ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ : పంచాయతీ కార్మికులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. దశాబ్దాలుగా కనీస వేతనాలకు నోచుకోవడం లేదు. నామమాత్రపు వేతనాలతో పనిచేస్తున్నా అవి కూడా సకాలంలో అందక అవస్థలు పడుతున్నారు. నెలల తరబడి వేతన బకాయిలు పేరుకుపోతున్నా పట్టించుకునే నాథుడు లేడు. జిల్లాలోని 1,028 పంచాయతీలున్నాయి. వీటిలో కొన్నిచోట్ల మాత్రమే పారిశుధ్య కార్మికులు, టైమ్‌స్కేల్ కార్మికులు, పర్మినెంట్, టెండర్, ఎన్‌ఎంఆర్ విధానంలో కార్మికులు పనిచేస్తున్నారు. పర్మినెంట్, టైమ్ స్కేల్ కార్మికులు సుమారుగా 125 మంది వరకు ఉన్నారు.
పారిశుధ్య కార్మికులు దాదాపుగా వెయ్యి మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో పర్మినెంట్ కార్మికులకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని 2011 సెప్టెంబర్‌లో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జాయింట్ కలెక్టర్ అధ్యక్షునిగా, జిల్లా పంచాయతీ అధికారి, డీఎల్‌పీవోతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. వీరు పర్మినెంట్ కార్మికులను గుర్తించి పంపిస్తే ప్రభుత్వం ఖజానా శాఖ ద్వారా జీతాలు చెల్లిస్తుంది. ఇలా చేయడం వల్ల పర్మినెంట్ కార్మికులున్న పంచాయతీలకు ఆర్థిక భారం తగ్గుతుంది. మిగిలిన పార్ట్‌టైం, ఎన్‌ఎంఆర్, పారిశుధ్య కార్మికులకు పంచాయతీలు వేతనాలిచ్చేందుకు వెసులుబాటు కలుగుతుంది.
అయితే జిల్లాలో పర్మినెంట్ కార్మికులను గుర్తించి నివేదిక పంపించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శేషయ్య ఆరోపించారు. కొన్ని పంచాయతీల్లో కార్మికులకు నెలల తరబడి వేతనం అందక ఇబ్బంది పడుతున్నారు. కురిచేడు, టంగుటూరు, నాగులుప్పలపాడు, కొత్తపట్నం, అల్లూరు, పర్చూరు నియోజకవర్గంలోని నూతలపాడు గ్రామపంచాయతీ, కొత్తపాలెం(చీరాల), బీ నిడమానూరు పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు నేటికీ వేతనం అందక అవస్థలు పడుతున్నారు.
పంచాయతీల్లో కార్మికులను నియమించే టెండర్ ప్రతిపాదనలను సకాలంలో జిల్లా పంచాయతీ కార్యాలయానికి పంపించడంలో కార్యదర్శులు, ఈఓలు అలవిమాలిన నిర్లక్ష్యం వహిస్తున్నందున కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి. టంగుటూరు పంచాయతీలో టైమ్ స్కేల్ కార్మికుల ఫైల్ రెన్యువల్‌లో పురోగతి కనిపించడం లేదు. కార్మికులపై డీపీవో అధికారుల వైఖరిని తప్పుబడుతూ యూనియన్ నాయకులు ఫిర్యాదు చేయడంతో.. అధికారులను కలెక్టర్ పలుమార్లు మందలించారు. అయినా వారిలో మార్పు రావడం లేదు.
హామీలు గాలికి..: పంచాయతీ కార్మికులు ప్రభుత్వంతో పోరాడి సాధించుకున్న ఏడు జీవోలు అమలుకు నోచుకోలేదని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు శేషయ్య డిమాండ్ చేశారు.
పంచాయతీల్లో కార్మికుల కష్టాలు
Published Mon, Jun 9 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM
Advertisement
Advertisement