10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చాం | 10 crore LPG connections have been provided | Sakshi
Sakshi News home page

10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చాం

Published Tue, May 29 2018 3:10 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

10 crore LPG connections have been provided - Sakshi

న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఉజ్వల యోజన లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం 10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లను ఇచ్చిందని, వాటిలో నాలుగు కోట్లు పేద మహిళలకే కేటాయించామని ఆయన చెప్పారు. గ్యాస్‌ కనెక్షన్లలో సింహ భాగం దళితులు, గిరిజనులకే దక్కాయని ఆయన వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల అనుకూల పథకాల్ని అమలు చేస్తుంటే.. ఆ విషయంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని తప్పుపట్టారు.

తాను యువకుడిగా ఉన్నప్పుడు కేవలం ధనికులు, ప్రభావితం చేసే వ్యక్తులకు మాత్రమే ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చేవారని, ఇప్పుడు పేదలు, దళితులు, గిరిజనులే లక్ష్యంగా పథకం అమలవుతోందని చెప్పారు. ప్రస్తుతం ప్రతీ 100లో 81 కుటుంబాలకు కనెక్షన్లు ఉన్నాయని, ఎన్డీఏ ప్రభుత్వం వల్లే అది సాధ్యమైందన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఆరు దశాబ్దాల్లో 13 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తే.. గత నాలుగేళ్లలో 10 కోట్లు ఇచ్చామని ప్రధాని పేర్కొన్నారు. ఉజ్వల్‌ యోజనతో లబ్ధి పొందిన మహిళలతో మాట్లాడుతూ.. ‘చిన్నతనంలో నా తల్లి కట్టెల పొయ్యిపై వంట చేసేది. ఆ సమయంలో పొగ వల్ల ఎంతో ఇబ్బంది పడేది. భవిష్యత్‌లో 100 శాతం ఇళ్లకు శుద్ధమైన ఇంధనం అందించడమే మా లక్ష్యం’ అని మోదీ అన్నారు.

మా హయాంలోనే దళితులకు ప్రయోజనాలు
ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా దళితులు ఎంతో లాభపడ్డారని పేర్కొంటూ.. ఎన్డీఏ, యూపీఏ హయాంలో దళితులు పొందిన లబ్ధిని మోదీ పోల్చారు.  ‘2010–14 మధ్యలో దళితులు 445 పెట్రోల్‌ బంకులు పొందితే.. 2014–18లో 1200 పెట్రోల్‌ బంకులు కేటాయించాం. యూపీఏ హయాంలో 900 మంది దళితులకు మాత్రమే ఎల్పీజీ డీలర్‌షిప్‌ కేటాయిస్తే.. ఎన్డీఏ పాలనలో 1300 మందికి ఇచ్చాం’ అని చెప్పారు. ఉజ్వల యోజన కింద లబ్ధి పొందడం ప్రారంభమైనప్పటి నుంచి పేదలు, దళితులు, గిరిజన వర్గాల జీవితాలు మెరుగయ్యాయని, సామాజిక సాధికారితలో ఈ పథకం ప్రధాన పాత్ర పోషించిందని మోదీ పేర్కొన్నారు. మే, 2016లో ప్రారంభించిన ఉజ్వల పథకంలో 5 కోట్ల నిరుపేద మహిళలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అనంతరం ఆ సంఖ్యను 8 కోట్లకు పెంచారు.

తమిళనాడు వస్తే దోసె దొరుకుతుందా..?
టీ నగర్‌ (చెన్నై): తమిళనాడుకు వస్తే దోసె దొరుకుతుందా? అని తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన మహిళ రుద్రమ్మతో వీడియో కాన్ఫనెన్స్‌లో మోదీ అన్నారు. తప్పకుండా తయారు చేసి ఇస్తానని, తమ ఇంటికి రావాలని ఆమె ఆహ్వానించారు. అనంత్‌నాగ్‌కు చెందిన మహిళా బృందం ‘ఇది రంజాన్‌ మాసం. ఖురాన్‌ను రోజూ చదువుతాం. రోజూ మీ కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రధానిగా కొనసాగుతారని మేం ఆశిస్తున్నాం’ అని మోదీతో అన్నారు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాకు చెందిన లబ్ధిదారుతో మోదీ మాట్లాడుతూ.. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్‌కు ఇబ్బందులుంటే తనను నేరుగా సంప్రదించాలని సూచించారు. గతంలో కట్టెల పొయ్యి వాడినప్పుడు వంటకు ఎంతో సమయం పట్టేదని.. ఇప్పుడు గ్యాస్‌ పొయ్యితో సమయం ఆదా అవడం వల్ల పిల్లలతో సమయం గడుపుతున్నానని ఆమె పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement