Andhra Pradesh government said good news to the employees - Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు శుభవార్త

Published Wed, Mar 8 2023 2:19 AM | Last Updated on Wed, Mar 8 2023 8:31 AM

Sajjala Ramakrishna Reddy Adimulapu Suresh On Govt Employees - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆదిమూలపు సురేశ్, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు తదితరులు

సాక్షి, అమరావతి: ఉద్యోగులు ప్రభుత్వంలో భాగ­మని, వారికి సంబంధించిన అన్ని అంశాలను పరి­ష్క­రిస్తామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. సీఎం ఆదేశాల ప్రకారం ఈ నెలాఖ­రు­కల్లా ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర­నాథ్, ఆదిమూలపు సురేష్, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌­ఆర్‌) చిరంజీవి చౌదురి సుదీర్ఘంగా చర్చించారు.

అనం­తరం సజ్జల, ఆదిమూలపు ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. సజ్జల మాట్లాడుతూ.. ఉద్యో­గుల సంక్షేమంపై ఎప్పుటికప్పుడు చర్చిస్తు­న్నా­మని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని, అందరూ కలిసికట్టుగా పనిచేయడంవల్లే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతోందన్నారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు కొలిక్కివస్తున్నాయని చెప్పారు.

కోవిడ్‌వల్ల ఉద్యోగులకు చేయాల్సిన వాటిని కొన్నింటినీ సమయానికి చేయలేకపోయామని తెలిపారు. చర్చల ద్వారానే ఆయా సమస్యలను పరిష్కరించుకోవచ్చని వారు చెప్పారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించేందుకే సీఎం జగన్‌ మంత్రివర్గ ఉపసంఘాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు ఏ విషయాన్నయినా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకే ఈ వేదికను ఏర్పాటుచేశారని చెప్పారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ ఉద్యోగులకు అనుకూలంగానే ఉంటుందన్నారు. 

బిల్లులు పెండింగ్‌లో లేకుండా చేస్తాం
మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. ఉద్యోగులకు సంబంధించిన అన్ని పెండింగ్‌ బిల్లులను మార్చి 31లోపు క్లియర్‌ చేస్తామన్నారు. ఇప్పటివరకు ఉన్న జీపీఎఫ్‌ పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేస్తామన్నారు. రిటైర్మెంట్‌కి సంబంధించి గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ను పూర్తిగా చెల్లిస్తామన్నారు. మెడికల్‌ బిల్లుల్ని కూడా ఎటువంటి షరతులు లేకుండా చెల్లిస్తామని చెప్పారు.

టీఏ, ఏపీజీఎల్‌ఐ కూడా ఇస్తామన్నారు. ఆర్థికపరమైన అన్ని అంశాలపై చర్చించామని, దీర్ఘకాలికంగా ఉండి గత ప్రభుత్వంలో కూడా పరిష్కారం కాని అంశాలపైనా స్పష్టత ఇచ్చామని, పరిష్కార మార్గం కనుగొన్నామన్నారు. ఉద్యోగ సంఘ నాయకులతో మంత్రివర్గం ఉపసంఘం తరచూ సమావేశమవుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏ బిల్లులు పెండింగ్‌లో లేకుండా చూస్తామని మంత్రి చెప్పారు. 

మార్చి 31లోగా పెండింగ్‌ బిల్లుల చెల్లింపు
ఉద్యోగులకు ఈ నెల 31లోగా రూ.3 వేల కోట్లకు పైగా పెండింగ్‌ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మహిళా అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 5 స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్స్‌ ఇవ్వడానికి సుముఖత వ్యక్తంచేశారు. 2004కు ముందు ఎగ్జామ్స్‌ పాస్‌ అయిన వాళ్లకు సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌కు మారడానికి అనుమతించడానికి సానుకూలంగా స్పందించారు. వీఆర్‌ఏలకు డీఏ పునరుద్ధరణ, యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 62 ఏళ్ల వయోపరిమితి ఉత్తర్వులు ఇవ్వడానికీ ఒప్పుకున్నారు.

గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించడంతో పాటు, రెండో దశలో నియామకమైన వారికి త్వరగా ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు అంగీకరించారు. మేం పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాం. వీఆర్‌వోలకు ప్రమోషన్‌ కోటా 75 శాతం చేయడం, జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు 010 కింద వేతనాల చెల్లింపుకు డిమాండ్‌ చేశాం. గ్రేడ్‌–2 వీఆర్‌వోలకు ప్రొబేషన్‌ డిక్లరేషన్, సమగ్ర శిక్ష ఉద్యోగాలకు వేతనాల పెంపు, గత ప్రభుత్వం కక్ష సాధింపుగా ఉద్యోగుల మీద పెట్టిన ఏసీబీ కేసుల్లో బాధితులకు త్వరగా న్యాయం చేయాలని కోరాం.
– ఎ. వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వోద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు

పెండింగ్‌ బిల్లుల చెల్లిస్తామన్నారు
ఉద్యోగుల బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించింది. డీఏ బకాయిలను రెండు క్వార్టర్లలో క్లియర్‌ చేస్తామని హామీ ఇచ్చారు. రూ.3 వేల కోట్లు క్లియర్‌ చేస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్యలు తీసకుంటామని చెప్పారు. రూ.16వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేసే వారికి బయోమెట్రిక్‌ తొలగించాలని కోరాం. ఈ నెల 16న ఉద్యోగుల హెల్త్‌కార్డులకు సంబంధించి సీఎస్‌  దగ్గర సమావేశం ఉంది. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని కోరాం.
– బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు 

పెండింగ్‌ డీఏలపై చర్చిస్తామన్నారు 
పెండింగ్‌ డీఏల విషయంలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. సీపీఎస్‌ రద్దుపైనా చాలాసేపు చర్చించాం. త్వరలో మా సంఘం కార్యవర్గ సమావేశం ఏర్పాటుచేసుకుని ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం.
– బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి, చైర్మన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement