లేఖల సెగ
- జిల్లా పునర్విభజనలో కొత్త మలుపు
- ముగ్గురు ఎమ్మెల్యేల ప్రతిపాదనలపై ఆందోళనలు
- రాయపర్తి, జఫర్‌గఢ్‌లో ప్రజాగ్రహం
- ఎర్రబెల్లి, టి.రాజయ్య దిష్టిబొమ్మల దహనం
- ముత్తిరెడ్డి వైఖరికి నిరసనగా నేడు చేర్యాల బంద్
- ‘నా పాలకుర్తి నియోజకవర్గాన్ని జనగామ జిల్లాలో కలిపేందుకు నేను, నా నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మంత్రుల కమిటీకి లేఖ ఇచ్చారు. ఈ లేఖపై రాయపర్తి మండలంలో నిరసనలు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యే దయాకర్‌రావు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. వరంగల్‌కు దగ్గరగా ఉండే తమ మండలాన్ని దూరంగా ఉండే జనగామ జిల్లాలో కలపడం ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వార్థరాజకీయాలకు నిదర్శమని డీసీసీ ఉపాధ్యక్షుడు బిల్ల సుధీర్‌రెడ్డి అన్నారు. తొర్రూరు మండలాన్ని వరంగల్ జిల్లాలో కొనసాగించాలని... కొత్తగా ఏర్పాటయ్యే మహబూబాబాద్‌లో కలిపినా ఫర్వాలేదని తొర్రూరు జేఏసీ కన్వీనర్ కె.ప్రవీణ్‌రాజు పేర్కొన్నారు. ఈ రెండు ప్రతిపాదనలకు భిన్నంగా జనగామలో కలిపితే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
- ‘నా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని జనగామ జిల్లాలో కలిపేందుకు నేను, నా నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య మంత్రుల కమిటీకి లేఖ ఇచ్చారు. ఎమ్మెల్యే టి.రాజయ్య లేఖపై ధర్మసాగర్, జఫర్‌గఢ్ మండలాల్లో వ్యతిరేకత మొదలైంది. జఫర్‌గఢ్ మండలం కూనూర్‌లో ఎమ్మెల్యే రాజయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జఫర్‌గఢ్ మండలాన్ని వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ధర్మసాగర్ మండలాన్ని వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని, మంత్రుల కమిటీకి ఇచ్చిన లేఖను ఎమ్మెల్యే టి.రాజయ్య వెనక్కి తీసుకోవాలని మండలంలోని పలువురు నేతలు డిమాండ్ చేశారు.
- జనగామ జిల్లా ఏర్పాటు చేసి నియోజకవర్గం మొత్తాన్ని అందులోనే కలపాలని మంత్రుల కమిటీని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కోరడంపై చేర్యాల, మద్దూరు మండలాల్లో వ్యతిరేకత మొదలైంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రతిపాదనకు వ్యతిరేకంగా చేర్యాల జేఏసీ, చాంబర్ ఆఫ్ కామర్స్, చేర్యాల పరిరక్షణ సమితి, కుల సంఘాల ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. చేర్యాల, మద్దూరు మండలాల్లో మంగళవారం(ఆగస్టు 16న) బంద్ నిర్వహిస్తున్నట్లు చేర్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతినిధులు ఉడుముల భాస్కర్‌రెడ్డి, పుర్మ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. చేర్యాల, మద్దూరు మండలాలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రతిపాదనలు ఇవ్వడం సరికాదని, ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే సహించేదిలేదని పేరొన్నారు. జనగామ జిల్లాలో చేర్యాల ప్రాంతాన్ని కలపాలని చెప్పడం స్వార్థరాజకీయ ప్రయోజనల కోసం ఇచ్చిన ప్రతిపాదన అని విమర్శించారు.