అది సేవా లేదా రాజకీయ స్టంటా! | Plight Of Sanitation Workers | Sakshi
Sakshi News home page

అది సేవా లేదా రాజకీయ స్టంటా!

Published Tue, Feb 26 2019 3:31 PM | Last Updated on Tue, Feb 26 2019 6:44 PM

Plight Of Sanitation Workers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇదొక రాజకీయ స్టంట్, రానున్న లోక్‌సభ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని చేసినది. ఓట్ల కోసం ఆడిన డ్రామా’... ప్రధాని నరేంద్ మోదీ ఆదివారం నాడు ప్రయాగ్‌ రాజ్‌లో ఐదుగురు స్వీపర్లు లేదా పారిశుద్ధ్య పనివారల కాళ్లు కడిగిన వీడియో దశ్యాలపై ముంబై ర్యాలీకి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు చేసిన వ్యాఖ్యలివి. సోమవారం నాడు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద, ముంబైలోని ఆజాద్‌ మైదానంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన వేలాదిమంది పారిశుద్ధ్య కార్మికులు ధర్నాలు నిర్వహించారు. ‘దళితులు, కార్మికుల హక్కుల సంఘం’ ఆధ్వర్యంలో ఢిల్లీలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించగా, ‘సఫాయ్‌ కర్మచారి ఆందోళన్, మహారాష్ట్ర మున్సిపల్‌ కామ్‌గార్‌ యూనియన్, కచ్రా వాహ్‌తుక్‌ శ్రామిక్‌ సంఘ్‌’ తదితర కార్మిక సంఘాల పిలుపు మేరకు ముంబైలో ధర్నా నిర్వహించారు.

‘ఇదంతా ఓట్ల కోసం. మోదీకి మా పట్ల అంత ప్రేమ ఉంటే, మమ్మల్నీ సైనికుల్లా చూడాలి. విధి నిర్వహణలో చనిపోతే అమర వీరుల్లా గౌరవించాలి’ అని హర్యానాలోని ఫరిదాబాద్‌ నుంచి ధర్నాకు వచ్చిన 30 ఏళ్ల రవి వాల్మికన్‌ వ్యాఖ్యానించారు. భద్రతా మాస్కులు, చేతులకు గ్లౌజులు, కాళ్లకు రక్షణ బూట్లు లేకుండానే తామంతా డ్రైనేజీ పనులు  చేస్తున్నామని ఆయనతోపాటు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు తెలిపారు. ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులందరికి కనీస వేతనాలను అమలు చేస్తామని మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం 2015లోనే ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో తాము ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సి వచ్చిందని యూనియన్‌ నాయకులు తెలిపారు. మోదీకి తమ పట్ల ప్రేమ ఉంటే తాము ఎందుకు ఇంత దుర్భర పరిస్థితుల్లో బతుకుతామని వారు ప్రశ్నించారు.

ఆధ్యాత్మిక సేవలో భాగంగానే...
ఆదివారం నాడు కుంభమేళాకు హాజరైన నరేంద్ర మోదీ, ఆధ్యాత్మిక సేవలో భాగంగానే ఐదుగురు పారిశుద్ధ్య కార్మికుల పాదాలను కడిగానని చెప్పుకున్నారు. వాల్మికి సామాజిక వర్గం చేసే పాకీ పని కూడా ఆధ్యాత్మిక సేవ లాంటిదని మోదీ 2010లో ప్రచురించిన ‘కర్మయోగి’ అనే తన పుస్తకంలో రాశారు. ‘బ్రతుకుతెరువు కోసం వారు ఈ పని చేస్తున్నారని నేను భావించడం లేదు. అలా అయితే మరో వృత్తి ఎన్నుకొనే వారు. తరతరాలుగా ఇదే వృత్తిలో ఎందుకు కొనసాగుతారు ?’ అని ఆ పుస్తకంలో మోదీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జాతిపిత మహాత్మా గాంధీ కూడా 1936లో ‘ది ఐడియల్‌ బాంగీ’ పేరిట రాసిన వ్యాసంలో పాకిపని వారలు చేసేది ‘పవిత్ర విధి’ అని అభివర్ణించారు. వారు చేసే పనిలో ఎలాంటి పవిత్రత లేదని, వారిని దళితులుగా దూరం పెట్టడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వారు ఆ పని చేయాల్సి వస్తోందంటూ డాక్టర్‌ అంబేడ్కర్, నాడే గాంధీకి సమాధానం ఇచ్చారు.

వేలాది మంది మరణం
2014–2016 మధ్య రెండేళ్ల కాలంలోనే డ్రైనేజీ క్లీనింగ్‌ పనిలో 1,327 మంది పారిశుద్ధ్య కార్మికులు మరణించినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2015 నుంచి అంతకుముందు ఆరేళ్ల కాలంలో ఒక్క ముంబై నగరంలోనే 1,386 మంది పారిశుద్ధ్య కార్మికులు విధినిర్వహణలో మరణించారని ‘ఇండియాస్పెండ్‌’ పరిశోధన సంస్థ 2015లో విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది. వీరిలో 90 శాతం మంది కాంట్రాక్టు లేబర్లే. దేశంలో పాకిపనివారల వ్యవస్థను 2013, సెప్టెంబర్‌ నెలలో కేంద్ర కార్మిక శాఖ నిషేధించింది. దీన్ని కచ్చితంగా అమలు చేయడంతోపాటు పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలకు పూర్తి భద్రతనిచ్చే ఆధునిక పరికరాలను ఉపయోగించాలంటూ 2014, మార్చి 26వ తేదీన దేశంలోని అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు ఉత్తర్వులను కచ్చితంగా అమలుచేసి ఉంటే ఇంతమంది పారిశుద్ధ్య కార్మికులు ఎందుకు చనిపోతారు? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న రైల్వే వ్యవస్థలో కూడా పారిశుద్ధ్య పనివారలు ఎందుకు కొనసాగుతారు? కాకపోతే వారిని స్వీపర్లుగా వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిపై వారికి రోజుకు 200 రూపాయలు చెల్లిస్తున్నారు. ప్రాణ హాని లేదా అంగవైకల్య ప్రమాదాలకు ఆస్కారం ఉన్న విధులను ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్టు కార్మికులను అప్పగించరాదంటూ 1947 నాటి పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టం నిర్దేశిస్తుండగా, డ్రైనేజీ పనులకు కాంట్రాక్టు కార్మికులను ఉపయోగిస్తే యజమానులకు ఏడాది జైలు, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తామని 1993 నాటి చట్టం చెబుతోంది. దేశంలోని దాదాపు అన్ని మున్సిపాలిటీలు పారిశుద్ధ్య పనులకు కాంట్రాక్టు కార్మికులను ఉపయోగిస్తున్న విషయం తెల్సిందే. మనకన్నా ఆర్థికంగా వెనకబడిన అనేక దేశాలు పారిశుద్ధ్య పనులకు ఆధునిక పరికరాలను ఉపయోగిస్తున్న విషయం తెల్సిందే.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement