అక్రమాలకు చెక్
► జీహెచ్‌ఎంసీ ప్రక్షాళన
► అధికారాలు, బాధ్యతల వికేంద్రీకరణ
► ఏరియా కమిటీలు.. స్థానిక సంఘాలకు ప్రాధాన్యం
► సమస్యల గుర్తింపు.. పరిష్కారం బాధ్యత వాటిదే
► అక్రమాల నిరోధంపై అధికారుల దృష్టి లోపాల సవరణకు చర్యలు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో అవినీతి.. అక్రమాలకు... అలసత్వానికి... చెక్ పెట్టే దిశగా ఉన్నతాధికారులు కదులుతున్నారు. సమూలంగా ప్రక్షాళన చేయాలనే యోచనతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జీహెచ్‌ఎంసీలోని ఏ విభాగంలో చూసినా అలసత్వం. ఫలితంగా ప్రజలకు అవస్థలు. మరోవైపు అంతులేని అక్రమాలు. కొందరికే అధికారాలు. దీంతో అవినీతి పేట్రేగిపోతోంది. దిద్దుబాటు చర్యలకు ఎవరైనా సిద్ధమైతే అడుగడుగునా ఆటంకాలు. అవినీతిపరులపై చర్యలు తీసుకోకుండా ఒత్తిళ్లు. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా వివిధ కోణాల్లో ఆలోచించిన ఉన్నతాధికారులు ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చారు. గత అనుభవాలనూ పరిగణనలోకి తీసుకొని వికేంద్రీకరణ మంత్రమే ప్రస్తుతానికి తగిన మందుగా భావించారు. దశల వారీగా సంస్కరణ ల అమలుకు సిద్ధమయ్యారు. ప్రతి విభాగంలోనూ పనులు అవినీతికి... ఆలస్యానికి తావులేకుండా... పారదర్శకంగా పూర్తయ్యేలా ‘స్టాండర్డ్ ప్రొసీజర్స్’పై దృష్టి సారించారు. దీనికి కన్సల్టెన్సీల సేవలు వినియోగించుకోనున్నారు.వివిధ విభాగాల ప్రక్షాళనకు ఎలాంటి చర్యలు? ఏ స్థాయిలో తీసుకోవాలి? అనే అంశాలపై కన్సల్టెన్సీలు నివేదికలు అందజేస్తాయి. వాటి ఆధారంగా చర్యలు చేపడతారు.
‘స్థానిక’ కమిటీలకు ప్రాధాన్యం
పారిశుద్ధ్యం, రహదారుల మరమ్మతులు.. తదితర అంశాల్లో ఏరియా కమిటీలకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం 5వేల జనాభాకు ఒక ఏరియా కమిటీ ఏర్పాటుకు వీలుంది. దీన్ని రెండు లేదా మూడు వేల మందికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. దీనికోసం చట్టాన్ని సవరించాల్సి ఉన్నందున ఆ దిశగా ఆలోచిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానాలు సత్ఫలితాలిస్తున్నందున ఈ ఆలోచన చేశారు. స్థానిక సమస్యలను గుర్తించడం.. సంబంధిత విధులు నిర్వహించే వారికి వాటిని తెలియజేయడం.. పరిష్కరించడం వంటి పనులు ఏరియా కమిటీలు చేస్తాయి.
పారిశుద్ధ్య కార్మికులకు ఆధార్ లింక్
పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు ఉన్నాయి. జాబితాలో ఒకరు, విధుల్లో మరొకరు ఉంటుండం.. అసలు విధుల్లోనే లేకపోవడం వంటి అంశాలు దృష్టికి రావడంతో వారందరికీ త్వరలోనే ఆధార్ లింకేజీతో గుర్తింపు కార్డులు ఇచ్చే యోచనలో ఉన్నారు. తద్వారా విధులు ఎగ్గొట్టే వారికి జీతాలు నిలిపివేయాలని భావిస్తున్నారు.
ఏఎంఓహెచ్‌ల స్థానే ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్లు
పారిశుద్ధ్య కార్మికుల పనిని పర్యవేక్షిస్తున్న ఏఎంఓహెచ్‌ల స్థానే త్వరలో ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. చెత్త తరలింపు వాహనాలకు సంబంధించిన రవాణ విభాగాన్ని వికేంద్రీకరించి... పనులను విభజించి నిర్ణీత మొత్తం వరకు ఈఈ, డీఈఈల స్థాయిలోనే మంజూరు చేసేలా అధికారం ఇవ్వాలని యోచిస్తున్నారు. దుబారా నివారణకు అధీకృత డీలర్ల ద్వారానే విడిభాగాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రెండు, మూడేళ్ల వరకు వాహనాల మరమ్మతులు సంబంధిత కంపెనీలే చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఏదైనా వాహనం పాడైతే సంబంధిత కంపెనీయే నిర్ణీత వ్యవధిలోగా మరమ్మతు చేయాల్సి ఉంటుంది. జాప్యమయ్యేకొద్దీ పెనాల్టీ విధిస్తారు. సర్కిళ్ల వారీగా కొన్ని వాహనాలను రిజర్వులో ఉంచి, మరమ్మతుకు గురైన వాటి స్థానంలో వినియోగించనున్నట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి విలేకరులకు తెలిపారు.
అక్రమార్కులపై చర్యలు
ఇటీవలి కాలంలో వివిధ విభాగాల్లోని అవినీతిపై ఫిర్యాదులు అందుతుండటంతో అక్రమాలపై విచారణలు జరుగుతున్నాయని... బాధ్యులపై చర్యలు తప్పవని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎంతోకాలం క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభమైందని.. త్వరలోనే చర్యలుంటాయని తెలిపారు.