తహశీల్దార్ బదిలీల్లో గందరగోళం
Published Wed, Feb 12 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో తహశీల్దార్ల బదిలీలపై ఇచ్చిన నివేదికలో స్పష్టత లేకపోవడంతో ఇప్పుడు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో మూడేళ్లకు పైబడి విధులు నిర్వహిస్తున్న వారిని, సొంత జిల్లాలకు చెందిన వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడానికి వీలుగా వారి జాబితా అందజేయాలని సీసీఎల్‌ఏ ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల లోపు ఉద్యోగ విరమణ చేయనున్న వారికి మినహాయింపు కల్పించింది.
అయితే వారు సైతం తహశీల్దార్ పోస్టింగ్‌ల్లో ఉండకూడదని పేర్కొంది. వీరితో పాటూ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కోరితే వారిని జిల్లాలో కొనసాగించడానికి వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు తొలిజాబితాలో 29 మంది పేర్లతో జాబితాను సిద్ధం చేశారు. తరువాత 26 మందితో కూడిన జాబితాను మాత్రమే సీసీఎల్‌ఎకు నివేదించారు. ఉద్యోగ విరమణ చేయనున్న వారి పేర్లు, తహశీల్దార్ కేడర్‌లో ఉంటూ వేరే విధులు (సెక్షన్ సూపరింటెండెంట్, కలెక్టరేట్, పార్వతీపుం, విజయనగరం ఆర్డీఓ కార్యాలయాల ఏఓలు) నిర్వహిస్తున్న వారిని ఈ సీసీఎల్‌ఏకు పంపిన ఇంత వరకూ బాగున్నా... ఇద్దరికి పోస్టింగ్‌లు కల్పించటానికి అవకాశం లేకపోవటంతో వీరు మల్లగుల్లాలు పడుతున్నారు.
సీసీఎల్‌ఏ కల్పించిన మినహాయింపు నిబంధనల ప్రకారం జిల్లాలో బి-సెక్షన్ సూపరింటెండెంట్, మక్కువ, దత్తిరాజేరు, గుర్ల, జామి, మెంటాడ తహశీల్దార్లతో పాటూ సొంత జిల్లా కాని విజయనగరం ఆర్డీఓ కార్యాలయంలోని కేఆర్సీ తహశీల్దార్, పూసపాటిరేగ, కొమరాడ, బాడంగి తహశీల్దార్లు జిల్లాలోనే ఉండిపోవచ్చు. వీరితో పాటూ కలెక్టరేట్, పార్వతీపురం, విజయనగరం ఆర్డీఓ కార్యాలయాల ఏఓలు, కలెక్టరేట్‌లోని డి,ఈ సెక్షన్ల సూపరింటిండెంట్‌లతో పాటూ ఏఓ ఎల్‌ఆర్‌లకు ప్రస్తుత జాబితా ప్రకారం మినహాయింపు లభించింది.
ఆ ఇద్దరికీ పోస్టింగ్ ఎక్కడ?
త్వరలో ఉద్యోగవిరమణ చేయనున్న బి-సెక్షన్ సూపరింటెండెంట్ రఘురామయ్య అదే పోస్టులో కొనసాగుతారు. జామి, మక్కువ, మెంటాడ, దత్తిరాజేరు, గుర్లలో పనిచేస్తున్న తహశీల్దార్లకు పోస్టులు కేటాయించాలి. అయితే ప్రస్తుతం విజయనగరం, పార్వతీపురం కేఆర్‌సీ తహశీల్దార్లు, కలెక్టరేట్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్ పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో మూడు పోస్టులు మాత్రమే భర్తీ అవుతాయి. దీంతో మరో ఇద్దరు తహశీల్దార్లకు ఎక్కడపోస్టింగ్ కల్పించాలో అధికారులకు అర్థం కావడం లేదు.
ఎవరిని బయటకు పంపుతారో, ఎవరిని ఏ పోస్టింగ్‌లో కూర్చొండబెడతారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొన్ని విషయాల్లో ఒకరిద్దరికే ప్రాధాన్యం కల్పించడం వల్ల ఇటువంటి పరిస్థితి తలెత్తిందని రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జిల్లా నుంచి 26 మంది బదిలీ..తక్షణమే రిలీవ్ చేయాలని ఆదేశాలు
జిల్లా నుంచి 26 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ ఆదేశాలు వచ్చాయి. బదిలీ అయిన వారికి జిల్లాలు కేటాయిస్తూ సీసీఎల్‌ఏ నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ జాబితాలో ఎటువంటి మార్పులూ చేర్పులు ఉండవని, బదిలీ అయిన వారిని తక్షణం రిలీవ్ చేయడంతో పాటూ కేటాయించిన వారికి పోస్టింగ్‌లు కల్పించాలని కలెక్టర్లకు ఉత్తర్వులు అందాయి. దీంతో మరో మూడు రోజుల్లో కొత్త ముఖాలు కన్పించనున్నాయి. జిల్లాకు విశాఖపట్నం నుంచి 25, శ్రీకాకుళం నుంచి ఒక్కరిని కేటాయించారు. శ్రీకాకుళం నుంచి జె.రామారావు ఇక్కడకు రానున్నారు. విశాఖ జిల్లా నుంచి బదిలీ అయిన వారిలో జ్ఞానవేణి, పి.నరసింహమూర్తి, ఎంఎ మనోరంజిని, ఎం.సుమబాల, వై.నాగేశ్వరరావు, పి.శేషశైలజ, పి.అప్పలనాయుడు, ఎస్.సిద్ధయ్య, కె.వి.ఎస్.రవి, వై.ఎస్.వి ప్రసాద్, ఎస్.భాస్కరరెడ్డి, కె.వి.వి. శివ, ఎస్.ఎస్.ఎన్.సత్యనారాయణ, ఎం.ఎస్.కళావతి, పి.సుందరరావు, వి.వి. రమణ, టి.సిహెచ్.పాడి, ఎస్.బాబూసుందరం, ఎస్.భాస్కరరావు, పి.భాగ్యవతి, పుట్టపల్లి అంబేద్కర్, బి.వి.రమణి, వై.వి. రాజేందర్, పి.పంతులు, ఎస్.వి. అంబేద్కర్ ఉన్నారు.
జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్తున్న వారు...
జిల్లా నుంచి 21 మంది విశాఖపట్నానికి, ఐదుగురు శ్రీకాకుళం జిల్లాకు వెళ్తున్నారు.
శ్రీకాకుళం వెళుతున్న వారిలో బొండపల్లి తహశీల్దార్ వైఆర్‌వాణి, జియ్యమ్మవలస తహశీల్దార్ ఆర్‌ఆర్‌ఎల్ ప్రసాద్‌పాత్రో, ఎల్.కోట తహశీల్దార్ జె.రాములమ్మ, గరివిడి తహశీల్దార్ మసిలామణి, పార్వతీపురం తహశీల్దార్ ఎం.శ్రీనివాసరావు ఉన్నారు.
విశాఖ వెళ్తున్న వారిలో బలిజిపేట తహశీల్దార్ పేడాడ.జనార్దనరావు, కొత్తవలస తహశీల్దార్ డి.లక్ష్మారెడ్డి, విజయనగరం తహశీల్దార్ డి.పెంటయ్య, సీతానగరం తహశీల్దార్ తాడ్డి.గోవిందలతో పాటూ జె.రామారావు, ఎం.అరుణకుమారి, పి.నీలకంఠరావు,డి.బాపిరాజు,కె.సూర్యనారాయణ, ఎం.రఘురాం, డి.ఎస్.శాస్త్రి, కె.డి.వి. ప్రసాదరావు, అజురఫీజాన్, ఎం.ప్రకాష్, యు.రాజకుమారి, టి.రామకృష్ణారావు,జి.జయదేవి,బిరత్నకుమార్, కె.శ్రీనివాసరావు, ఆర్.ఆర్. కృష్ణారావు, ఎం.అప్పారావులు ఉన్నారు.
Advertisement
Advertisement