సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. వేర్వేరుగా ఉద్యమాలు నడిపిన సంఘాలు ప్రస్తుతం ఒకే గొడుగు కిందకు చేరాయి. ఇప్పటివరకు విడివిడిగా సాగిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం(ట్రెసా), తెలంగాణ తహసీల్దార్ల సంఘం(టీజీటీఏ) ఏకమయ్యాయి. రెవెన్యూ శాఖ ప్రక్షాళన, ఇతర శాఖల్లో ఉద్యోగుల విలీనం, వీఆర్‌ఓ వ్యవస్థ రద్దు, తహసీల్దార్ల బదిలీలపై పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి ఉద్యోగ సంఘాల్లో అనైక్యత కారణమని అభిప్రాయం వ్యక్తమైంది.
ఉద్యోగుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్న నేపథ్యంలో వేర్వేరుగా ఉద్యమాలు సాగించడం సరికాదని ఉద్యోగవర్గాల నుంచి వ్యక్తమైన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ఇరు సంఘాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశాల్లో విలీనానికి ఆమోదముద్ర వేస్తూ తీర్మానాలు చేశాయి. దీంతో టీజీటీఏను రద్దు చేసి.. దాని స్థానే ట్రెసా కొనసాగింపునకు పచ్చజెండా ఊపాయి. రెండు సంఘాల విలీనంపై గత రెండు నెలలుగా ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్ చర్చోపచర్చలు సాగించారు. ఉద్యోగుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఐకమత్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ ఇరువురి చర్చలు ఫలప్రదం కావడంతో వైరి సంఘాలు కాస్తా ఒకే సంఘంగా అవతరించాయి.
ప్రధాన కార్యదర్శిగా గౌతమ్‌కుమార్
తహసీల్దార్ల సంఘం (టీజీటీఏ) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న గౌతమ్‌కుమార్‌ను ట్రెసా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి ప్రకటించారు. మిగతా కార్యవర్గాన్ని త్వరలో ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రతే ప్రధాన లక్ష్యంగా సంఘం పనిచేయనుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ట్రెసా మాజీ ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంజుల, వెంకటేశ్వర్‌రావు, ప్రభాకర్‌రావు, ఎల్లారెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ల సంఘం కొనసాగుతుంది
తహసీల్దార్ల సంఘం ట్రెసాలో విలీనం కాలేదని, స్వతంత్రంగా కొనసాగుతుందని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటభాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్ యాదగిరి, కోశాధికారి రాములు తెలిపారు. టీజీటీఏ విలీనం చేస్తున్నట్లు చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రత్యేకంగా తహసీల్దార్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు ఈ సంఘం ఏర్పడిందని, కేవలం అధ్యక్షుడు గౌతమ్‌కుమార్, మరికొందరు మాత్రమే ట్రెసాలో చేరారని, త్వరలోనే కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని ఆ ప్రకటనలో వారు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment