LPG gas connection
-
గ్యాస్ వినియోగదారులకు మరో షాక్! వారికి గుది ‘బండ’
సాక్షి, ముంబై: వంట గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచిన కేంద్రం ఇపుడు వినియోగదారులకు మరో షాక్ ఇవ్వనుంది. గ్యాస్ కొత్త కనెక్షన్లు తీసుకునే వారు చెల్లించాల్సిన వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్‌ను పెంచేసింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది. చమురు మార్కెటింగ్ కంపెనీల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న కసరత్తుతోపాటు, ఏ వంటగదిలోనూ ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు (గరిష్టంగా రెండు సిలిండర్లు) ఉండకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. అంటే డొమెస్టిక్ (14.2 కిలోలు) సిలిండర్‌పై సెక్యూరిటీ డిపాజిట్ రూ. 1450గా ఉంది. తాజా పెంపుతో కొత్తసింగిల్ సిలిండర్ ఇండేన్ కనెక్షన్ కోరుకునే వారు రూ.2,500కు పైనే చెల్లించాలి. సెక్యూరిటీ డిపాజిట్‌తో పాటు ఇతర చార్జీల బాదుడు కూడా తప్పదు. ఫలితంగా కొత్తగా గ్యాస్ కనెక్షన్ పొందాలనే కస్టమర్లకు అదనపు భారం పడుతుంది. అయితే ఉజ్వల స్కీమ్ వినియోగదారులకు సవరించిన రేట్లు వర్తించవు. అలాగే డబుల్ సిలిండర్ కనెక్షన్ పొందే వారికి మరింత భారం తప్పదు. ఇక రూ. 800గా ఉన్న 5 కేజీల సిలిండర్ డిపాజిట్ మొత్తం రూ. 1150కు చేరింది. దీంతోపాటు రెగ్యులేటర్‌కు గతంలోని 150 రూపాయలతో పోలిస్తే ఇపుడు రూ. 250 చెల్లించుకోవాలి. పెంచిన ధరలు రేపటి నుంచి (జూన్ 16) నుంచి అమలులోకి వస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త కనెక్షన్‌కు రూ.900 నుంచి రూ.1,150కి, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రూ.200 నుంచి రూ.1,450 చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న కసరత్తు, ఏ వంటగదిలోనూ ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు (గరిష్టంగా రెండు సిలిండర్లు) ఉండకూడదనే లక్ష్యంతో ఉంది. బహుళ కనెక్షన్లు ఉన్నవారు అదనపు కనెక్షన్లను సరెండర్ చేయాల్సి ఉంటుంది. అలాంటి కనెక్షన్లన్నింటినీ బ్లాక్ చేస్తున్నాయి. అంతేకాదు అదనపు కనెక్షన్ సరెండర్ అయ్యే వరకు రీఫిల్‌లను జారీ చేయడం లేదు.అలాగే కనెక్షన్లు బ్లాక్ చేయబడిన కస్టమర్లు మరొక చమురు కంపెనీ నుండి తాజా కనెక్షన్‌ను పొందకుండా నిరోధించేలా కొత్త కనెక్షన్లను నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చాం
న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఉజ్వల యోజన లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం 10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లను ఇచ్చిందని, వాటిలో నాలుగు కోట్లు పేద మహిళలకే కేటాయించామని ఆయన చెప్పారు. గ్యాస్ కనెక్షన్లలో సింహ భాగం దళితులు, గిరిజనులకే దక్కాయని ఆయన వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల అనుకూల పథకాల్ని అమలు చేస్తుంటే.. ఆ విషయంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని తప్పుపట్టారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు కేవలం ధనికులు, ప్రభావితం చేసే వ్యక్తులకు మాత్రమే ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చేవారని, ఇప్పుడు పేదలు, దళితులు, గిరిజనులే లక్ష్యంగా పథకం అమలవుతోందని చెప్పారు. ప్రస్తుతం ప్రతీ 100లో 81 కుటుంబాలకు కనెక్షన్లు ఉన్నాయని, ఎన్డీఏ ప్రభుత్వం వల్లే అది సాధ్యమైందన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఆరు దశాబ్దాల్లో 13 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇస్తే.. గత నాలుగేళ్లలో 10 కోట్లు ఇచ్చామని ప్రధాని పేర్కొన్నారు. ఉజ్వల్ యోజనతో లబ్ధి పొందిన మహిళలతో మాట్లాడుతూ.. ‘చిన్నతనంలో నా తల్లి కట్టెల పొయ్యిపై వంట చేసేది. ఆ సమయంలో పొగ వల్ల ఎంతో ఇబ్బంది పడేది. భవిష్యత్‌లో 100 శాతం ఇళ్లకు శుద్ధమైన ఇంధనం అందించడమే మా లక్ష్యం’ అని మోదీ అన్నారు. మా హయాంలోనే దళితులకు ప్రయోజనాలు ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా దళితులు ఎంతో లాభపడ్డారని పేర్కొంటూ.. ఎన్డీఏ, యూపీఏ హయాంలో దళితులు పొందిన లబ్ధిని మోదీ పోల్చారు. ‘2010–14 మధ్యలో దళితులు 445 పెట్రోల్ బంకులు పొందితే.. 2014–18లో 1200 పెట్రోల్ బంకులు కేటాయించాం. యూపీఏ హయాంలో 900 మంది దళితులకు మాత్రమే ఎల్పీజీ డీలర్షిప్ కేటాయిస్తే.. ఎన్డీఏ పాలనలో 1300 మందికి ఇచ్చాం’ అని చెప్పారు. ఉజ్వల యోజన కింద లబ్ధి పొందడం ప్రారంభమైనప్పటి నుంచి పేదలు, దళితులు, గిరిజన వర్గాల జీవితాలు మెరుగయ్యాయని, సామాజిక సాధికారితలో ఈ పథకం ప్రధాన పాత్ర పోషించిందని మోదీ పేర్కొన్నారు. మే, 2016లో ప్రారంభించిన ఉజ్వల పథకంలో 5 కోట్ల నిరుపేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అనంతరం ఆ సంఖ్యను 8 కోట్లకు పెంచారు. తమిళనాడు వస్తే దోసె దొరుకుతుందా..? టీ నగర్ (చెన్నై): తమిళనాడుకు వస్తే దోసె దొరుకుతుందా? అని తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన మహిళ రుద్రమ్మతో వీడియో కాన్ఫనెన్స్‌లో మోదీ అన్నారు. తప్పకుండా తయారు చేసి ఇస్తానని, తమ ఇంటికి రావాలని ఆమె ఆహ్వానించారు. అనంత్‌నాగ్‌కు చెందిన మహిళా బృందం ‘ఇది రంజాన్ మాసం. ఖురాన్‌ను రోజూ చదువుతాం. రోజూ మీ కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రధానిగా కొనసాగుతారని మేం ఆశిస్తున్నాం’ అని మోదీతో అన్నారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన లబ్ధిదారుతో మోదీ మాట్లాడుతూ.. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్‌కు ఇబ్బందులుంటే తనను నేరుగా సంప్రదించాలని సూచించారు. గతంలో కట్టెల పొయ్యి వాడినప్పుడు వంటకు ఎంతో సమయం పట్టేదని.. ఇప్పుడు గ్యాస్ పొయ్యితో సమయం ఆదా అవడం వల్ల పిల్లలతో సమయం గడుపుతున్నానని ఆమె పేర్కొంది. -
8 నాటికి ప్రతి ఇంటికి దీపం కనెక్షన్
జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బీచ్‌రోడ్ (విశాఖ తూర్పు): వచ్చే నెల 8వ తేదీ నాటికి ప్రతి ఇంటికి దీపం పథకం కింద ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉండే విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మండలాధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ లేని లబ్ధిదారులు సుమారు మూడు లక్షల 20 వేల మంది ఉన్నట్లు సర్వేలో తేలిందన్నారు. జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం 1.4 లక్షల మందికి ఎల్పీజీ కనెక్షన్లకు సంబంధించి గ్రౌండింగ్ తప్పని సరిగా చేయాలన్నారు. ఇప్పటికి లక్ష 35 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 93 వేలు మాత్రమే అప్లోడ్ జరిగిందన్నారు. గ్యాస్ ఏజెన్సీల ద్వారా కంపెనీ కస్టమర్ ఐడీ జనరేటర్ చేయాలన్నారు. అదే విధంగా దీపం వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ఇంటింటికి సర్వే చేయడం, విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ప్రతి మండలంలో ప్రణాళికను తయారు చేసుకొని రోజును 14 వేలు చొప్పున సర్వే చేయాలన్నారు. గ్రామ స్థాయిలో సమావేశాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. ఆర్డీవోలు బాధ్యత వహించి సక్రమంగా అమలు జరిగేలా చూడాలన్నారు. ఏజెన్సీ ప్రాంత మండలాల్లో తక్కువగా గ్రౌండింగ్ అవుతున్నాయని, సర్వేను వేగవంతం చేయాలన్నారు. వచ్చే నెల నుంచి ఏజెన్సీ ప్రాంత మండలాలలో కిరోసిన్ సరఫరా ఆగిపోతుందని, సంబంధిత విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ జి.సృజన, జేసీ–2 డి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.