సజ్జల రామకృష్ణారెడ్డి, బండి శ్రీనివాసరావు, టి.కె.రాణా
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రుల కమిటీ మధ్య మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. తొలుత ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల వ్యవహారాలు) చంద్రశేఖర్‌రెడ్డి నిర్వహించిన చర్చలు సానుకూలంగా జరిగాయి. (మరో సభ్యుడు మంత్రి పేర్ని నాని అనారోగ్యంతో ఈ సమావేశానికి హాజరు కాలేదు) పీఆర్సీ సాధన సమితి నేతలు వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ తదితర నేతలు ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించారు.
తమకు పాత జీతాలే వేయాలని మరోసారి మంత్రుల కమిటీని కోరారు. దీంతో పాటు కొత్త పీఆర్సీకి సంబంధించిన జీవోలను రద్దు చేయాలని, పీఆర్సీ నివేదికను ఇవ్వాలన్నారు. అంశాల వారీగా చర్చలు జరిపిన తర్వాత మరోసారి చర్చలకు పిలుస్తామని మంత్రుల కమిటీ వారికి చెప్పింది. చర్చలకు అందుబాటులో ఉండాలని కోరింది. అన్ని విషయాల గురించి మాట్లాడుకుందామని, ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించవద్దని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలను కోరింది. అనంతరం వారు అక్కడి నుంచి బయటకు వెళ్లారు. కాగా, మంగళవారం చర్చలు సానుకూలంగా జరిగాయని, మరోసారి మళ్లీ చర్చలు జరుపుతామని సాయంత్రం తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కాగా, పీఆర్సీ సాధన సమితి నేత, ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ చర్చలు విఫలమయ్యాయని చెప్పారు.
పీఆర్సీ సాధన కమిటీ ర్యాలీకి అనుమతి నిరాకరణ
విజయవాడ స్పోర్ట్స్: పీఆర్సీ సాధన కమిటీ ఈ నెల 3వ తేదీన చేపట్టనున్న చలో విజయవాడ ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పోలీస్ కమిషనరేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మూడో తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విజయవాడలో భారీ ర్యాలీకి పీఆర్సీ సాధన కమిటీ అనుమతి కోసం తమకు దరఖాస్తు చేసుకుందన్నారు. కరోనా మూడో దశ వ్యాప్తి, సెక్షన్ పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో వారికి అనుమతి నిరాకరించామని చెప్పారు. విజయవాడ నగరంలో కోవిడ్ ఉధృతి ఎక్కువ ఉందని, ఈ ర్యాలీ ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వారి వద్దకు వచ్చే సామాన్య ప్రజలు కరోనా బారిన పడే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేల మందితో ర్యాలీలు చట్టపరంగానే కాకుండా ఎంప్లాయ్ కాండాక్ట్ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అందువల్ల ఉద్యోగులెవ్వరూ ఈ ర్యాలీకి రాకూడదని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సమ్మెకు వెళ్లొద్దు.. అన్ని విషయాలు మాట్లాడుకుందాం
ఆందోళనలు విరమించుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలను కోరాం. ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్సీ ద్వారా ఉద్యోగులకు ఎంత చేయాలో అంత చేసిన విషయాన్ని మరోసారి వారికి వివరించాం. ఉద్యోగ సంఘాల నాయకులు పాత పీఆర్సీని అమలు చేయాలని కోరారు. పీఆర్సీ ప్రకటించి కొత్త పీఆర్సీ అమలైన తర్వాత పాత పీఆర్సీని అమలు చేయడం ఎంత వరకు సాధ్యమో ఆలోచించాలని చెప్పాం. ఉద్యోగులకు ఇచ్చిన మధ్యంతర భృతిని రికవరీ చేయడం ఏమీ లేదు. ఐఆర్ అనేది కేవలం సర్దుబాటు మాత్రమే. అది రికవరీ కాదు. ఉద్యోగులపై బెదిరింపులు, ఒత్తిళ్లంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించే వరకు వెళ్లవద్దని వారిని కోరాం. అధికారుల కమిటీ నివేదికలోనే పీఆర్సీ నివేదికలోని అన్ని అంశాలు ఉన్నాయని వారికి వివరించాం.
– సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు
చలో విజయవాడను విజయవంతం చేయాలి
గురువారం చేపట్టే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగులందరూ విజయవంతం చేయాలి. ప్రభుత్వంతో చర్చలు సఫలం కాలేదు. ఉద్యమ కార్యాచరణ యథాతథంగా కొనసాగుతుంది. మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో కొత్త పీఆర్సీ ప్రకారం నష్ట పోతున్న విషయాన్ని మళ్లీ చెప్పాం. మూడు ప్రధాన అంశాలపై తేల్చాలని స్పష్టం చేశాం. అవి సాధ్యపడవని మంత్రుల కమిటీ సమాచారం ఇచ్చింది. అందుకే కార్యాచరణ యధావిధిగా కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్‌లు ఛలో విజయవాడకు వెళ్లొద్దని ఉద్యోగులకు చెప్పే ప్రైవేటు క్లాసులు మానుకోవాలి. ఉద్యోగులను భయ భ్రాంతులకు గురి చేయొద్దని కలెక్టర్లకు చెబుతున్నాం. సమ్మెలు, ఆందోళనలు తాత్కాలికమే. మళ్లీ అంతా కలిసి పని చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
– బండి శ్రీనివాసరావు, పీఆర్సీ సాధన సమితి నేత, ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment