G H MC
-
210 చెట్లు నేల మట్టం
► గాలివానతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ► చెట్లు కూలడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ► రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ బృందాలు ► జీహెచ్ఎంసీ కమిషనర్ సుడిగాలి పర్యటన సాక్షి, సిటీబ్యూరో: మహా నగరంలో ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి సుమారు 210 చెట్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రధాన మార్గాల్లో వాహన రాకపోకలకు ఇబ్బందులు నెలకొన్నాయి. రాత్రి నుంచే జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు రంగంలో దిగగా.. ఆదివారం ఉదయం సాక్షాత్తు జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి. జనార్థన్‌రెడ్డి రంగ ంలో దిగి నాలుగు గంటల పాటు పర్యటించారు. సెంట్రల్ జోన్ పరిధిలోని అబిడ్స్, సుల్తాన్ బజార్, సౌత్ జోన్ పరిధిలోని మలక్‌పేట, ఇమ్లిబన్ పార్క్, సైదాబాద్ ప్రాంతాల్లో పర్యటించి పనులను కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీ, విద్యుత్ తదితర బృందాలను అప్రమత్తం చేయడంతో హుటాహుటిన ప్రధాన మార్గాలపై కూలిన చెట్లను తొలగించారు. కూలిన చెట్లు ఇలా.. సౌత్‌జోన్ పరిధిలో సుమారు 70 ప్రాంతాల్లో చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. నూర్ఖాన్ బజార్లో రెండు చెట్లు కూలి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై పడ్డాయి. మరోవైపు నాలుగు చెట్లు కూలడంతో మూడు విద్యుత్ స్తంబాలు నేలమట్టమయ్యాయి. సెం ట్రల్ జోన్ పరిధిలో దాదాపు 70 ప్రాంతాల్లో చెట్లు కూలడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బాగ్ లింగంపల్లి, అబిడ్స్ ఎన్టీఆర్ నివాసం ఎదురుగా, రాంనగర్ తదితర ప్రాం తాల్లో చెట్ల కూలి ప్రధాన రోడ్లపై పడ్డాయి. గోల్కోండ ఎక్స్ రోడ్లో చెట్లు కూలడంతో ప్రధానరహదారిపై తీవ్రంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈస్ట్‌జోన్ పరిధిలో 14 చెట్లు నేలమట్టమయ్యాయి. నార్త్‌జోన్ పరిధిలో 55 , వెస్ట్‌జోన్ పరిధిలో 5 చెట్లు కూలడంతో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మొత్తం 19 ప్రాంతాల్లో నీరు నిలువగా వాటిని క్లియర్ చేశారు. సౌత్‌జోన్‌కు అభినందనలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి పునరుద్ధరణ పనుల్లో చురుకుగా వ్యవహరించిన సౌత్‌జోన్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ కృష్ణ శేఖర్‌తో పాటు ఇంజనీరింగ్ సిబ్బందిని కమిషనర్ అభినందించారు. కూలిన చెట్లను తొలగించాం: కమిషనర్ నగరంలో కురిసిన భారీ వర్షానికి కూలిన చెట్లన్నింటినీ రోడ్లపై నుండి పూర్తిగా తొలగించామని కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి తెలిపారు. ఎమర్జెన్సీ బృందాలను రాత్రి నుంచే రంగంలో దింపి నగరవాసులకు ఇబ్బందులు గణనీయంగా తగ్గించగలిగామన్నారు. కొత్త పేట ఫ్రూట్ మార్కెట్లో పిడుగు పడి ఒకరు మరణించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. అధికారులు, సిబ్బంది స్పాంటేనియస్‌గా స్పందించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. -
జీహెచ్ఎంసీ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు
మియాపూర్: జీహెచ్ఎంసీ ట్యాక్స్‌ఇన్‌స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కూకట్పల్లి సర్కిల్లో ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న విజయ్‌కుమార్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న సమాచారం మేరకు ఏసీబీ అధికారులు మంగళవారం మియాపూర్‌లోని మక్తామహబూబ్‌పేట్‌లోని అపార్ట్మెంట్, జేపీ నగర్లో ఉన్న ఇళ్లపై ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం వరకు డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో సీఐలు మాజీద్ అలీఖాన్, గౌస్ ఆజాద్, అంజిరెడ్డి, మంజుల సోదాల్లో పాల్గొన్నారు. విజయ్‌కుమార్ గతంలో చందానగర్ సర్కిల్ 12లో పని చేశారు. అప్పట్లోనే ఆయన ఈ ఆస్తులను కూడబెట్టుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పటాన్చెరులో రెండు ఫ్లాట్స్, నల్లగొండ జిల్లా భువనగిరి, యాదగిరిగుట్టలో 200 గజాల ప్లాటు, స్థలాల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా జేపీనగర్‌లో తల్లి కమల పేరుతో ఒక ఇల్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారిం చారు. రూ.5 లక్షల బ్యాంకు డిపాజిట్లు, రెండు కార్లు, లక్షా 47 వేల నగదు, 122 తులాల బంగారం, ఒక ద్వి చక్ర వాహనం ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్లు, కార్లను కోర్టులో డిపాజిట్ చేస్తామని ఏసీబీ డీఎస్పీ రవి కుమార్ తెలిపారు. -
‘లక్ష్యం’ సాధించారు...
గ్రేటర్లో రూ.1010 కోట్ల ఆస్తి పన్ను వసూళ్ళు ► గ్రేటర్లో ప్రభుత్వ శాఖలు కళకళ ► ఆదాయం, పన్నుల వసూళ్లలో ముందంజ ► రూ.1010 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేసిన జీహెచ్ఎంసీ ► హర్షం వ్యక్తం చేస్తున్న అధికారులు ఈ ఆర్థిక సంవత్సరం(2015-16)లో గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు ఆదాయం పరంగా లక్ష్యాలను సాధించాయి. కొన్ని శాఖలు లక్ష్యానికి చేరువలో ఉండగా..కొన్ని పూర్తి స్థాయిలో టార్గెట్‌ను పూర్తిచేశాయి. ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ ముందంజలో ఉంది. లక్ష్యాన్ని మించి పన్నులు వసూలయ్యాయి. ఇక ఆబ్కారీ శాఖ సైతం లక్ష్యాన్ని మించి ఆదాయం పొందింది. వాణిజ్య పన్నుల శాఖ రాబడి బాగానే ఉంది. ఆర్టీఏ 85 శాతం లక్ష్యం సాధించగా..ఈసారి రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం మాత్రం కాస్త నిరాశాజనకంగా ఉంది. జలమండలి కూడా ఈ ఏడాది లక్ష్యాన్ని మించి రెట్టింపు ఆదాయం పొందింది. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గురువారం అర్ధరాత్రి వరకు రూ.1010 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేశారు. ఆస్తిపన్ను చెల్లింపులకు అర్ధరాత్రి వరకు గడువున్నందున మరో రూ. 30 కోట్లు వచ్చే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. గత (2014-15) ఆర్థిక సంవత్సరం రూ. 1063 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఈ సంవత్సరం రూ.1065 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ, రూ.1200 లోపు ఆస్తిపన్ను వారికి ప్రభుత్వం మాఫీ చేయడంతో దాదాపు రూ. 88 కోట్లు కోత పడిందని పేర్కొన్నారు. అందుకనుగుణంగా వసూళ్ల లక్ష్యాన్ని కూడా రూ. 977 కోట్లకు తగ్గించారు. ఈ లెక్కన లక్ష్యాన్ని అధిగమించామని జీహెచ్ఎంసీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం మార్చినెల ఒకటో తేదీ నుంచి 31 వరకు రూ. 351 కోట్ల ఆస్తిపన్ను వసూలు కాగా, ఈ సంవత్సరం రూ.375 కోట్లు వసూలైందని అడిషనల్ కమిషనర్(రెవెన్యూ) జె.శంకరయ్య తెలిపారు. పూర్తి లెక్కలు తేలేవరకు మరో రూ.15 కోట్ల వరకు రావచ్చని అంచనా. ఆస్తిపన్ను వసూళ్ల కోసం గతంలో ఇళ్ల ముందు చెత్త డబ్బాలు ఉంచడం వంటి చర్యలకు పాల్పడ్డా.. ఈసారి పరస్పర సంప్రదింపులు, ఎస్సెమ్మెస్‌లు వంటి పద్ధతులతోనే ఇంత భారీ లక్ష్యం సాధించడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం అధికారుల తీరుపై ప్రజల నుంచి విమర్శలు రావడంతో ఈసారి దుందుడుకు చర్యలకు దిగలేదు. 2012-13లో రూ. 779 కోట్లు వసూలు కాగా, 2013-14లో ఏకంగా రూ. 1020 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం రూ. 1464 కోట్ల లక్ష్యం పెట్టుకోగా, రూ. 1463 కోట్లు వసూలయ్యాయి. గత సంవత్సరం పాత బకాయిలపై పెనాల్టీలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సంవత్సరం జీహెచ్ఎంసీ ఎన్నికలు, బీసీ గణన, వార్డుల పునర్విభజన తదితర కార్యక్రమాలతో సిబ్బంది మొత్తం ఆ పనుల్లో తలమునకలయ్యారు. ఫిబ్రవరి వరకు ఆస్తిపన్ను వసూళ్లపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. గత నెలన్నర రోజులుగా మాత్రం విస్తృత కార్యక్రమాలు చేపట్టారు. జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాలను.. దిగువస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరినీ ఆస్తిపన్ను వసూళ్లకు నియమించారు. ఉన్నతాధికారులకు సూపర్వైజర్ బాధ్యతలప్పగించారు. భారీ బకాయిలున్న గృహయజమానులు, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలతో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరిపారు. కమిషనర్ సైతం పలు సంస్థలతో నేరుగా సంప్రదింపులు జరిపారు. అంచనాలను మించిన ‘కిక్కు’... సాక్షి, సిటీబ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరం గ్రేటర్ ఆబ్కారీశాఖకు కాసుల పంట పండినట్లేనని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈసారి ఆబ్కారీశాఖ అంచనాలకు మించి అమ్మకాల్లో వృద్ధి నమోదైందని పేర్కొన్నాయి. గతేడాది(2014-15)సంవత్సరంతో పోలిస్తే 2015-16 ఆర్థిక సంవత్సరంలో నగర ఆబ్కారీశాఖ ఆదాయంలో సుమారు 25 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నాయి. ఐఎంఎల్ మద్యంతో పోలిస్తే బీర్ల అమ్మకాల్లో 20 శాతం ఆదాయం అధికమని పేర్కొన్నాయి. మొత్తంగా ఈ గత ఏడాదిగా హైదరాబాద్, సికింద్రాబాద్, ధూల్‌పేట్ ఎక్సైజ్ డివిజన్ల పరిధిలో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించామన్నారు. కాగా గ్రేటర్ పరిధిలోని సుమారు 400 మద్యం దుకాణాలు, మరో 500 బార్లలో అమ్మకాల కిక్కు ఊపందుకుందని తెలిపారు. లక్ష్యానికి చేరువైన ఆర్టీఏ 85 శాతం ఆదాయం సాక్షి, సిటీబ్యూరో: రవాణాశాఖ ఆదాయం ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యానికి చేరువలో ఉంది. కొత్తవాహనాలపై వచ్చే జీవితకాల పన్ను, రవాణా వాహనాలపైన త్రైమాసిక పన్ను, తదితర మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకున్నట్లు ఆర్టీఏ రంగారెడ్డి ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.858.62 కోట్ల టార్గెట్ నిర్దేశించగా, ఈ నెలాఖరు నాటికి రూ.761 కోట్ల ఆదాయం లభించింది. అలాగే హైదరాబాద్ జిల్లా పరిధిలో రూ.676.69 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా రూ.574.22 కోట్ల ఆదాయాన్ని సముపార్జించారు. ద్విచక్రవాహనాలు, కార్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో రవాణాశాఖ ఆదాయం కూడా అదేస్థాయిలో పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఏడాది సుమారు 46 లక్షల వాహనాలు నమోదు కాగా, వాటిలో 30 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు, మరో 8 లక్షల కార్లు ఉన్నాయి. జీవితకాల పన్ను రూపంలోనే పెద్దమొత్తంలో ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. జలమండలికి రికార్డు ఆదాయం సాక్షి, సిటీబ్యూరో: జలమండలికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి తాగునీటి కటకట లేకుండా చేస్తున్న బోర్డు 2015-16 సంవత్సరానికి రూ.1129.42 కోట్ల లక్ష్యం నిర్దేశించుకోగా...దాన్ని మించి ఏకంగా 1237.88 కోట్ల ఆదాయం పొందింది. గతేడాది 1213.40 కోట్లు రాగా, ఈసారి దాన్ని మించి ఆదాయం సమకూరడం పట్ల జలమండలి అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 2013-14లో 858.09 కోట్లు, 2012-13లో 756.33 కోట్లు ఆదాయం వచ్చింది. వాణిజ్య రాబడి కీలకం.. సాక్షి, సిటీబ్యూరో: వాణిజ్య పన్నుల శాఖకు సమకూరే ఆదాయంలో హైదరాబాద్ మహా నగర రాబడి అత్యంత కీలకం. వాణిజ్య పన్నుల శాఖలో మొత్తం 12 డివిజన్లు ఉండగా, మహానగరంలో ఏడు డివిజన్లు ఉన్నాయి. నగరంలోని అబిడ్స్, చార్మినార్, బేగంపేట, పంజగుట్ట, సికింద్రాబాద్, సరూర్‌నగర్, హైదరాబాద్ రూరల్ డివిజన్ల పరిధి ద్వారానే అత్యథికంగా ఆదాయం సమకూరుతోంది. మాహ నగరంలోని ఏడు డివిజన్ల ద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.21 వేల కోట్ల వరకు పన్నుల రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ లక్ష్యంగా నిర్ణయించగా మార్చి చివరి నాటికి రూ.17 వేల కోట్ల పైచిలుకు ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేసే పన్నుల్లో వ్యాట్ (విలువ ఆధారిత పన్ను), సీఎస్టీ తదితర పన్నులు ప్రధానమైనవి. ఇవే కాకుండా వృత్తి, వినోద తదితర పన్నుల ద్వారా కూడా కొంత వరకు రాబడి లభిస్తుంది. మొత్తం రాబడిలో ఒక వ్యాట్ ద్వారానే సుమారు 85 శాతంపైగా, మిగతా పన్నుల ద్వారా మరో 15 శాతం వరకు ఆదాయం సమకూరుతోంది.. రిజిస్ట్రేషన్ శాఖ రాబడి అంతంతే.. ప్రభుత్వ ఖజానాకు రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ నుంచి అదాయం రాబడి అధికంగా నే ఉంటుంది రిజిస్ట్రేషన్ శాఖలో మొత్తం 12 జిల్లా రిజిస్ట్రార్లు(డీఆర్)లు ఉండగా అందులో మహానగరం పరిధిలోనే నాలుగు డీఆర్లు ఉన్నాయి. మొత్తం మీద రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో మహానగరం వాట 68.89 శాతం వరకు ఉంటుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 2360 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్ణయించగా మార్చి చివరి నాటికి రూ. 1896.58 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. -
అక్రమాలకు చెక్
► జీహెచ్ఎంసీ ప్రక్షాళన ► అధికారాలు, బాధ్యతల వికేంద్రీకరణ ► ఏరియా కమిటీలు.. స్థానిక సంఘాలకు ప్రాధాన్యం ► సమస్యల గుర్తింపు.. పరిష్కారం బాధ్యత వాటిదే ► అక్రమాల నిరోధంపై అధికారుల దృష్టి లోపాల సవరణకు చర్యలు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో అవినీతి.. అక్రమాలకు... అలసత్వానికి... చెక్ పెట్టే దిశగా ఉన్నతాధికారులు కదులుతున్నారు. సమూలంగా ప్రక్షాళన చేయాలనే యోచనతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జీహెచ్ఎంసీలోని ఏ విభాగంలో చూసినా అలసత్వం. ఫలితంగా ప్రజలకు అవస్థలు. మరోవైపు అంతులేని అక్రమాలు. కొందరికే అధికారాలు. దీంతో అవినీతి పేట్రేగిపోతోంది. దిద్దుబాటు చర్యలకు ఎవరైనా సిద్ధమైతే అడుగడుగునా ఆటంకాలు. అవినీతిపరులపై చర్యలు తీసుకోకుండా ఒత్తిళ్లు. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా వివిధ కోణాల్లో ఆలోచించిన ఉన్నతాధికారులు ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చారు. గత అనుభవాలనూ పరిగణనలోకి తీసుకొని వికేంద్రీకరణ మంత్రమే ప్రస్తుతానికి తగిన మందుగా భావించారు. దశల వారీగా సంస్కరణ ల అమలుకు సిద్ధమయ్యారు. ప్రతి విభాగంలోనూ పనులు అవినీతికి... ఆలస్యానికి తావులేకుండా... పారదర్శకంగా పూర్తయ్యేలా ‘స్టాండర్డ్ ప్రొసీజర్స్’పై దృష్టి సారించారు. దీనికి కన్సల్టెన్సీల సేవలు వినియోగించుకోనున్నారు.వివిధ విభాగాల ప్రక్షాళనకు ఎలాంటి చర్యలు? ఏ స్థాయిలో తీసుకోవాలి? అనే అంశాలపై కన్సల్టెన్సీలు నివేదికలు అందజేస్తాయి. వాటి ఆధారంగా చర్యలు చేపడతారు. ‘స్థానిక’ కమిటీలకు ప్రాధాన్యం పారిశుద్ధ్యం, రహదారుల మరమ్మతులు.. తదితర అంశాల్లో ఏరియా కమిటీలకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం 5వేల జనాభాకు ఒక ఏరియా కమిటీ ఏర్పాటుకు వీలుంది. దీన్ని రెండు లేదా మూడు వేల మందికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. దీనికోసం చట్టాన్ని సవరించాల్సి ఉన్నందున ఆ దిశగా ఆలోచిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానాలు సత్ఫలితాలిస్తున్నందున ఈ ఆలోచన చేశారు. స్థానిక సమస్యలను గుర్తించడం.. సంబంధిత విధులు నిర్వహించే వారికి వాటిని తెలియజేయడం.. పరిష్కరించడం వంటి పనులు ఏరియా కమిటీలు చేస్తాయి. పారిశుద్ధ్య కార్మికులకు ఆధార్ లింక్ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు ఉన్నాయి. జాబితాలో ఒకరు, విధుల్లో మరొకరు ఉంటుండం.. అసలు విధుల్లోనే లేకపోవడం వంటి అంశాలు దృష్టికి రావడంతో వారందరికీ త్వరలోనే ఆధార్ లింకేజీతో గుర్తింపు కార్డులు ఇచ్చే యోచనలో ఉన్నారు. తద్వారా విధులు ఎగ్గొట్టే వారికి జీతాలు నిలిపివేయాలని భావిస్తున్నారు. ఏఎంఓహెచ్‌ల స్థానే ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్లు పారిశుద్ధ్య కార్మికుల పనిని పర్యవేక్షిస్తున్న ఏఎంఓహెచ్‌ల స్థానే త్వరలో ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. చెత్త తరలింపు వాహనాలకు సంబంధించిన రవాణ విభాగాన్ని వికేంద్రీకరించి... పనులను విభజించి నిర్ణీత మొత్తం వరకు ఈఈ, డీఈఈల స్థాయిలోనే మంజూరు చేసేలా అధికారం ఇవ్వాలని యోచిస్తున్నారు. దుబారా నివారణకు అధీకృత డీలర్ల ద్వారానే విడిభాగాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రెండు, మూడేళ్ల వరకు వాహనాల మరమ్మతులు సంబంధిత కంపెనీలే చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఏదైనా వాహనం పాడైతే సంబంధిత కంపెనీయే నిర్ణీత వ్యవధిలోగా మరమ్మతు చేయాల్సి ఉంటుంది. జాప్యమయ్యేకొద్దీ పెనాల్టీ విధిస్తారు. సర్కిళ్ల వారీగా కొన్ని వాహనాలను రిజర్వులో ఉంచి, మరమ్మతుకు గురైన వాటి స్థానంలో వినియోగించనున్నట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. అక్రమార్కులపై చర్యలు ఇటీవలి కాలంలో వివిధ విభాగాల్లోని అవినీతిపై ఫిర్యాదులు అందుతుండటంతో అక్రమాలపై విచారణలు జరుగుతున్నాయని... బాధ్యులపై చర్యలు తప్పవని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎంతోకాలం క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభమైందని.. త్వరలోనే చర్యలుంటాయని తెలిపారు. -
లక్ష్యం చేరేనా...!
► ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ వెనుకబాటు ► గడువు రెండు రోజులే.. లక్ష్యం రూ.200 కోట్లు ► పన్ను మాఫీతో రూ.90 కోట్లకు గండి సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ వెనకబడి పోయింది. ప్రభుత్వం ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ ప్రకటించినా ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యానికి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది వసూళ్లను పోలిస్తే దాదాపు రూ. 200 కోట్ల పైగా వెనుకబడినట్లు తెలుస్తోంది. గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో వసూళ్లలోలో వేగం పేంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 2014-15 ఆర్ధిక సంవత్సరంలో సుమారు 1,063 కోట్ల ఆస్తి పన్ను వసూలు కాగా, 2015-16 గాను ఇప్పటి వరకు వసూళ్లు రూ.865 కోట్లను మించలేదు. వాస్తవంగా ఈసారి గతేడాది వసూళ్ల మొత్తాన్ని లక్ష్యంగా నిర్థేశించినప్పటికి ప్రగతి సాధించలేక పోయారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రూ.1200లోపు ఆస్తి పన్నును మాఫీ చేయాలన్న నిర్ణయించడంతో సుమారు రూ.90 కోట్ల ఆదాయానికి గండి పడింది. బడా సంస్థలపై దృష్టి.. వసూళ్లకు మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉండటంతో పన్ను చెల్లించని బడా సంస్థలు,వ్యాపార,వాణిజ్య సంస్థలకు వారంట్లు జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మొండి బకాయిదారుల కార్యాలయాలను సీజ్ చేస్తున్నారు. నగరంలోని ప్రతి సర్కిల్లో అధిక మొత్తంలో అస్తిపన్ను చెల్లించాల్సిన పది టాప్ డిఫాల్టర్లను గుర్తించి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఫోన్ ద్వారా, వ్యక్తిగతంగా వారిని సంప్రదించి పన్నులు చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు బుధ, గురు వారాల్లో పెద్ద ఎత్తున ఆస్తి పన్ను చెల్లింపులు జరిగే అవకాశం ఉన్నందున సర్కిల్ కార్యాలయాల్లో, సిటీజన్ సర్వీస్ కేంద్రాల్లో అదనపు కౌంటర్ల ఏర్పాటు చేయడమేగాక పని వేళలను పెంచేం దుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలు నోటీసులు జారీ చేసినా స్పందిచకపోవడంతో చార్మినార్ 4వ సర్కిల్లోని ఐజా కళాశాలను సీజ్ చేశారు. నల్లకుంటలోని రెస్టారెంట్, రాజేంద్రనగర్ బండ్లగూడలోని పలు ఫంక్ష న్ హాళ్లను మూసి వేశారు.