కరోనా కట్టడిపై సమీక్ష జరుపుతున్న మంత్రులు
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిని ఆంధ్రప్రదేశ్‌కు రప్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ఏపీకి వచ్చేందుకు సుముఖంగా ఉన్న మన వాళ్లను తరలించడంపై రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటించనుంది. ఈ మేరకు కరోనా నియంత్రణపై ఏర్పాటైన మంత్రుల కమిటీ బుధవారం సమావేశమై చర్చించింది. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు తీరును సమీక్షించింది. అనంతరం సమావేశ వివరాలను మంత్రి ఆళ్ల నాని మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
► ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి వల్ల రాష్ట్రంలో గ్రీన్ జోన్లు రెడ్ జోన్లుగా మారకుండా చర్యలు తీసుకుంటాం. గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులను ఏపీకి తరలించడంపై సీఎం జగన్ ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వారిని రప్పిస్తున్నారు.
► ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఔట్ పేషంట్ల(ఓపీ)ను చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలిచ్చింది. దీన్ని పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం.
► సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, మేకతోటి సుచరిత, సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులు పీవీ రమేశ్, కృష్ణబాబు, కె.భాస్కర్, గిరిజా శంకర్, విజయ్‌కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లో వైరస్‌తోనూ పోరాటం: మంత్రి కన్నబాబు
► రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు కరోనా వైరస్‌తోపాటు ఎల్లో వైరస్‌తోనూ పోరాడాల్సి వస్తోంది. లేనివి ఉన్నట్టుగా ప్రచారం చేయడమే ఎల్లో వైరస్ పని. 4 లక్షల మంది రైతులను రైతు భరోసా పథకం నుంచి తొలగించినట్లు చంద్రబాబు దుష్ప్రచారం చేయడమే దీనికి నిదర్శనం.
► ప్రభుత్వం రైతుల నుంచి కూరగాయలు, పండ్లు కొనుగోలు చేస్తూ రైతు బజార్ల ద్వారా విక్రయిస్తోంది. మొబైల్ రైతు బజార్లను కూడా ఏర్పాటు చేశాం.
► చంద్రబాబు హైదరాబాద్ నుంచి వచ్చి రాష్ట్రంలో క్వారంటైన్ కేంద్రాలను సందర్శిస్తే నిజాలు తెలుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment