సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఈ ఒక్క నెలలోనే 11 మంది పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో మరణించడంతో పారిశుద్ధ్య కార్మికులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వారంతా ఛలో ఢిల్లీ అంటూ మంగళవారం ఢిల్లీకి చేరుకొని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ‘మమ్మల్ని చంపడం ఆపండి’ అంటూ నినదించారు. వీధుల్లోని, కాలనీల్లోని, గృహ సముదాయాల్లోని మాన్‌హోల్స్, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడం కోసం వాటిలోకి దిగుతూ పారిశుద్ధ్య కార్మికులు అర్ధంతరంగా మరణిస్తున్నారు. ఈ నెల మొదట్లో ఢిల్లీలోని మోతీ నగర్‌లో ఓ సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులు మరణించిన విషయం తెల్సిందే. గత ఐదేళ్లలోనే ఒక్క ఢిల్లీలోనే ఇలా 2,403 మంది పారిశుద్ధ్య కార్మికులు మరణించారు. ఆ ఐదుగురు మరణానికి బాధ్యలైన వారిని కఠినంగా శిక్షిస్తామని, బాధితుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించినా ఏ ప్రభుత్వం ఇంతవరకు మాట నిలబెట్టుకోలేదు.
ఈ విషయంలో న్యాయం చేయాల్సిందిగా కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి వినతి పత్రం అందజేశామని, స్వచ్ఛ భారత్ కోరుకునే మోదీ తప్పకుండా తమకు న్యాయం చేస్తామని భావించి రెండు వారాలకుపైగా నిరీక్షించామని, ఆయన నుంచి గానీ, ఆయన ప్రభుత్వం నుంచిగానీ ఎలాంటి స్పందన రాకపోవడంతో జంతర్ మంతర్ వద్ద ఈ ఆందోళన నిర్వహిస్తున్నామని ‘సఫాయి కర్మచారి ఆందోళన్’కు చెందిన బెజవాడ విల్సన్ తెలిపారు. సఫాయి కర్మచారి ఆందోళన్ పిలుపు మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పారిశుద్ధ్య కార్మికులు ఢిల్లీకి తరలి వచ్చారు.
మానవ పారిశుద్ధ్య కార్మిక వ్యవస్థను దేశంలో 2013లోనే భారత్ నిషేధించిన ఈ వ్యవస్థ ఇంకా కొనసాగడం శోచనీయమైతే పారిశుద్ధ్య పనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అదే సంవత్సరం జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాలను సూచించినా వాటిని కాంట్రాక్టులుగానీ, యజమానులుగానీ, ప్రభుత్వంగానీ పాటించక పోవడం మరీ దారుణం. దేశంలో ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో 17,843 కోట్ల రూపాయలను కేటాయించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం పారిశుద్ధ్య పనివారల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం అన్యాయమని ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ నాయకుడు డీ. రాజా విమర్శించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా ఓ ఆడంబరమే తప్ప ఆచరణలో ఏమీ జరగడం లేదని ఆయన ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికుల భద్రత కోసం చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆయన మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
‘ఐదు వేల సంవత్సరాలుగా ఈ దేశాన్ని శుభ్రం చేస్తున్నా మా పారిశుద్ధ్య కార్మికుల గోడును పట్టించుకోనప్పుడు ఇంకెలా స్వచ్ఛ భారత్ సాధ్యం అవుతుంది’ అని బేజ్‌వాడ విల్సన్ వ్యాఖ్యానించారు. కుల వ్యవస్థకు అంటుకున్న అంటరానితనం వల్ల తమకు ఇతర పనులేమీ దొరకడం లేదని, విధిలేకే ఈ వృత్తి మీద ఆధారపడి బతకాల్సి వస్తోందని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
చదవండి: ఈ ఐదుగురు చావుకు ఎవరు బాధ్యులు?
Comments
Please login to add a commentAdd a comment