బారినపడ్డట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్‌లో కానిస్టేబుల్ దయాకర్‌రెడ్డి కరోనాతో మృతిచెందడం మరవక ముందే పదుల సంఖ్యలో సిబ్బంది వైరస్ బారినపడటంతో ఉన్నతాధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment