సదాశివపేట(సంగారెడ్డి): మున్సిపల్ పరిధి రోజురోజుకు విస్తరించడంతోపాటు జనాభా పెరుగుతోందని, అయితే శానిటేషన్ నిర్వహణ అధ్వానంగా తయారైందని, లై అవుట్లలో రోడ్లు, లైట్లు తదితర పనులు పూర్తి కాకుండానే తుది అనుమతి ఎలా ఇస్తారని కౌన్సిలర్లు కమిషనర్ కృష్ణారెడ్డిని ప్రశ్నించారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో జరిగిన తెలంగాణ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం అనంతరం అనధికారికంగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు శానిటేషన్, లేఅవుట్లు, ఇతర అభివృద్ధి పనులు విషయంలో అధికారుల వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు.
పట్టణంలో పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. మురుగు కాల్వల్లో పూడిక పెరుకుపోతుందని, పారిశుద్ధ్య నిర్వహణ ప్రైవేట్‌కు అప్పగించవద్దని 3వ వార్డు కౌన్సిలర్ చౌదరి ప్రకాశ్ చెప్పినట్లు సమాచారం. ప్రైవేట్ చెత్తసేకరణను రద్దుచేసి మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో చేయించాలన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది చాలడంలేదని, సిబ్బంది సంఖ్యను పెంచాలన్నారు. పట్టణ పరిధిలో ఎన్ని లే అవుట్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారని, లే అవుట్లలో రోడ్లు, మురుగునీటి కాల్వలు, వాటర్ ట్యాంకు నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా పైపులైన్ నిర్మించకుండా ఫైనల్ రిలీజ్ ఎందుకు చేస్తున్నారని కౌన్సిలర్ ఇంద్రమోహన్‌గౌడ్ కమిషనర్ కృష్ణారెడ్డిని ప్రశ్నించనట్లు తెలిసింది.
లే అవుట్లలో అభివృద్ధి పనులు జరగకున్నా, ఇతర సౌకర్యాలు లేకున్నా ప్లాట్లు కొనుగోలు చేసినవారికి ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారని, నిబంధనల మెరకే లే అవుట్ ఫైనల్ చేస్తున్నామని కమిషనర్ సమాధానమిచ్చినట్లు సమాచారం. సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణ పనులు నాణ్యతా జరగడంలేదని కౌన్సిలర్లు నాగరాజ్‌గౌడ్, చౌదరి ప్రకాశ్ నిలదీశారని, నాణ్యతగా పనులు చేపట్టేందుకు ఇంజనీర్‌ను ఆదేశిస్తామని కమిషనర్ సమాధానమిచ్చినట్లు తెలిసింది.
మూడు నెలలకోసారి కాకుండా ప్రతీనెల సమావేశాలు నిర్వహిస్తే ప్రజాసమస్యలు సులువుగా పరిష్కారమవుతాయని మెజార్టీ కౌన్సిలర్లు కోరినట్లు సమాచారం. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు విద్యాసాగర్‌రెడ్డి, గుండు రవి, శ్రీనివాస్, ఇలియాస్ షరీఫ్, నాగరాజ్‌గౌడ్, గుండు రవి, ఖుద్దూస్, పిచర్యాగడి రేణుక, కోఆప్షన్ మెంబర్ కలీమ్ పటేల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment