చర్చలే దారి | Sajjala Ramakrishna Reddy Comments On New PRC | Sakshi
Sakshi News home page

చర్చలే దారి

Published Fri, Jan 28 2022 4:46 AM | Last Updated on Fri, Jan 28 2022 4:47 AM

Sajjala Ramakrishna Reddy Comments On New PRC - Sakshi

మాట్లాడుతున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. చిత్రంలో మంత్రులు పేర్ని నాని, బొత్స

సాక్షి, అమరావతి: జీతాల విషయంలో ఏ ఒక్క ఉద్యోగిని కూడా నష్టపోనివ్వబోమని, కొత్త పే స్లిప్‌ వచ్చిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. పీఆర్సీపై అపోహలు తొలగించేందుకు ప్రభుత్వం నాలుగు మెట్లు దిగేందుకైనా సిద్ధంగా ఉందన్నారు. గురువారం సచివాలయంలో మంత్రుల కమిటీ వరుసగా మూడో రోజు సమావేశం అనంతరం రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

షరతులు విధిస్తే ఎలా?
పీఆర్సీ సాధన కమిటీ నుంచే కాకుండా ఇతర ఏ సంఘాలు వచ్చినా ప్రభుత్వం చర్చలు జరుపుతుందని సజ్జల తెలిపారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లాల్సిన అవసరం రాకుండా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఏ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో తెలియచేసే అవకాశం ఇవ్వకుండా చర్చలకు షరతులు విధిస్తే ఎలా? అని ప్రశ్నించారు. చర్చలు కాకుండా ఇక ఏ మార్గంలో సమస్యకు సాంత్వన లభిస్తుందో చెప్పాలని సూచించారు. ప్రభుత్వం నియమించిన అధికారిక కమిటీ వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి ఆహ్వానించినా ఉద్యోగ సంఘాలు రాకపోవడం దురదృష్టకరమన్నారు.

బాధ్యతాయుత నాయకులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మొండి వైఖరి విడనాడి న్యాయబద్ధమైన అంశాలు ఉంటే ప్రభుత్వంతో కలిసి సరిదిద్దుకోవాలన్నారు. సెలవు రోజుల్లో మినహా నిత్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి సచివాలయంలో మంత్రుల కమిటీ అందుబాటులో ఉంటుందన్నారు. కమిటీ స్థాయిలో సమస్యకు పరిష్కారం లభించకుంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రెచ్చగొట్టే ధోరణితో వ్యతిరేకతను పెంచుకోవద్దని సూచించారు. చర్చలకు వెళ్లాల్సిందిగా ఉద్యోగులు సంఘాల నాయకులకు సూచించాలని కోరారు. కొన్ని పత్రికలు వక్ర భాష్యాలు చెబుతూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. 

చర్చలకొచ్చి.. ఒత్తిడి తగ్గించుకోండి
‘ఉద్యోగ సంఘాల నాయకులు తమపై ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉందని చెబుతున్నారు. అసలు ఒత్తిడికి గల సమస్యను పరిష్కరించుకోవాలి. సమ్మె తేదీ దగ్గరపడినా.. ఒకవేళ సమ్మెకు వెళ్లాల్సి వచ్చినా అప్పుడైనా చర్చలకు కూర్చోవాలి కదా? సీఎం సమక్షంలో ఫిట్‌మెంట్‌ ప్రకటనలో పాల్గొని సమ్మతి తెలిపారు. ఇప్పుడు మళ్లీ పాత పీఆర్సీ కోరడం అంటే పరిపక్వత లేకపోవడమో లేక ఇంకేమంటారో అర్థం కావట్లేదు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సమ్మె చట్ట విరుద్ధం. కానీ మేము వాటి జోలికి వెళ్లట్లేదు.

ఆర్థిక అంశాల వ్యవహారాలను నిరాకరించడం క్రమ శిక్షణ ఉల్లంఘన, ప్రభుత్వ వ్యతిరేక చర్యల కిందకే వస్తుంది. ఇలాంటివి జరగకుండా చర్చలకు వచ్చి సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలి. మేం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం’ అని సజ్జల పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం బాధ్యతాయుత నాయకులుగా చర్చలకు రావాలే కానీ తాము చెప్పిందే జరగాలని అనుకోవడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement