‘లక్ష్యం’ సాధించారు... | The greater property tax collection of Rs .1010 crore | Sakshi
Sakshi News home page

‘లక్ష్యం’ సాధించారు...

Published Fri, Apr 1 2016 3:09 AM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

‘లక్ష్యం’   సాధించారు...

‘లక్ష్యం’ సాధించారు...

గ్రేటర్‌లో రూ.1010 కోట్ల ఆస్తి పన్ను వసూళ్ళు
 
గ్రేటర్‌లో ప్రభుత్వ శాఖలు కళకళ
ఆదాయం, పన్నుల వసూళ్లలో ముందంజ
రూ.1010 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేసిన జీహెచ్‌ఎంసీ
హర్షం వ్యక్తం చేస్తున్న అధికారులు

 
 ఈ ఆర్థిక సంవత్సరం(2015-16)లో గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు ఆదాయం పరంగా లక్ష్యాలను సాధించాయి. కొన్ని శాఖలు లక్ష్యానికి చేరువలో ఉండగా..కొన్ని పూర్తి స్థాయిలో టార్గెట్‌ను పూర్తిచేశాయి. ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్‌ఎంసీ ముందంజలో ఉంది. లక్ష్యాన్ని మించి పన్నులు వసూలయ్యాయి. ఇక ఆబ్కారీ శాఖ సైతం లక్ష్యాన్ని మించి ఆదాయం పొందింది. వాణిజ్య పన్నుల శాఖ రాబడి బాగానే ఉంది. ఆర్టీఏ 85 శాతం లక్ష్యం సాధించగా..ఈసారి రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం మాత్రం కాస్త నిరాశాజనకంగా ఉంది. జలమండలి కూడా ఈ ఏడాది లక్ష్యాన్ని మించి రెట్టింపు ఆదాయం పొందింది.
 
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో 2015-16  ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గురువారం అర్ధరాత్రి వరకు రూ.1010 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేశారు. ఆస్తిపన్ను చెల్లింపులకు అర్ధరాత్రి వరకు గడువున్నందున మరో రూ. 30 కోట్లు వచ్చే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. గత (2014-15) ఆర్థిక సంవత్సరం రూ. 1063 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఈ సంవత్సరం రూ.1065 కోట్ల   లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ, రూ.1200 లోపు ఆస్తిపన్ను వారికి ప్రభుత్వం మాఫీ చేయడంతో దాదాపు రూ. 88 కోట్లు కోత పడిందని పేర్కొన్నారు. అందుకనుగుణంగా వసూళ్ల లక్ష్యాన్ని కూడా రూ. 977 కోట్లకు తగ్గించారు. ఈ లెక్కన లక్ష్యాన్ని అధిగమించామని జీహెచ్‌ఎంసీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం మార్చినెల ఒకటో తేదీ నుంచి 31 వరకు రూ. 351 కోట్ల ఆస్తిపన్ను వసూలు కాగా, ఈ సంవత్సరం రూ.375 కోట్లు వసూలైందని అడిషనల్ కమిషనర్(రెవెన్యూ) జె.శంకరయ్య తెలిపారు.


పూర్తి లెక్కలు తేలేవరకు మరో రూ.15 కోట్ల వరకు రావచ్చని అంచనా. ఆస్తిపన్ను వసూళ్ల  కోసం గతంలో ఇళ్ల ముందు చెత్త డబ్బాలు ఉంచడం వంటి చర్యలకు పాల్పడ్డా.. ఈసారి పరస్పర సంప్రదింపులు, ఎస్సెమ్మెస్‌లు వంటి పద్ధతులతోనే ఇంత భారీ లక్ష్యం సాధించడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం అధికారుల తీరుపై ప్రజల నుంచి విమర్శలు రావడంతో ఈసారి దుందుడుకు చర్యలకు దిగలేదు. 2012-13లో రూ. 779 కోట్లు వసూలు కాగా, 2013-14లో ఏకంగా రూ. 1020 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం రూ. 1464 కోట్ల లక్ష్యం పెట్టుకోగా, రూ. 1463 కోట్లు వసూలయ్యాయి.  గత సంవత్సరం పాత బకాయిలపై పెనాల్టీలను ప్రభుత్వం రద్దు చేసింది.  ఈ సంవత్సరం జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, బీసీ గణన, వార్డుల పునర్విభజన  తదితర కార్యక్రమాలతో సిబ్బంది మొత్తం ఆ పనుల్లో తలమునకలయ్యారు. ఫిబ్రవరి వరకు ఆస్తిపన్ను వసూళ్లపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. గత నెలన్నర రోజులుగా మాత్రం విస్తృత కార్యక్రమాలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాలను.. దిగువస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరినీ ఆస్తిపన్ను వసూళ్లకు నియమించారు. ఉన్నతాధికారులకు సూపర్‌వైజర్ బాధ్యతలప్పగించారు. భారీ బకాయిలున్న గృహయజమానులు, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలతో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరిపారు. కమిషనర్ సైతం పలు సంస్థలతో నేరుగా సంప్రదింపులు జరిపారు.
 
  అంచనాలను మించిన  ‘కిక్కు’...
సాక్షి, సిటీబ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరం గ్రేటర్ ఆబ్కారీశాఖకు కాసుల పంట పండినట్లేనని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈసారి ఆబ్కారీశాఖ అంచనాలకు మించి అమ్మకాల్లో వృద్ధి నమోదైందని పేర్కొన్నాయి. గతేడాది(2014-15)సంవత్సరంతో పోలిస్తే  2015-16 ఆర్థిక సంవత్సరంలో నగర ఆబ్కారీశాఖ ఆదాయంలో సుమారు 25 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నాయి. ఐఎంఎల్ మద్యంతో పోలిస్తే బీర్ల అమ్మకాల్లో 20 శాతం ఆదాయం అధికమని పేర్కొన్నాయి. మొత్తంగా ఈ గత ఏడాదిగా హైదరాబాద్, సికింద్రాబాద్, ధూల్‌పేట్ ఎక్సైజ్ డివిజన్ల పరిధిలో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించామన్నారు. కాగా గ్రేటర్ పరిధిలోని సుమారు 400 మద్యం దుకాణాలు, మరో 500 బార్లలో అమ్మకాల కిక్కు ఊపందుకుందని తెలిపారు.
 
 
 లక్ష్యానికి చేరువైన ఆర్టీఏ 85 శాతం ఆదాయం

 సాక్షి, సిటీబ్యూరో: రవాణాశాఖ ఆదాయం  ఈ ఏడాది  నిర్దేశిత లక్ష్యానికి  చేరువలో ఉంది. కొత్తవాహనాలపై వచ్చే జీవితకాల పన్ను, రవాణా వాహనాలపైన  త్రైమాసిక పన్ను, తదితర మార్గాల్లో  ఆదాయాన్ని  పెంచుకున్నట్లు ఆర్టీఏ రంగారెడ్డి ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు  తెలిపారు. రంగారెడ్డి జిల్లా  పరిధిలో  2015-16 ఆర్థిక సంవత్సరానికి  రూ.858.62 కోట్ల  టార్గెట్  నిర్దేశించగా,  ఈ నెలాఖరు నాటికి  రూ.761 కోట్ల ఆదాయం లభించింది. అలాగే హైదరాబాద్ జిల్లా పరిధిలో రూ.676.69 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా  రూ.574.22 కోట్ల ఆదాయాన్ని సముపార్జించారు. ద్విచక్రవాహనాలు, కార్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో రవాణాశాఖ ఆదాయం కూడా అదేస్థాయిలో పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో  ఈ ఏడాది సుమారు 46 లక్షల వాహనాలు నమోదు కాగా, వాటిలో  30 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు, మరో 8 లక్షల కార్లు ఉన్నాయి. జీవితకాల పన్ను రూపంలోనే పెద్దమొత్తంలో ఆదాయం లభించినట్లు అధికారులు  తెలిపారు.
 
 జలమండలికి రికార్డు ఆదాయం
సాక్షి, సిటీబ్యూరో: జలమండలికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి తాగునీటి కటకట లేకుండా చేస్తున్న  బోర్డు 2015-16 సంవత్సరానికి రూ.1129.42 కోట్ల లక్ష్యం నిర్దేశించుకోగా...దాన్ని మించి ఏకంగా 1237.88 కోట్ల ఆదాయం పొందింది. గతేడాది 1213.40 కోట్లు రాగా, ఈసారి దాన్ని మించి ఆదాయం సమకూరడం పట్ల జలమండలి అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 2013-14లో 858.09 కోట్లు, 2012-13లో 756.33 కోట్లు ఆదాయం వచ్చింది.
 
వాణిజ్య రాబడి కీలకం..
సాక్షి, సిటీబ్యూరో: వాణిజ్య పన్నుల శాఖకు సమకూరే ఆదాయంలో హైదరాబాద్ మహా నగర రాబడి అత్యంత కీలకం. వాణిజ్య పన్నుల శాఖలో మొత్తం 12 డివిజన్లు ఉండగా, మహానగరంలో ఏడు డివిజన్లు ఉన్నాయి. నగరంలోని అబిడ్స్, చార్మినార్, బేగంపేట, పంజగుట్ట, సికింద్రాబాద్, సరూర్‌నగర్, హైదరాబాద్ రూరల్ డివిజన్ల పరిధి ద్వారానే అత్యథికంగా ఆదాయం సమకూరుతోంది. మాహ నగరంలోని ఏడు డివిజన్ల ద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.21 వేల కోట్ల వరకు పన్నుల రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ లక్ష్యంగా నిర్ణయించగా మార్చి చివరి నాటికి రూ.17 వేల కోట్ల పైచిలుకు ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేసే పన్నుల్లో  వ్యాట్ (విలువ ఆధారిత పన్ను), సీఎస్‌టీ తదితర పన్నులు ప్రధానమైనవి. ఇవే కాకుండా వృత్తి, వినోద తదితర పన్నుల ద్వారా కూడా కొంత వరకు రాబడి లభిస్తుంది. మొత్తం రాబడిలో ఒక వ్యాట్ ద్వారానే సుమారు 85 శాతంపైగా, మిగతా పన్నుల ద్వారా మరో 15 శాతం వరకు ఆదాయం సమకూరుతోంది..

 రిజిస్ట్రేషన్ శాఖ  రాబడి అంతంతే..
 ప్రభుత్వ ఖజానాకు రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ నుంచి అదాయం రాబడి అధికంగా నే ఉంటుంది రిజిస్ట్రేషన్ శాఖలో మొత్తం 12 జిల్లా రిజిస్ట్రార్లు(డీఆర్)లు ఉండగా అందులో మహానగరం పరిధిలోనే నాలుగు  డీఆర్‌లు ఉన్నాయి. మొత్తం మీద రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో మహానగరం వాట 68.89 శాతం వరకు ఉంటుంది. 2015-16  ఆర్థిక సంవత్సరంలో రూ. 2360 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్ణయించగా మార్చి చివరి నాటికి రూ. 1896.58 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది.
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement