జీఎంఆర్ కే సెజ్‌లో తయారవుతున్న పీపీఈ కిట్లు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌తో అనేక రంగాలు దెబ్బతింటే ఒక్క ఫార్మా రంగం మాత్రమే కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అవసరమైన పరికరాలు, కిట్లు తయారీపై పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పీపీఈ కిట్ల నుంచి వెంటిలేటర్ల వరకు సొంతంగా తయారు చేసుకోవడంపై దృష్టి సారించింది. విశాఖలోని ఏఎంటీజెడ్ పార్కులో కేవలం 15 రోజుల్లోనే కరోనా వైరస్‌ను గుర్తించే ర్యాపిడ్ టెస్ట్ కిట్లను తయారు చేశారు. ప్రస్తుతం ఇక్కడ వారానికి 25,000 కిట్లు తయారవుతున్నాయి. ఈ కిట్లతోనే పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నారు. 55 నిమిషాల్లోనే ఫలితం రావడం ఈ కిట్ల ఘనత. వెంటిలేటర్లు అభివృద్ధి చేయడంపై ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయి. డాక్టర్లు మొదలు పారిశుధ్య కార్మికుల వరకు వినియోగించే ఎన్ 95మాస్క్‌లు, 40 జీఎస్‌ఎం పీపీఈ కిట్లను భారీగా తయారు చేశారు. ఇందుకోసం కాకినాడ జీఎంఆర్ సెజ్, బ్రాండిక్స్ సెజ్‌లను వినియోగించుకున్నారు. దీంతో కరోనా సమయంలోనూ వేల మంది మహిళలకు రోజుకు రూ.500 వరకు ఉపాధి లభించింది. ఇదే సమయంలో అనేక ఫార్మా కంపెనీలు పెద్ద సంఖ్యలో శానిటైజర్స్‌ను ఉత్పత్తి చేశాయి. ఫేస్ మాస్కులు, గ్లౌజుల ఉత్పత్తి కూడా జరిగింది.
45,000 మందికి ఉపాధి
లాక్‌డౌన్ సమయంలో ఫార్మా రంగాన్ని అత్యవసర సేవలు కింద పరిగణించడంతో అన్ని ఫార్మా, మెడికల్ పరికరాల తయారీ సంస్థలు యథావిధిగా పనిచేశాయి. డాక్టర్ రెడ్డీస్, అరబిందో, నాట్కో, దివీస్, బయోకాన్, జీవీకే బయో, హెటిరో, సువెన్ లైఫ్ వంటి ఫార్మా దిగ్గజాలతో పాటు 285కిపైగా యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా 45,000 మందికి ఉపాధి లభిస్తోంది. సుమారు 9,000 కోట్ల విలువైన ఫార్మా ఎగుమతులు రాష్ట్రం నుంచి జరుగుతున్నాయి. అమెరికా కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పాటు ఇతర ఔషధాల ఎగుమతులకు అనుమతులు ఇవ్వడం ఈ రంగానికి కలిసొచ్చింది.
ఎగుమతులు పెరిగాయి
లాక్‌డౌన్ సమయంలో ఒక్క ఫార్మా ఎగుమతుల్లోనే వృద్ధి నమోదైంది. ఏప్రిల్ నెలలో 0.25 శాతం వృద్ధితో రూ. 11,500 కోట్ల విలువైన దేశీయ ఫార్మా ఎగుమతులు జరిగాయి. లాజిస్టిక్ సమస్యలు, కొన్ని ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు ఉన్నా ఈ వృద్ధిరేటు నమోదైంది.
– ఉదయ్ భాస్కర్, డైరెక్టర్ జనరల్, ఫార్మాఎగ్జిల్
రెండు నెలల్లో 1.12 లక్షల పీపీఈ కిట్లు తయారు చేశాం
జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సహకారంతో లాభాపేక్ష లేకుండా రెండు నెలల్లో 1,12,000 పీపీఈ కిట్లు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాం. కాకినాడ సెజ్‌లోని (కేసెజ్) పాల్స్ ప్లష్ ఇండియా అనే బొమ్మల తయారీ కేంద్రంతో మాట్లాడి పీపీఈ కిట్లను తయారు చేశాం. ప్రస్తుతం రోజుకు 5,000 కిట్లను తయారుచేస్తున్నాం.
– రామరాజు, ప్రాజెక్ట్స్ హెడ్, కేసెజ్.
రాష్ట్ర ప్రభుత్వ సహకారం బాగుంది
లాక్‌డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించింది. ఫార్మా యూనిట్లు పూర్తి స్థాయిలో పనిచేశాయి. అత్యవసర సేవల కిందకి తీసుకు రావడంతో వైజాగ్, శ్రీకాకుళం యూనిట్లు రెండు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. లాక్‌డౌన్ ప్రకటించిన ఒకటి రెండు రోజులు చిన్న చిన్న ఇబ్బందులు తప్ప ఎటువంటి సమస్య తలెత్తలేదు. ఎగుమతులు కూడా సాఫీగా సాగాయి. ఈ రెండు యూనిట్ల నుంచి ప్రతీ నెలా వందల కోట్ల టర్నోవర్ చేస్తున్నాం.
–జీవీ ప్రసాద్, కో చైర్మన్, ఎం.డి., డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్
Comments
Please login to add a commentAdd a comment