Safai workers
-
సఫాయి అన్న.. నీకు సలాం అన్న
సాక్షి, సనత్‌నగర్(హైదరాబాద్): సఫాయి అన్న.. నీకు సలాం అన్న.. అంటూ వారి సేవలను గుర్తించి మూడుసార్లు వేతనాలు పెంచిన మొదటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాత్రమేనని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. డ్రైవర్స్ కమ్ ఓనర్ స్కీం కింద సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ సెంటర్ కేంద్రంగా నగర వ్యాప్తంగా 1,350 స్వచ్ఛ ఆటో టిప్పర్లను సోమవారం మంత్రులు ప్రారంభించారు. వీరిలో మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌లతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం 250 మంది లబ్ధిదారులకు స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బెస్ట్ సిటీగా హైదరాబాద్.. ► గతంలో 2015లో స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా 2,500 స్వచ్ఛ ఆటో టిప్పర్లను ఏకకాలంలో తీసుకువచ్చామని గుర్తుచేశారు. దేశంలో స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ అమలుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ బెస్ట్ సిటీగా నిలిచిందన్నారు. ► ఎప్పటికప్పుడు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తెల్లవారుజామున 3– 4 గంటల నుంచే పరిశ్రమిస్తున్న మున్సిపల్ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, స్వచ్ఛ ఆటోడ్రైవర్లకు, ఇతర వాహనాల సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. స్వచ్ఛ ఆటో టిప్పర్లను ప్రవేశపెట్టకముందు నగరం నుంచి ప్రతిరోజూ 3,500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేదన్నారు. వీటిని ప్రవేశపెట్టిన తర్వాత 6,500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతోందన్నారు. దక్షిణ భారతంలోనే అతిపెద్ద ప్లాంట్.. ► వాహనాల ద్వారా సేకరించిన చెత్తను తడి, పొడి చెత్తను వేరు చేసి విద్యుత్పాదనకు జవహర్‌నగర్‌లో 20 మెగావాట్ల ప్లాంట్‌ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. మరో 28 మెగావాట్ల ప్లాంట్‌కు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చాయన్నారు. దాని పనులు కూడా ప్రారంభమై పూర్తి చేసుకుంటే మొత్తం 48 మెగావాట్లతో దక్షిణ భారతంలోనే అతిపెద్ద ప్లాంట్‌గా నగరం నిలవనున్నదన్నారు. కార్పొరేటర్లు, అధికారులు తమ పరిధిలో క్షేత్ర స్థాయిలో పర్యటించి మెరుగైన పారిశుద్ధ్యం కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సంతోష్, ప్రియాంక అలా, జోనల్ కమిషనర్ రవికిరణ్, జాయింట్ కమిషనర్ సంధ్య, కార్పొరేటర్లు కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, మహేశ్వరి శ్రీహరి, డీఎంసీ వంశీకృష్ణ, ఏఎంహెచ్ఓ భార్గవ నారాయణ్, మహీంద్రా కంపెనీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
సఫాయి కర్మచారీ.. వి ఆర్ 'వెరీ సారీ'
వారు మోరీలలోకి దిగుతారు.. మురికి నీటిలో మునుగుతూ.. మురికి కంపుని పీల్చుతూ.. ప్రాణాలను ఫణంగా పెట్టి మానవ వ్యర్థాలను ఎత్తిపోస్తారు. సంఘంలో వారు వివక్షను ఎదుర్కొంటారు.. అయినా డీలా పడకుండా మరుగుదొడ్లలోని మలమూత్రాలను ఎత్తిపోస్తూ ప్రజలు పలు రోగాల బారిన పడకుండా తమవంతు కృషి చేస్తుంటారు. వారే శ్రమ ప్రేమికులు..రోగాలను తరిమేసే సిపాయిలు.. సఫాయి కర్మచారీలు! సాక్షి, అమరావతి: మరుగుదొడ్లలోని మలమూత్రాలను మనుషులే ఎత్తిపోసే పద్ధతి దేశంలో ఇంకా ఉందా? వందల ఏళ్ల నాటి అత్యంత హీనమైన ఈ పద్ధతిని రద్దు చేస్తూ చట్టాన్ని తీసుకువచ్చినా ఈ వ్యవస్థ ఇంకా పోలేదా? అంటే కేంద్ర ప్రభుత్వం అవుననే జవాబు చెబుతోంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ ఇటీవల రాజ్యసభకు చెప్పిన దాని ప్రకారం దేశంలో 58,098 మంది సఫాయి కార్మికులు ఉన్నారు. ఈ వ్యవస్థను రద్దు చేస్తూ 2013లో మాన్యువల్ స్కావెంజింగ్ నిషేధిత చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆ తర్వాత 2019లో జరిపిన సర్వే ప్రకారం దేశంలో 58,098 మంది సఫాయి కార్మికులు ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కర్నాటక, కేరళ, తమిళనాడుతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో వీరు ఉన్నట్లు సర్వే తెలిపింది. వీరి పునరావాసానికి కేంద్రం కట్టుబడి ఉందని సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటిస్తూనే ఏమేమి చర్యలు చేపట్టిందో వివరించింది. ఆ వృత్తిలో ఉన్న వారిని విముక్తి చేసేందుకు సుదీర్ఘకాలంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పుడున్న సఫాయి కర్మచారీలలో అర్హులైన వారికి నగదు సాయం చేసి విముక్తం చేసింది. మరో 16,057 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తోంది. 1,387 మందికి స్వయం ఉపాధి పథకాలకు మూలధన పెట్టుబడిలో సబ్సిడీ ఇచ్చింది. అయినా ఇంకొంతమంది ఆ వృత్తిలోనే ఉన్నట్లు గుర్తించి వారిని విముక్తం చేసేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నట్లు తెలిపింది. వారి వివరాలను ‘స్వచ్ఛ అభియాన్’లో అప్లోడ్ చేయండి దేశంలో మాన్యువల్ స్కావెంజర్లతో శుభ్రం చేయించే మరుగుదొడ్లే లేకుండా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రకటించింది. ప్రతి ఇంటికీ మరుగు దొడ్డి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామాల్లో ఇప్పటికే 10.71 కోట్ల పరిశుభ్రమైన లెట్రిన్లను, పట్టణ ప్రాంతాల్లో 62.57 లక్షల లెట్రిన్లను నిర్మించింది. దీంతో సఫాయికర్మచారీల అవసరం తొలగిపోయినా ఇంకా అక్కడక్కడ మిగిలే ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. సఫాయికర్మచారీలు ఎక్కడైనా చేతికి బకెట్ తగిలించుకుని, చీపురు కట్ట, ఇనుప రేకు పట్టుకుని కనిపించినా, ఎక్కడైనా లెట్రిన్లను శుభ్రం చేస్తున్నా, మనుషులు శుభ్రం చేసే లెట్రిన్లు కనిపించినా ఫోటోలు తీసి ‘స్వచ్ఛ అభియాన్’ మొబైల్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాలని కేంద్రం సూచించింది. ఇలా చేయడం వల్ల వారి వివరాలు కనుక్కోవడంతో పాటు వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించవచ్చని, సఫాయి కర్మచారీల వ్యవస్థను రూపుమాపవచ్చని పౌర సమాజానికి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. -
సఫాయన్నా నీకు సలాం అన్న: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: 'సఫాయన్న నీకు సలాం అన్న .. అనే నినాదం నాది. సఫాయి కార్మికులు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. ఎవరూ డిమాండ్ చేయకున్నా ప్రతీసారీ సఫాయి కార్మికుల జీతాలు పెంచుకుంటూ వస్తున్నాం’ అంటూ ప్రగతిభవన్‌లో ఆదివారం జరిగిన అఖిలపక్ష భేటీలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సఫాయి కార్మికులకు ఉద్యోగ భద్రతతో కూడిన నిర్మాణాత్మక జీతభత్యాల రూపకల్పన విధానం (పీఆర్సీ తరహాలో) అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. అఖిల పక్ష భేటీలో ఆయన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ దళిత సమాజం వద్దనున్న వ్యవసాయ భూమిని గణన చేయాలన్నారు. ఈ సందర్భంగా లెక్కలను స్థిరీకరించి ఒక సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే పది పదిహేను రోజులు దళితుల భూముల గణన మీదనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని తెలిపారు. దళితుల అభివృద్ధి కోసం సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన కార్యాచరణను దేనికదిగా సిద్ధం చేసుకోవాలన్నారు. 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు సమకూర్చి, దళిత సాధికారత కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమష్టి కార్యాచరణ అందరం కలిసి చేపట్టాలని అఖిల పక్ష నేతలతో కేసీఆర్ పునరుద్ఘాటించారు. ప్రాజెక్టులు తదితర ప్రజావసరాల కోసం భూసేకరణలో భాగంగా సేకరించాల్సి వచ్చిన అసైన్డ్ భూములకు కూడా, పట్టాభూములకు చెల్లించిన ఖరీదునే ప్రభుత్వం చెల్లిస్తుందని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు. దళిత్ ఎంపవర్మెంట్ పథకం కోసం ఈ బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించామని తెలిపారు. ఎటువంటి బ్యాంక్ గారెంటీ జంజాటం లేకుండానే ఈ పథకం ద్వారా దళితులకు సహకారం అందిస్తామన్నారు. అద్దాల అంగడి మాయా లోకపు పోటీ ప్రపంచంలో, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దళిత బిడ్డలు తమ నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచుకోవాలన్నారు. అందుకు ప్రభుత్వ సహకారం అందిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. చదవండి: సీఎం దళిత్ ఎంపవర్మెంట్కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం: కేసీఆర్ -
అది సేవా లేదా రాజకీయ స్టంటా!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇదొక రాజకీయ స్టంట్, రానున్న లోక్‌సభ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని చేసినది. ఓట్ల కోసం ఆడిన డ్రామా’... ప్రధాని నరేంద్ మోదీ ఆదివారం నాడు ప్రయాగ్ రాజ్‌లో ఐదుగురు స్వీపర్లు లేదా పారిశుద్ధ్య పనివారల కాళ్లు కడిగిన వీడియో దశ్యాలపై ముంబై ర్యాలీకి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు చేసిన వ్యాఖ్యలివి. సోమవారం నాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, ముంబైలోని ఆజాద్ మైదానంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన వేలాదిమంది పారిశుద్ధ్య కార్మికులు ధర్నాలు నిర్వహించారు. ‘దళితులు, కార్మికుల హక్కుల సంఘం’ ఆధ్వర్యంలో ఢిల్లీలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించగా, ‘సఫాయ్ కర్మచారి ఆందోళన్, మహారాష్ట్ర మున్సిపల్ కామ్‌గార్ యూనియన్, కచ్రా వాహ్తుక్ శ్రామిక్ సంఘ్’ తదితర కార్మిక సంఘాల పిలుపు మేరకు ముంబైలో ధర్నా నిర్వహించారు. ‘ఇదంతా ఓట్ల కోసం. మోదీకి మా పట్ల అంత ప్రేమ ఉంటే, మమ్మల్నీ సైనికుల్లా చూడాలి. విధి నిర్వహణలో చనిపోతే అమర వీరుల్లా గౌరవించాలి’ అని హర్యానాలోని ఫరిదాబాద్ నుంచి ధర్నాకు వచ్చిన 30 ఏళ్ల రవి వాల్మికన్ వ్యాఖ్యానించారు. భద్రతా మాస్కులు, చేతులకు గ్లౌజులు, కాళ్లకు రక్షణ బూట్లు లేకుండానే తామంతా డ్రైనేజీ పనులు చేస్తున్నామని ఆయనతోపాటు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు తెలిపారు. ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులందరికి కనీస వేతనాలను అమలు చేస్తామని మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం 2015లోనే ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో తాము ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సి వచ్చిందని యూనియన్ నాయకులు తెలిపారు. మోదీకి తమ పట్ల ప్రేమ ఉంటే తాము ఎందుకు ఇంత దుర్భర పరిస్థితుల్లో బతుకుతామని వారు ప్రశ్నించారు. ఆధ్యాత్మిక సేవలో భాగంగానే... ఆదివారం నాడు కుంభమేళాకు హాజరైన నరేంద్ర మోదీ, ఆధ్యాత్మిక సేవలో భాగంగానే ఐదుగురు పారిశుద్ధ్య కార్మికుల పాదాలను కడిగానని చెప్పుకున్నారు. వాల్మికి సామాజిక వర్గం చేసే పాకీ పని కూడా ఆధ్యాత్మిక సేవ లాంటిదని మోదీ 2010లో ప్రచురించిన ‘కర్మయోగి’ అనే తన పుస్తకంలో రాశారు. ‘బ్రతుకుతెరువు కోసం వారు ఈ పని చేస్తున్నారని నేను భావించడం లేదు. అలా అయితే మరో వృత్తి ఎన్నుకొనే వారు. తరతరాలుగా ఇదే వృత్తిలో ఎందుకు కొనసాగుతారు ?’ అని ఆ పుస్తకంలో మోదీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జాతిపిత మహాత్మా గాంధీ కూడా 1936లో ‘ది ఐడియల్ బాంగీ’ పేరిట రాసిన వ్యాసంలో పాకిపని వారలు చేసేది ‘పవిత్ర విధి’ అని అభివర్ణించారు. వారు చేసే పనిలో ఎలాంటి పవిత్రత లేదని, వారిని దళితులుగా దూరం పెట్టడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వారు ఆ పని చేయాల్సి వస్తోందంటూ డాక్టర్ అంబేడ్కర్, నాడే గాంధీకి సమాధానం ఇచ్చారు. వేలాది మంది మరణం 2014–2016 మధ్య రెండేళ్ల కాలంలోనే డ్రైనేజీ క్లీనింగ్ పనిలో 1,327 మంది పారిశుద్ధ్య కార్మికులు మరణించినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2015 నుంచి అంతకుముందు ఆరేళ్ల కాలంలో ఒక్క ముంబై నగరంలోనే 1,386 మంది పారిశుద్ధ్య కార్మికులు విధినిర్వహణలో మరణించారని ‘ఇండియాస్పెండ్’ పరిశోధన సంస్థ 2015లో విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది. వీరిలో 90 శాతం మంది కాంట్రాక్టు లేబర్లే. దేశంలో పాకిపనివారల వ్యవస్థను 2013, సెప్టెంబర్ నెలలో కేంద్ర కార్మిక శాఖ నిషేధించింది. దీన్ని కచ్చితంగా అమలు చేయడంతోపాటు పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలకు పూర్తి భద్రతనిచ్చే ఆధునిక పరికరాలను ఉపయోగించాలంటూ 2014, మార్చి 26వ తేదీన దేశంలోని అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను కచ్చితంగా అమలుచేసి ఉంటే ఇంతమంది పారిశుద్ధ్య కార్మికులు ఎందుకు చనిపోతారు? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న రైల్వే వ్యవస్థలో కూడా పారిశుద్ధ్య పనివారలు ఎందుకు కొనసాగుతారు? కాకపోతే వారిని స్వీపర్లుగా వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిపై వారికి రోజుకు 200 రూపాయలు చెల్లిస్తున్నారు. ప్రాణ హాని లేదా అంగవైకల్య ప్రమాదాలకు ఆస్కారం ఉన్న విధులను ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్టు కార్మికులను అప్పగించరాదంటూ 1947 నాటి పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టం నిర్దేశిస్తుండగా, డ్రైనేజీ పనులకు కాంట్రాక్టు కార్మికులను ఉపయోగిస్తే యజమానులకు ఏడాది జైలు, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తామని 1993 నాటి చట్టం చెబుతోంది. దేశంలోని దాదాపు అన్ని మున్సిపాలిటీలు పారిశుద్ధ్య పనులకు కాంట్రాక్టు కార్మికులను ఉపయోగిస్తున్న విషయం తెల్సిందే. మనకన్నా ఆర్థికంగా వెనకబడిన అనేక దేశాలు పారిశుద్ధ్య పనులకు ఆధునిక పరికరాలను ఉపయోగిస్తున్న విషయం తెల్సిందే. -
‘సఫాయివాలా’లు ఇకపై ‘హౌస్ కీపింగ్ స్టాఫ్’
న్యూఢిల్లీ: తమ శాఖలో పనిచేసే ‘సఫాయి వాలా’ల పేరును ‘హౌస్ కీపింగ్ స్టాఫ్’గా మారుస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సంఘాలతో చర్చించిన మీదట రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. వైద్య, పర్యవేక్షక, తదితర విభాగాల్లో పారిశుధ్య కార్మికులుగా పనిచేసే గ్రూప్–డీ ఉద్యోగులే సఫాయి వాలాలు. ఇకపై వీరిని ప్రతి విభాగం, శాఖతో కలిపి హౌస్ కీపింగ్ అసిస్టెంట్లుగా సంబోధిం చాల్సి ఉంటుందని తెలిపింది. వీరి ఎంపిక, నియామక విధానం, అర్హతలు, సీనియారిటీ, పదోన్నతి ప్రక్రియ, వేతనంలో మాత్రం ఎటువంటి మార్పులు ఉండవని జోనల్ విభాగాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
‘మమ్మల్ని చంపడం ఆపండి’
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఈ ఒక్క నెలలోనే 11 మంది పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో మరణించడంతో పారిశుద్ధ్య కార్మికులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వారంతా ఛలో ఢిల్లీ అంటూ మంగళవారం ఢిల్లీకి చేరుకొని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ‘మమ్మల్ని చంపడం ఆపండి’ అంటూ నినదించారు. వీధుల్లోని, కాలనీల్లోని, గృహ సముదాయాల్లోని మాన్హోల్స్, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడం కోసం వాటిలోకి దిగుతూ పారిశుద్ధ్య కార్మికులు అర్ధంతరంగా మరణిస్తున్నారు. ఈ నెల మొదట్లో ఢిల్లీలోని మోతీ నగర్లో ఓ సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులు మరణించిన విషయం తెల్సిందే. గత ఐదేళ్లలోనే ఒక్క ఢిల్లీలోనే ఇలా 2,403 మంది పారిశుద్ధ్య కార్మికులు మరణించారు. ఆ ఐదుగురు మరణానికి బాధ్యలైన వారిని కఠినంగా శిక్షిస్తామని, బాధితుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించినా ఏ ప్రభుత్వం ఇంతవరకు మాట నిలబెట్టుకోలేదు. ఈ విషయంలో న్యాయం చేయాల్సిందిగా కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి వినతి పత్రం అందజేశామని, స్వచ్ఛ భారత్ కోరుకునే మోదీ తప్పకుండా తమకు న్యాయం చేస్తామని భావించి రెండు వారాలకుపైగా నిరీక్షించామని, ఆయన నుంచి గానీ, ఆయన ప్రభుత్వం నుంచిగానీ ఎలాంటి స్పందన రాకపోవడంతో జంతర్ మంతర్ వద్ద ఈ ఆందోళన నిర్వహిస్తున్నామని ‘సఫాయి కర్మచారి ఆందోళన్’కు చెందిన బెజవాడ విల్సన్ తెలిపారు. సఫాయి కర్మచారి ఆందోళన్ పిలుపు మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పారిశుద్ధ్య కార్మికులు ఢిల్లీకి తరలి వచ్చారు. మానవ పారిశుద్ధ్య కార్మిక వ్యవస్థను దేశంలో 2013లోనే భారత్ నిషేధించిన ఈ వ్యవస్థ ఇంకా కొనసాగడం శోచనీయమైతే పారిశుద్ధ్య పనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అదే సంవత్సరం జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాలను సూచించినా వాటిని కాంట్రాక్టులుగానీ, యజమానులుగానీ, ప్రభుత్వంగానీ పాటించక పోవడం మరీ దారుణం. దేశంలో ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం కోసం ఈ ఏడాది బడ్జెట్లో 17,843 కోట్ల రూపాయలను కేటాయించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం పారిశుద్ధ్య పనివారల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం అన్యాయమని ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ నాయకుడు డీ. రాజా విమర్శించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా ఓ ఆడంబరమే తప్ప ఆచరణలో ఏమీ జరగడం లేదని ఆయన ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికుల భద్రత కోసం చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆయన మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘ఐదు వేల సంవత్సరాలుగా ఈ దేశాన్ని శుభ్రం చేస్తున్నా మా పారిశుద్ధ్య కార్మికుల గోడును పట్టించుకోనప్పుడు ఇంకెలా స్వచ్ఛ భారత్ సాధ్యం అవుతుంది’ అని బేజ్వాడ విల్సన్ వ్యాఖ్యానించారు. కుల వ్యవస్థకు అంటుకున్న అంటరానితనం వల్ల తమకు ఇతర పనులేమీ దొరకడం లేదని, విధిలేకే ఈ వృత్తి మీద ఆధారపడి బతకాల్సి వస్తోందని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. చదవండి: ఈ ఐదుగురు చావుకు ఎవరు బాధ్యులు? -
'బాబూ.. ఇలాగైతే స్వచ్ఛ భారత్ ఎలా?'
హైదరాబాద్: నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కమిటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైర్మన్. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చంద్రబాబు సారథ్యంలోని కమిటీ ఏం చేస్తోంది? స్వచ్చ భారత్‌లో కీలక పాత్ర పోషించడంతో పాటు నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ కమిటీ చేసింది? అసలు సఫాయి కార్మికుల సమస్యలనే ఈ కమిటీ పట్టించుకోకపోవడం విడ్డూరం. ఈ కమిటీ ఇటీవల రూపొందించిన ఓ నివేదికలో సఫాయి కార్మికుల గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు, వారి వేతనాలు గురించి ఈ కమిటీ చర్చించనేలేదు. తమ సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సఫాయి కార్మికులు సమ్మె చేశారు. అయితే వారి సమస్యలు నేటికీ తీరలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నేటితో సరిగ్గా (శుక్రవారం) ఏడాది పూర్తిఅయ్యింది. గతేడాది గాంధీ జయంతి రోజే మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే స్వచ్ఛ భారత్ విజయవంతం కావాలంటే పారిశుద్ధ్య కార్మికులదే కీలక పాత్ర. సామాన్యులు మొదలు సెలెబ్రిటీల వరకు స్వచ్ఛ భారత్‌లో భాగస్వామ్యం అయినా.. వారు ఏదో ఒక రోజు కాసేపు ఫొటోలకు పొజులిచ్చిపోవడమే. నిరంతరం శ్రమించేది సఫాయి కార్మికులే. అలాంటిది చంద్రబాబు సారథ్యంలోని స్వచ్ఛ భారత్ కమిటీ వీరి సమస్యలను విస్మరించడం గమనార్హం. -
కనీస వేతనాలు ఇవ్వండి: సఫాయి కార్మికులు
మెదక్(నంగునూరు): కనీసవేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నంగనూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు సఫాయి కార్మికులు దర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐటీయూ డివిజన్ ఉపాద్యాక్షురాలు బండోజు హేమలత మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా సపాయి కార్మికులు అరకొర వేతనాలతో వెట్టిచాకిరి చేస్తున్నారన్నారు. సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ ప్రభాకర్‌కు అందజేశారు. కార్యక్రమంలో కావాటి యాదగిరి, బాల్‌నర్సయ్య, దేవవ్వ, మీనవ్వ, బలరాం, లక్ష్మి, నర్సింలు పాల్గోన్నారు.