Revenue Association
-
సీసీఎల్ఏ భూమి సైట్లు బంద్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ముగిసి పదిరోజులు దాటినా రాష్ట్రంలో భూపరిపాలన గాడిలో పడడం లేదు. కోడ్ కారణంగా గతంలో నిలిపివేసిన నాలుగైదు వెబ్సైట్లను పునఃప్రారంభించకపోవడమే ఇందుకు కారణమని రెవెన్యూ వర్గాలంటున్నాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) పరిధిలోకి వచ్చే ల్యాండ్ రెగ్యులరైజేషన్ మేనేజ్మెంట్ సిస్టం (ఎల్‌ఆర్‌ఎంఎస్), యూఎల్సీ రెగ్యులరైజేషన్, ఈల్యాండ్స్ టీఎస్, జీవో 58, 59ల ద్వారా ప్రభుత్వ భూముల్లోని కట్టడాల క్రమబద్ధీకరణకు సంబంధించిన వెబ్సైట్లతో సహా ఇతర భూపరిపాలన వెబ్సైట్లు పనిచేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది. వాస్తవానికి, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత భూముల క్రమబద్ధీ కరణ నిలిచిపోయింది. ప్రభుత్వ భూముల్లో కబ్జా ఉండి నిర్మాణాలు చేసుకున్న వారికి ఆ భూములను క్రమబద్దీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు లక్షలాది మంది జీవో 58, 59 ద్వారా భూముల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోగా, అందులో 30–40 శాతం మాత్రమే దరఖాస్తులను పరిష్కరించారు. ఈ దరఖాస్తులను పరిష్కరించే అధికారం కలెక్టర్ల లాగిన్లకు మాత్రమే ఉండడంతో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే చాలా చోట్ల ఈ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుదారులు ఎన్ని కలు ముగిసిన తర్వాత క్రమబద్దీకరణ జరుగుతుందని భావించారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం రానుండడంతో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రారంభమవుతుందని రెవెన్యూ యంత్రాంగం భావించింది. కానీ, ఎన్నికలకు ముందు మూసేసిన వెబ్సైట్లను ఇప్పటివరకు ప్రారంభించకపోవడంతో రాష్ట్రంలో భూముల క్రమబద్దీకరణ పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలనా పగ్గాలు మారిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వ నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నామని, ప్రభుత్వ విధానం ఎలా ఉంటుందోనన్న ఆలోచనతోనే తాత్కాలికంగా నిలిపివేశామని చెపుతున్నారు. -
రెవెన్యూ సంఘాల విలీనం!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. వేర్వేరుగా ఉద్యమాలు నడిపిన సంఘాలు ప్రస్తుతం ఒకే గొడుగు కిందకు చేరాయి. ఇప్పటివరకు విడివిడిగా సాగిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం(ట్రెసా), తెలంగాణ తహసీల్దార్ల సంఘం(టీజీటీఏ) ఏకమయ్యాయి. రెవెన్యూ శాఖ ప్రక్షాళన, ఇతర శాఖల్లో ఉద్యోగుల విలీనం, వీఆర్ఓ వ్యవస్థ రద్దు, తహసీల్దార్ల బదిలీలపై పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి ఉద్యోగ సంఘాల్లో అనైక్యత కారణమని అభిప్రాయం వ్యక్తమైంది. ఉద్యోగుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్న నేపథ్యంలో వేర్వేరుగా ఉద్యమాలు సాగించడం సరికాదని ఉద్యోగవర్గాల నుంచి వ్యక్తమైన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ఇరు సంఘాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశాల్లో విలీనానికి ఆమోదముద్ర వేస్తూ తీర్మానాలు చేశాయి. దీంతో టీజీటీఏను రద్దు చేసి.. దాని స్థానే ట్రెసా కొనసాగింపునకు పచ్చజెండా ఊపాయి. రెండు సంఘాల విలీనంపై గత రెండు నెలలుగా ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్ చర్చోపచర్చలు సాగించారు. ఉద్యోగుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఐకమత్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ ఇరువురి చర్చలు ఫలప్రదం కావడంతో వైరి సంఘాలు కాస్తా ఒకే సంఘంగా అవతరించాయి. ప్రధాన కార్యదర్శిగా గౌతమ్‌కుమార్ తహసీల్దార్ల సంఘం (టీజీటీఏ) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న గౌతమ్‌కుమార్‌ను ట్రెసా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి ప్రకటించారు. మిగతా కార్యవర్గాన్ని త్వరలో ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రతే ప్రధాన లక్ష్యంగా సంఘం పనిచేయనుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ట్రెసా మాజీ ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంజుల, వెంకటేశ్వర్రావు, ప్రభాకర్‌రావు, ఎల్లారెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ల సంఘం కొనసాగుతుంది తహసీల్దార్ల సంఘం ట్రెసాలో విలీనం కాలేదని, స్వతంత్రంగా కొనసాగుతుందని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటభాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్ యాదగిరి, కోశాధికారి రాములు తెలిపారు. టీజీటీఏ విలీనం చేస్తున్నట్లు చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రత్యేకంగా తహసీల్దార్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు ఈ సంఘం ఏర్పడిందని, కేవలం అధ్యక్షుడు గౌతమ్‌కుమార్, మరికొందరు మాత్రమే ట్రెసాలో చేరారని, త్వరలోనే కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని ఆ ప్రకటనలో వారు వెల్లడించారు. -
రెవెన్యూలో రచ్చ
ఏలూరు (మెట్రో) : జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌లో విభేదాలు రచ్చకెక్కాయి. అసోసియేషన్ నాయకులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి చేరాయి. ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ రెండు వర్గాలుగా చీలిపోగా.. ఒక వర్గం రెవెన్యూలో రచ్చ అశోక్‌బాబు తరఫున, మరోవర్గం బొప్పరాజు తరఫున పనిచేస్తున్నాయి. జిల్లాలో మాత్రం ఒకే రెవెన్యూ అసోసియేషన్ నడుస్తుండగా.. ఇందులో విభేదాలు తారస్థాయికి చేరాయి. జిల్లా రెవెన్యూ శాఖలో 2,500 మంది వీఆర్ఓలు, 909 మంది వీఆర్ఏలు, 900 మంది జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలు, సూపరిం టెండెంట్లు, ఏఓలు కలిపి మొత్తంగా 4,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరి సమస్యల పరిష్కారానికి కృషి చేసే జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌లో 12 మంది జిల్లాస్థాయి నాయకులు, ఏడుగురు కార్యవర్గ సభ్యులు, ఒక రాష్ట్ర కార్యదర్శి, 10 మంది డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు ఉన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాపత్రయం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే అసోసియేషన్ నాయకులు వెంపర్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అసోసియేషన్ తరఫున ఏదైనా ఆందోళన చేయాల్సి వస్తే ముందుగా సమావేశం నిర్వహించి.. అజెండాలో ఆ అంశాన్ని పొందుపర్చాలి. సభ్యులందరి నిర్ణయం మేరకు తీర్మానం ఆమోదించాలి. అనంతరం కలెక్టర్‌కు నివేదించాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే నల్లబ్యాడీ్జలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలపడం వంటి దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే, ఫిబ్రవరి 13న అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లాం విద్యాసాగర్ ఇవేమీ చేయకుండానే నేరుగా వర్కు టు రూల్ ఉద్యమానికి తెరతీశారు. ఇది ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చేశారంటూ యూనియన్ సభ్యులు విమర్శలు సంధించారు. దీంతో ఆ ఉద్యమం విఫలమైంది. కేసుల పరంపర సంఘ అధ్యక్షుడు విద్యాసాగర్ అసోసియేషన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ మార్చి నెలలో రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులు విచారణ జరిపారు. సంఘ సభ్యులే తనపై ఫిర్యాదులు చేశారని విద్యాసాగర్ ఆరోపించారు. అనంతరం అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.రమేష్ కుమార్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు విద్యాసాగర్ ప్రకటించారు. తనను తొలగించే అధికారం ఎవరికీ లేదంటూ రమేష్ మంగళవారం కార్యవర్గ సమావేశం నిర్వహించగా.. రమేష్ తనపై దాడి చేసేందుకు సభ్యులను కూడగడుతున్నారని విద్యాసాగర్ ఏలూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం విద్యాసాగర్ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో రెండువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందనే ఉద్దేశంతో పోలీసులు జిల్లా రెవెన్యూ భవనం వద్ద పికెట్ ఏర్పాటు చేశారు. రూ.20 లక్షలు కాజేసేందుకు కుట్ర ! రెవెన్యూ అసోసియేషన్‌లో రూ.20 లక్షల సొమ్ము ఉన్నట్టు చెబుతున్నారు. ఆ మొత్తాన్ని కారు కొనేందుకు, స్వలాభాలకు ఉపయోగించుకునేందుకు అసోసియేషన్ నాయకులు కుట్ర పన్నుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అసోసియేషన్ ప్రతిని ధులు బుధవారం వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటూ పత్రికలకు ప్రకటనలు విడుదల చేశారు. ఇది ఎటు దారితీస్తుందోననే ఆందోళన, ఉత్కంఠ రెవెన్యూ ఉద్యోగుల్లో నెలకొంది. -
జేసీ వివేక్ సేవలు ప్రశంసనీయం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ జిల్లాలో చేసిన సేవలు ప్రశంసనీయమని మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. జేసీ వివేక్ యాదవ్ విజయనగరం జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళుతున్న సందర్భంగా గురువారం రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జేసీ తక్కువ కాలంలో జిల్లాలో పలు విభాగాల్లో సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. పౌర సరఫరాల శాఖ, మీసేవ, ఈ పాస్, వంశధార, కొవ్వాడ, తోటపల్లి ప్రోజెక్టులు భూసేకరణ తదితర అంశాల్లో ఆయన మంచి సేవలు అందించారని తెలిపారు. ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతి, కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, జేసీ–2 పి.రజనీకాంతారావు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, డీఆర్ఓ బి. కృష్ణభారతి, ఐటీడీఏ పీఓ జె.వెంకటరావు, డీఆర్డీఏ పీడీ ఎస్.తనూజారాణి, జెడ్పీ సీఈఓ నగేష్, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆ ఎమ్మెల్యేను అరెస్టు చేయండి
కృష్ణా జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షిపై ప్రభుత్వ విప్, పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి పట్ల జిల్లాలో నిరసన వెల్లువెత్తుతోంది. ఆ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉద్ధతం చేస్తామంటూ గురువారం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు విధులు బహిష్కరించి కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కర్నూలు(న్యూసిటీ): కృష్ణాజిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహశీల్దారు డి.వనజాక్షిపై ప్రభుత్వ విప్, పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి పట్ల జిల్లాలో నిరసన వెల్లువెత్తుతోంది. ఆ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందులో భాగంగా గురువారం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు విధులు బహిష్కరించి కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే ప్రభాకర్ డౌన్...డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ప్రక్కనే ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎన్జీఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సీహెచ్ వెంగళరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు రౌడీలుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇసుక అక్రమ వ్యాపారానికి సహకరించని అధికారులపై దాడులు చేయడం దారుణమన్నారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ హుసేన్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కూడా కొందరు రాజకీయ నాయకులు ఉద్యోగులను బెదిరిస్తున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. రెవెన్యూ అసోసియేషన్ కర్నూలు డివిజన్ అధ్యక్షుడు రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రభాకర్‌ను అరెస్టు చేసే వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులకు రక్షణ కరువైందని ఆదోని ఆర్డీఓ ఓబులేసు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉంటే రాస్తారోకో చేయరాదని ఎన్జీఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వెంగళరెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పీఎండీ హుసేన్తో పోలీసులు వాగ్వాదానికి దిగారు. అయినా, అరగంటపాటు కొనసాగించిన రాస్తారోకోతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ నిరసన కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గిరికుమార్‌రెడ్డి, కర్నూలు డివిజన్ కార్యదర్శి నిత్యానందరాజు, ఎన్జీఓస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు, ఆదోని డివిజన్ అధ్యక్షుడు రజనీకాంతరెడ్డి, నాయకులు రామన్న, ప్రసాద్, నంద్యాల ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, జేఏసీ సభ్యులు బాలవెంకటేశ్వర్లు, వివిధ మండలాల తహశీల్దార్లు శివరాముడు, భూలక్ష్మి, అనురాధ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు సోమసుందరం, ఉద్యోగులు, వీఆర్ఓలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణ ఖర్చులో అవకతవకలు
సాక్షి, మచిలీపట్నం : గెలుపు కోసం రాజకీయ పార్టీల అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తే.. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చేసిన ఖర్చు కూడా కోట్లు దాటింది. ఎన్నికల నిధుల వినియోగంలో లోపాలు జరిగాయన్న ఆరోపణలు మాత్రం జిల్లా యంత్రాంగం పరువు తీస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం చేసిన ఖర్చు రూ.18.98 కోట్లు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాకు రెండు విడతలుగా విడుదలైన ఈ నిధులను సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారు(ఏఈఆర్వో)లకు నాలుగు దశల్లో కేటాయింపులు జరిపారు. గతంలో ఏ ఎన్నికల్లోనూ లేనివిధంగా ఈసారి ఎన్నికల నిర్వహణ కోసం పెద్ద ఎత్తున నిధుల కేటాయింపులు జరగడం విశేషం. నియోజకవర్గానికి రూ.కోటికి పైగా... జిల్లాలో రెండు లోక్‌సభ, 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ఏర్పాట్లు చేసేందుకు ఇబ్బడి ముబ్బడిగానే నిధులు కేటాయింపులు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ఆదేశాలతో ఎన్నికల బడ్జెట్‌ను కేటాయించారు. వాటిని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ ఏఈఆర్వోలకూ దశల వారీగా కేటాయింపులు జరిపారు. దీనిలో భాగంగా ఈ ఏడాది మార్చి 13న రూ.6,33,44,000, ఏప్రిల్ 18న రూ.12,64,73,600 నిధులు జిల్లాకు విడుదలయ్యాయి. వీటిని మార్చి 18, ఏప్రిల్ 22 తేదీల్లో జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఏఈఆర్వోలకు కేటాయింపులు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ కోసం టీఏ బిల్లులు, కారు అద్దెలు, ఆయిల్, ప్రకటనలు, టెలిఫోన్, పోస్టేజీ, ఆఫీసు ఖర్చులు వంటి బిల్లులను పెట్టారు. ఇలా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.కోటికి పైగా నిధుల కేటాయింపులు జరగడం గమనార్హం. ఎన్నికల ఖర్చుపై ఎన్నో అనుమానాలు.. జిల్లాలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల నిర్వహణ వ్యయంపై అనుమానాలు వెంటాడుతున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన మొత్తం నిధుల్లో 60 నుంచి 70 శాతం వరకు ఖర్చుచేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం నిధులను రికార్డుల్లో ఖర్చులు చూపించి మిగుల్చుకున్న నిధులను కొన్ని తహశీల్దార్ కార్యాలయాల పరిధిలోని సిబ్బంది పంచుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికల నిర్వహణలో భాగంగా అవసరమైన సామగ్రి విజయవాడలోని ఒక స్టోర్స్‌లో కొనుగోలు చేశారు. మిగిలిన మొత్తాలను పలు నియోజకవర్గాల్లో తలా కొంచెం పంచుకున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వాస్తవంగా చేసిన ఖర్చులు తక్కువే అయినా లెక్కల్లో మాత్రం వాటిని సరిచేసుకుని సంబంధిత అధికారులతో ఆమోద ముద్ర వేయించుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం సంబంధింత అధికారులకు స్థాయిని బట్టి ముడుపులు ముట్టజెబుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత అకౌంటెంట్ ఆడిటర్ జనరల్ (ఏజీ) కార్యాలయం నుంచి వచ్చే ప్రత్యేక సిబ్బంది ఆడిట్ నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. పెడనలో రోడ్డున పడ్డ నిధుల గొడవలు.. పెడన నియోజకవర్గంలో పలు మండలాల్లో ఎన్నికల నిధుల కైంకర్యంపై వివాదాలు తలెత్తడంతో సిబ్బంది నడుమ గొడవలతో రోడ్డున పడ్డారు. మిగులు నిధులు తమకు వాటా వేయడంలో జరిగిన అన్యాయాన్ని రెవెన్యూ అసోసియేషన్ సమావేశంలో లేవనెత్తుతామని, నిధులు కాజేసిన వారి బండారం బయటపెడతామని దిగువస్థాయి సిబ్బంది ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. పెడన నియోజకవర్గానికి కేటాయించిన నిధుల్లో ఖర్చుచేయగా మిగిలిన మొత్తాన్ని కొందరు పంచుకున్నట్టు వివాదాలు రేగాయి. ఈ నియోజకవర్గంలో ఒక మండలంలో మిగిలిన మొత్తం నిధులను ఒక అధికారికి 80 శాతం, ఆయన దిగువస్థాయి అధికారికి 20 శాతం చొప్పున వాటాలు పంచుకోవడంతో వీఆర్వోలు వివాదానికి దిగినట్టు సమాచారం. ఎందుకొచ్చిన గొడవలు అనుకుని మరో రెండు మండలాల్లో మిగిలిన మొత్తాన్ని ఒక్కొక్కరు రూ.5 వేలు చొప్పున పంచుకుని సొమ్ము స్వాహా చేయడంలో సమన్యాయం పాటించారు. పెడనలో ఎన్నికల ఖర్చుతో కొన్న ఏసీని సగం ధరకే ఒక ఉద్యోగికి అమ్మేసినట్టు తెలిసింది. దీనిపై తహశీల్దార్ డీవీఎస్ ఎల్లారావును ‘సాక్షి’ వివరణ కోరగా ఆ ఏసీ ఎన్నికల నిధులతో కొనలేదని చెప్పారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి తెచ్చి ఇచ్చేశామని తెలిపారు. ఎన్నికల డీటీ మల్లిఖార్జునరావు మాత్రం ఆ ఏసీ ఎన్నికల నిధులతోనే కొన్నట్టు ‘సాక్షి’కి చెప్పారు. వీటన్నింటిపై జిల్లా కలెక్టర్ స్పందించి ఆరా తీస్తే జరిగిన అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది. -
తహశీల్దార్ బదిలీల్లో గందరగోళం
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో తహశీల్దార్ల బదిలీలపై ఇచ్చిన నివేదికలో స్పష్టత లేకపోవడంతో ఇప్పుడు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో మూడేళ్లకు పైబడి విధులు నిర్వహిస్తున్న వారిని, సొంత జిల్లాలకు చెందిన వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడానికి వీలుగా వారి జాబితా అందజేయాలని సీసీఎల్ఏ ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల లోపు ఉద్యోగ విరమణ చేయనున్న వారికి మినహాయింపు కల్పించింది. అయితే వారు సైతం తహశీల్దార్ పోస్టింగ్‌ల్లో ఉండకూడదని పేర్కొంది. వీరితో పాటూ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కోరితే వారిని జిల్లాలో కొనసాగించడానికి వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు తొలిజాబితాలో 29 మంది పేర్లతో జాబితాను సిద్ధం చేశారు. తరువాత 26 మందితో కూడిన జాబితాను మాత్రమే సీసీఎల్ఎకు నివేదించారు. ఉద్యోగ విరమణ చేయనున్న వారి పేర్లు, తహశీల్దార్ కేడర్‌లో ఉంటూ వేరే విధులు (సెక్షన్ సూపరింటెండెంట్, కలెక్టరేట్, పార్వతీపుం, విజయనగరం ఆర్డీఓ కార్యాలయాల ఏఓలు) నిర్వహిస్తున్న వారిని ఈ సీసీఎల్ఏకు పంపిన ఇంత వరకూ బాగున్నా... ఇద్దరికి పోస్టింగ్‌లు కల్పించటానికి అవకాశం లేకపోవటంతో వీరు మల్లగుల్లాలు పడుతున్నారు. సీసీఎల్ఏ కల్పించిన మినహాయింపు నిబంధనల ప్రకారం జిల్లాలో బి-సెక్షన్ సూపరింటెండెంట్, మక్కువ, దత్తిరాజేరు, గుర్ల, జామి, మెంటాడ తహశీల్దార్లతో పాటూ సొంత జిల్లా కాని విజయనగరం ఆర్డీఓ కార్యాలయంలోని కేఆర్సీ తహశీల్దార్, పూసపాటిరేగ, కొమరాడ, బాడంగి తహశీల్దార్లు జిల్లాలోనే ఉండిపోవచ్చు. వీరితో పాటూ కలెక్టరేట్, పార్వతీపురం, విజయనగరం ఆర్డీఓ కార్యాలయాల ఏఓలు, కలెక్టరేట్లోని డి,ఈ సెక్షన్ల సూపరింటిండెంట్లతో పాటూ ఏఓ ఎల్‌ఆర్‌లకు ప్రస్తుత జాబితా ప్రకారం మినహాయింపు లభించింది. ఆ ఇద్దరికీ పోస్టింగ్ ఎక్కడ? త్వరలో ఉద్యోగవిరమణ చేయనున్న బి-సెక్షన్ సూపరింటెండెంట్ రఘురామయ్య అదే పోస్టులో కొనసాగుతారు. జామి, మక్కువ, మెంటాడ, దత్తిరాజేరు, గుర్లలో పనిచేస్తున్న తహశీల్దార్లకు పోస్టులు కేటాయించాలి. అయితే ప్రస్తుతం విజయనగరం, పార్వతీపురం కేఆర్సీ తహశీల్దార్లు, కలెక్టరేట్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్ పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో మూడు పోస్టులు మాత్రమే భర్తీ అవుతాయి. దీంతో మరో ఇద్దరు తహశీల్దార్లకు ఎక్కడపోస్టింగ్ కల్పించాలో అధికారులకు అర్థం కావడం లేదు. ఎవరిని బయటకు పంపుతారో, ఎవరిని ఏ పోస్టింగ్‌లో కూర్చొండబెడతారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొన్ని విషయాల్లో ఒకరిద్దరికే ప్రాధాన్యం కల్పించడం వల్ల ఇటువంటి పరిస్థితి తలెత్తిందని రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లా నుంచి 26 మంది బదిలీ..తక్షణమే రిలీవ్ చేయాలని ఆదేశాలు జిల్లా నుంచి 26 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ ఆదేశాలు వచ్చాయి. బదిలీ అయిన వారికి జిల్లాలు కేటాయిస్తూ సీసీఎల్ఏ నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ జాబితాలో ఎటువంటి మార్పులూ చేర్పులు ఉండవని, బదిలీ అయిన వారిని తక్షణం రిలీవ్ చేయడంతో పాటూ కేటాయించిన వారికి పోస్టింగ్‌లు కల్పించాలని కలెక్టర్లకు ఉత్తర్వులు అందాయి. దీంతో మరో మూడు రోజుల్లో కొత్త ముఖాలు కన్పించనున్నాయి. జిల్లాకు విశాఖపట్నం నుంచి 25, శ్రీకాకుళం నుంచి ఒక్కరిని కేటాయించారు. శ్రీకాకుళం నుంచి జె.రామారావు ఇక్కడకు రానున్నారు. విశాఖ జిల్లా నుంచి బదిలీ అయిన వారిలో జ్ఞానవేణి, పి.నరసింహమూర్తి, ఎంఎ మనోరంజిని, ఎం.సుమబాల, వై.నాగేశ్వరరావు, పి.శేషశైలజ, పి.అప్పలనాయుడు, ఎస్.సిద్ధయ్య, కె.వి.ఎస్.రవి, వై.ఎస్.వి ప్రసాద్, ఎస్.భాస్కరరెడ్డి, కె.వి.వి. శివ, ఎస్.ఎస్.ఎన్.సత్యనారాయణ, ఎం.ఎస్.కళావతి, పి.సుందరరావు, వి.వి. రమణ, టి.సిహెచ్.పాడి, ఎస్.బాబూసుందరం, ఎస్.భాస్కరరావు, పి.భాగ్యవతి, పుట్టపల్లి అంబేద్కర్, బి.వి.రమణి, వై.వి. రాజేందర్, పి.పంతులు, ఎస్.వి. అంబేద్కర్ ఉన్నారు. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్తున్న వారు... జిల్లా నుంచి 21 మంది విశాఖపట్నానికి, ఐదుగురు శ్రీకాకుళం జిల్లాకు వెళ్తున్నారు. శ్రీకాకుళం వెళుతున్న వారిలో బొండపల్లి తహశీల్దార్ వైఆర్వాణి, జియ్యమ్మవలస తహశీల్దార్ ఆర్ఆర్ఎల్ ప్రసాద్‌పాత్రో, ఎల్.కోట తహశీల్దార్ జె.రాములమ్మ, గరివిడి తహశీల్దార్ మసిలామణి, పార్వతీపురం తహశీల్దార్ ఎం.శ్రీనివాసరావు ఉన్నారు. విశాఖ వెళ్తున్న వారిలో బలిజిపేట తహశీల్దార్ పేడాడ.జనార్దనరావు, కొత్తవలస తహశీల్దార్ డి.లక్ష్మారెడ్డి, విజయనగరం తహశీల్దార్ డి.పెంటయ్య, సీతానగరం తహశీల్దార్ తాడ్డి.గోవిందలతో పాటూ జె.రామారావు, ఎం.అరుణకుమారి, పి.నీలకంఠరావు,డి.బాపిరాజు,కె.సూర్యనారాయణ, ఎం.రఘురాం, డి.ఎస్.శాస్త్రి, కె.డి.వి. ప్రసాదరావు, అజురఫీజాన్, ఎం.ప్రకాష్, యు.రాజకుమారి, టి.రామకృష్ణారావు,జి.జయదేవి,బిరత్నకుమార్, కె.శ్రీనివాసరావు, ఆర్.ఆర్. కృష్ణారావు, ఎం.అప్పారావులు ఉన్నారు. -
ఉక్కు సంకల్పం
ఊరూవాడా ఏకమై జిల్లాలో సమైక్యపోరు ఉధృతంగా జరుపుతున్నారు. సమైక్యాంధ్రను కాపాడుకునేందుకు ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ గొంతెత్తి నినదిస్తున్నారు. సోమవారం సింహగర్జన, జనజాగరణ, ఎడ్ల బళ్లు, ట్రాక్టర్ల ప్రదర్శన, మానవహారాలు, విఘ్నేశ్వర పూజలు నిర్వహించి నిరసనలు తెలిపారు. సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఇప్పటికైనా వెనక్కి తీసుకోండి.. సమైక్యవాదుల ఉద్యమ ఉధృతిని చూసైనా ఓట్లు, సీట్ల రాజకీయాలు మానుకోండి.. సీమాంధ్రుల ఆవేదనను అర్థం చేసుకోండి.. అంటూ జిల్లాలో సమైక్యవాదులు తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. రాష్ట్ర విభజన వల్ల ఎదురయ్యే కష్టనష్టాలను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సోమవారం జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ హోరు కొనసాగింది. న్యాయశాఖ జేఏసీ నాయకులు, ఉద్యోగులు మచిలీపట్నంలో జిల్లా కోర్టు ప్రధానగేటు ఎదుట వినూత్న నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు రోడ్డుపైనే అల్పాహారం తిని గుంజీలు తీశారు. మచిలీపట్నం కోనేరుసెంటర్‌లో కొనసాగుతున్న రిలేనిరాహారదీక్షలో గ్రంథాలయ ఉద్యోగులు, బందరు, గూడూరు మండలాల్లోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సర్వే ఉద్యోగులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. 150 మంది సిబ్బందితో మచిలీపట్నంలోని 50 వేల కుటుంబాల వద్దకు వెళ్లి సమైక్యాంధ్రకు మద్దతుగా వారి అభిప్రాయాలను సేకరించటంతో పాటు సంతకాల సేకరణ చేయాలని మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ నిర్ణయించారు. ‘మీ కాళ్లు మొక్కుతాం.. మీ గడ్డాలు పట్టుకుని బతిమాలుతాం.. దయచేసి సమైక్యాంధ్ర ఉద్యమానికి సహకరించండి’ అంటూ జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్‌వీ చంద్రశేఖరరావు జిల్లా అధికారులను కోరారు. గుడివాడలో మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గుడివాడ సింహ గర్జన కార్యక్రమం జరిగింది. ఈ గర్జన సభకు వేలాది మంది మహిళలు, విద్యార్థులు హాజరయ్యారు. పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జనజాగరణ కార్యక్రమం జరిపారు. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము వరకు వివిధ కార్యక్రమాలతో ఈ ఆందోళన కొనసాగనుంది. పామర్రులో జేఏసీ, ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో దీక్షలను నిర్వహించారు. పెదమద్దాలి పంచాయితీ సభ్యులు రిలేదీక్షలలో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర కోరుతూ విఘ్నేశ్వరునికి ప్రత్యేకపూజలు చేశారు. ఈ నెల 20న జరిగే సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కావాలని మహిళా ఉద్యోగులు విజయవాడ దుర్గగుడిలో అమ్మవారికి మెట్ల పూజలు నిర్వహించారు. తేలప్రోలు రాజా హైస్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ప్రదర్శన, స్థానిక నెహ్రూబొమ్మ సెంటర్లో మానవహారాన్ని నిర్వహించారు. జగ్గయ్యపేటలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల బస్సులతో ర్యాలీ జరిపారు. రిలే దీక్షలో స్కూల్ బస్సుల డ్రైవర్లు, క్లీనర్లు కూర్చున్నారు. పెనుగంచిప్రోలులో దీక్షల్లో తిరుపతమ్మ ఆలయ నాయీబ్రాహ్మణ ఉద్యోగులు పాల్గొన్నారు. కైకలూరు దీక్షలు 41వ రోజుకు.. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు సోమవారానికి 41వ రోజుకు చేరాయి. తాలూకా సెంటర్ వద్ద ఎన్జీవోల దీక్షలు 34వ రోజూ కొనసాగాయి. వత్సవాయి, కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి, మైలవరం, హనుమాన్‌జంక్షన్, జి.కొండూరు, పెడనలలో వివిధ జేఏసీల ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. రెడ్డిగూడెం సెంటర్లో రైతుల ఆధ్వర్యంలో వంటావార్పు చేశారు. కోస్తాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తిరువూరు బోసు సెంటర్లో రిలే దీక్ష చేపట్టారు. కూచిపూడి, పెదపూడి, మొవ్వ గ్రామాల్లో భారీగా ఎడ్లబండ్ల ర్యాలీలు నిర్వహించారు. నూజివీడులో నిర్వహిస్తున్న రిలేదీక్షల శిబిరాన్ని వైఎస్సార్ సీపీ నూజివీడు సమన్వయకర్త మేకా ప్రతాప్, ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య సందర్శించి మద్దతు తెలిపారు. ఉండమ్మా.. బొట్టు పెడతా.. కంచికచర్లలో ఉద్యోగ సంఘాలకు చెందిన మహిళా అధికారులు, కళాశాల విద్యార్థినులు కలిసి ఉండమ్మా బొట్టుపెడతా అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నందిగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు పట్టణంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్ పెద్దలకు బుద్ధి ప్రసాదించమని వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, పట్టణ కన్వీనర్ మరీదు కృష్ణమూర్తి గుడివాడలో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. గన్నవరంలో ఉద్యోగులు జాతీయ రహదారిపై కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు ఇందుపల్లి-ఉంగుటూరు రహదారిపై సహపంక్తి భోజనాలు చేశారు. కైకలూరు పరిధిలోని పోలరాజ్ కాలువలో ఎన్జీవోలు, ఉపాధ్యాయులు జలదీక్ష చేపట్టారు. ఉయ్యూరులో శ్రీవిశ్వశాంతి విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సోనియా మనసు, విభజన ద్రోహుల కుట్రలు భగ్నం కావాలని విశేష పూజలు జరిగాయి.