‘మోదీ రాజ్యంలోదళితుల స్థానం ఎక్కడ?’ | Balkha Suman questioned narendra modi | Sakshi
Sakshi News home page

‘మోదీ రాజ్యంలోదళితుల స్థానం ఎక్కడ?’

Published Tue, Aug 7 2018 2:29 AM | Last Updated on Wed, Aug 15 2018 2:37 PM

 Balkha Suman questioned narendra modi  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యంలో దేశంలోని దళితులు, గిరిజనులు, మైనారిటీల స్థానం ఎక్కడుందో చెప్పాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ ప్రశ్నించారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో దళితులను ఎలా విస్మరించారో అలాగే ప్రస్తుతం మోదీ ప్రభుత్వం వెళుతోందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సవరణ బిల్లు–2018పై జరిగిన చర్చలో బాల్క సుమన్‌ ప్రసంగించారు. మోదీ రాజ్యంలో దళితులు, గిరిజనులు, మైనారిటీల స్థానం ఎక్కడో ఆయన మన్‌కీబాత్‌లో చెప్పాలని హితవు పలికారు. గత పదేళ్లలో దళితులపై దాడులు 66 శాతం పెరిగాయని, ప్రతి 15 నిమిషాలకో దాడి, రోజూ ఆరుగురు దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాంటిది ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టులను, కేసుల నమోదు నిబంధనలను సుప్రీం కోర్టు సడలించడం తనను తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించి దళితుల పక్షాన కేంద్రం నిలవాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. 27 ఏళ్ల కింద ఉమ్మడి ఏపీలోని చుండూరులో 13 మంది దళితులను ఊచకోత కోస్తే ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదని వాపోయారు. అలాంటిది ప్రస్తుతం సమాజంలో కొందరు రిజర్వేషన్లు దేనికి అని ప్రశ్నించడం బాధాకరమన్నారు.

దేశంలోని దళితులు అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం పొంది, సమానత్వంతో ఉన్నామన్న భావన కలిగే దాకా రిజర్వేషన్లు ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టానికి సంబంధించి వివాదాస్పద తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్లో ఒకరిని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) చైర్మన్‌గా నియమించడాన్ని తప్పుబట్టారు. మోదీ ప్రభుత్వానికి దళితులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్జీటీ చైర్మన్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. అలాగే న్యాయవ్యవస్థ ఉన్నత హోదాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని పేర్కొన్నారు.

పార్లమెంట్‌కే పోటీ చేస్తా: బూర
సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. సోమవారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ, భువనగిరి పార్లమెంట్‌ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, ఎయిమ్స్‌ ఏర్పాటు అయిన తర్వాత మొదటి ఆపరేషన్‌ చేయాలని ఉందని వెల్లడించారు.

రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్రమోదీని కాకుండా, బీసీలని ఆలింగనం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ అనేక రాష్ట్రాల్లో తోక పార్టీగా మారిందని, బీసీలకు అన్యాయం చేస్తే అదికూడా మిగలదన్నారు. భారతదేశంలో బీసీలు 50 శాతంపైగా ఉన్నారని, బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement