The new turn
-
కొత్తగా ‘కాకతీయ’
తెరపైకి వరంగల్ రూరల్ జిల్లా 14 మండలాలతో ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదనలు నగరం మొత్తం ఒకే జిల్లాలో.. వరంగల్ జిల్లాలో భారీ మార్పులు తాజా ప్రతిపాదన ప్రకారం... వరంగల్ జిల్లా : వరంగల్, ఖిలావరంగల్, హన్మకొండ, కాజీపేట, హసన్‌పర్తి, ధర్మసాగర్, చిల్పూరు, వేలేరు, స్టేషన్ ఘన్పూర్, జఫర్‌గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, నర్మెట, హుజూరాబాద్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, జమ్మికుంట, ఇల్లంతకుంట. కాకతీయ జిల్లా : వర్ధన్నపేట, ఐనవోలు, పర్వతగిరి, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం, పరకాల, శాయంపేట, నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట, ఖానాపురం, దుగ్గొండి, నల్లబెల్లి. సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజన కొత్త మలుపు తిరుగుతోంది. వరంగల్ నగరం మొత్తం ఒకే జిల్లాలో ఉండాలని పలు వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. వరంగల్ జిల్లాను... వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా ఏర్పాటు చేసేలా ముసాయిదాలో పేర్కొంది. గ్రేటర్ వరంగల్ నగరాన్ని వరంగల్, హన్మకొండ జిల్లాల్లో సగం చొప్పున కేటాయిస్తూ ముసాయిదాలో పొందుపరిచారు. దీనిపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత మొదలైంది. వరంగల్ నగరాన్ని రెండు జిల్లాల్లో ఉంచే ప్రతిపాదనపై రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ప్రజా సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. గ్రేటర్ వరంగల్ నగరాన్ని ఒకే జిల్లాలోకి తెచ్చేలా కొత్తగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొన్న హన్మకొండ జిల్లాలో గ్రేటర్ వరంగల్‌లోని తూర్పు నియోజకవర్గాన్ని చేర్చి.. వరంగల్ జిల్లాగా మార్చాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అలాగే ముసాయిదా జాబితాలో వరంగల్ జిల్లాగా పేర్కొన్న దానికి కొత్తగా కాకతీయ జిల్లాగా నామకరణం చేసే ఆలోచనలో ఉన్నారు. ముసాయిదాలో పేర్కొన్న ప్రతిపాదనలపైనే విమర్శలు వస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేస్తున్న ప్రతిపాదనల తీరు మరిన్ని విమర్శలకు దారితీస్తోంది. హన్మకొండ జిల్లాను పూర్తిగా తొలగించేందుకే కొత్తగా వరంగల్ రూరల్(కాకతీయ) జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తెచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆగస్టు 22న జారీ చేసిన ముసాయిదా ప్రకారం... వరంగల్ జిల్లా : వరంగల్, ఖిలావరంగల్(కొత్తది), హసన్‌పర్తి, వర్ధన్నపేట, ఐనవోలు(కొత్తది), పర్వతగిరి, గీసుకొండ, సంగెం, ఆత్మకూరు, పరకాల, శాయంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ. హన్మకొండ జిల్లా : హన్మకొండ, కాజీపేట(కొత్తది), ధర్మసాగర్, వేలేరు(కొత్తది), స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు(కొత్తది), జఫర్‌గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపురం, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట(కొత్తది). -
లేఖల సెగ
జిల్లా పునర్విభజనలో కొత్త మలుపు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రతిపాదనలపై ఆందోళనలు రాయపర్తి, జఫర్‌గఢ్‌లో ప్రజాగ్రహం ఎర్రబెల్లి, టి.రాజయ్య దిష్టిబొమ్మల దహనం ముత్తిరెడ్డి వైఖరికి నిరసనగా నేడు చేర్యాల బంద్ సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన అధికార పార్టీ శాసనసభ్యులకు తలనొప్పులు తెస్తోంది. జిల్లాల పునర్విభజనపై మంత్రుల కమిటీ ఆదివారం నిర్వహించిన సమావేశంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇచ్చిన ప్రతిపాదనలు ఆయా నియోజకవర్గాల్లో కొత్త చిచ్చు రేపుతున్నాయి. జనగామ జిల్లా ఏర్పాటు చేసి తమ నియోజకవర్గాలను అందులో కలపాలని ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రుల కమిటీకి లేఖలు ఇచ్చారు. ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనలు పలు మండలాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యేలు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రతిపాదనలు చేశారని రాయపర్తి, తొర్రూరు, జఫర్‌గఢ్, ధర్మసాగర్, చేర్యాల, మద్దూరు మండలాల ప్రజలు, మండల స్థాయి నేతలు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనలు అసంబద్ధంగా ఉన్నాయని ఆయా మండలాల నేతలు అంటున్నారు. ఎమ్మెల్యేలుగా నియోజకవర్గం మొత్తం ప్రజల మనోభావాల ప్రకారం వ్యవహరించాలిగానీ.. ఏకపక్షంగా ప్రతిపాదనలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఎమ్మెల్యేల లేఖలు ఇప్పుడు వారి నియోజకవర్గాల్లో రాజకీయ ఇబ్బందులకు కారణమవుతున్నాయి. ‘నా పాలకుర్తి నియోజకవర్గాన్ని జనగామ జిల్లాలో కలిపేందుకు నేను, నా నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మంత్రుల కమిటీకి లేఖ ఇచ్చారు. ఈ లేఖపై రాయపర్తి మండలంలో నిరసనలు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యే దయాకర్‌రావు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. వరంగల్‌కు దగ్గరగా ఉండే తమ మండలాన్ని దూరంగా ఉండే జనగామ జిల్లాలో కలపడం ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వార్థరాజకీయాలకు నిదర్శమని డీసీసీ ఉపాధ్యక్షుడు బిల్ల సుధీర్‌రెడ్డి అన్నారు. తొర్రూరు మండలాన్ని వరంగల్ జిల్లాలో కొనసాగించాలని... కొత్తగా ఏర్పాటయ్యే మహబూబాబాద్‌లో కలిపినా ఫర్వాలేదని తొర్రూరు జేఏసీ కన్వీనర్ కె.ప్రవీణ్‌రాజు పేర్కొన్నారు. ఈ రెండు ప్రతిపాదనలకు భిన్నంగా జనగామలో కలిపితే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ‘నా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని జనగామ జిల్లాలో కలిపేందుకు నేను, నా నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య మంత్రుల కమిటీకి లేఖ ఇచ్చారు. ఎమ్మెల్యే టి.రాజయ్య లేఖపై ధర్మసాగర్, జఫర్‌గఢ్ మండలాల్లో వ్యతిరేకత మొదలైంది. జఫర్‌గఢ్ మండలం కూనూర్‌లో ఎమ్మెల్యే రాజయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జఫర్‌గఢ్ మండలాన్ని వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ధర్మసాగర్ మండలాన్ని వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని, మంత్రుల కమిటీకి ఇచ్చిన లేఖను ఎమ్మెల్యే టి.రాజయ్య వెనక్కి తీసుకోవాలని మండలంలోని పలువురు నేతలు డిమాండ్ చేశారు. జనగామ జిల్లా ఏర్పాటు చేసి నియోజకవర్గం మొత్తాన్ని అందులోనే కలపాలని మంత్రుల కమిటీని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కోరడంపై చేర్యాల, మద్దూరు మండలాల్లో వ్యతిరేకత మొదలైంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రతిపాదనకు వ్యతిరేకంగా చేర్యాల జేఏసీ, చాంబర్ ఆఫ్ కామర్స్, చేర్యాల పరిరక్షణ సమితి, కుల సంఘాల ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. చేర్యాల, మద్దూరు మండలాల్లో మంగళవారం(ఆగస్టు 16న) బంద్ నిర్వహిస్తున్నట్లు చేర్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతినిధులు ఉడుముల భాస్కర్‌రెడ్డి, పుర్మ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. చేర్యాల, మద్దూరు మండలాలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రతిపాదనలు ఇవ్వడం సరికాదని, ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే సహించేదిలేదని పేరొన్నారు. జనగామ జిల్లాలో చేర్యాల ప్రాంతాన్ని కలపాలని చెప్పడం స్వార్థరాజకీయ ప్రయోజనల కోసం ఇచ్చిన ప్రతిపాదన అని విమర్శించారు.