లక్ష్యం చేరేనా...!
► ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్‌ఎంసీ వెనుకబాటు
► గడువు రెండు రోజులే.. లక్ష్యం రూ.200 కోట్లు
► పన్ను మాఫీతో రూ.90 కోట్లకు గండి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్‌ఎంసీ వెనకబడి పోయింది. ప్రభుత్వం ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ ప్రకటించినా ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యానికి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది వసూళ్లను పోలిస్తే దాదాపు రూ. 200 కోట్ల పైగా వెనుకబడినట్లు తెలుస్తోంది. గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో వసూళ్లలోలో వేగం పేంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 2014-15 ఆర్ధిక సంవత్సరంలో సుమారు 1,063 కోట్ల ఆస్తి పన్ను వసూలు కాగా, 2015-16 గాను ఇప్పటి వరకు వసూళ్లు రూ.865 కోట్లను మించలేదు. వాస్తవంగా ఈసారి గతేడాది వసూళ్ల మొత్తాన్ని లక్ష్యంగా నిర్థేశించినప్పటికి ప్రగతి సాధించలేక పోయారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రూ.1200లోపు ఆస్తి పన్నును మాఫీ చేయాలన్న నిర్ణయించడంతో సుమారు రూ.90 కోట్ల ఆదాయానికి గండి పడింది.
బడా సంస్థలపై దృష్టి..
వసూళ్లకు మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉండటంతో పన్ను చెల్లించని బడా సంస్థలు,వ్యాపార,వాణిజ్య సంస్థలకు వారంట్లు జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మొండి బకాయిదారుల కార్యాలయాలను సీజ్ చేస్తున్నారు. నగరంలోని ప్రతి సర్కిల్‌లో అధిక మొత్తంలో అస్తిపన్ను చెల్లించాల్సిన పది టాప్ డిఫాల్టర్లను గుర్తించి జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు ఫోన్ ద్వారా, వ్యక్తిగతంగా వారిని సంప్రదించి పన్నులు చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
మరోవైపు బుధ, గురు వారాల్లో పెద్ద ఎత్తున ఆస్తి పన్ను చెల్లింపులు జరిగే అవకాశం ఉన్నందున సర్కిల్ కార్యాలయాల్లో, సిటీజన్ సర్వీస్ కేంద్రాల్లో అదనపు కౌంటర్ల ఏర్పాటు చేయడమేగాక పని వేళలను పెంచేం దుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలు నోటీసులు జారీ చేసినా స్పందిచకపోవడంతో చార్మినార్ 4వ సర్కిల్‌లోని ఐజా కళాశాలను సీజ్ చేశారు. నల్లకుంటలోని రెస్టారెంట్, రాజేంద్రనగర్ బండ్లగూడలోని పలు ఫంక్ష న్ హాళ్లను మూసి వేశారు.