కృష్ణా జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షిపై ప్రభుత్వ విప్, పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి పట్ల జిల్లాలో నిరసన వెల్లువెత్తుతోంది. ఆ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉద్ధతం చేస్తామంటూ గురువారం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు విధులు
బహిష్కరించి కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
కర్నూలు(న్యూసిటీ): కృష్ణాజిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహశీల్దారు డి.వనజాక్షిపై ప్రభుత్వ విప్, పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి పట్ల జిల్లాలో నిరసన వెల్లువెత్తుతోంది. ఆ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందులో భాగంగా గురువారం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు విధులు బహిష్కరించి కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే ప్రభాకర్ డౌన్...డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ప్రక్కనే ఉన్న ఎన్‌టీఆర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి, రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా ఎన్‌జీఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సీహెచ్ వెంగళరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు రౌడీలుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇసుక అక్రమ వ్యాపారానికి సహకరించని అధికారులపై దాడులు చేయడం దారుణమన్నారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ హుసేన్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కూడా కొందరు రాజకీయ నాయకులు ఉద్యోగులను బెదిరిస్తున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. రెవెన్యూ అసోసియేషన్ కర్నూలు డివిజన్ అధ్యక్షుడు రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రభాకర్‌ను అరెస్టు చేసే వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులకు రక్షణ కరువైందని ఆదోని ఆర్‌డీఓ ఓబులేసు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉంటే రాస్తారోకో చేయరాదని ఎన్‌జీఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వెంగళరెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పీఎండీ హుసేన్‌తో పోలీసులు వాగ్వాదానికి దిగారు. అయినా, అరగంటపాటు కొనసాగించిన రాస్తారోకోతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ నిరసన కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గిరికుమార్‌రెడ్డి, కర్నూలు డివిజన్ కార్యదర్శి నిత్యానందరాజు, ఎన్‌జీఓస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు, ఆదోని డివిజన్ అధ్యక్షుడు రజనీకాంతరెడ్డి, నాయకులు రామన్న, ప్రసాద్, నంద్యాల ఆర్‌డీఓ సుధాకర్‌రెడ్డి, జేఏసీ సభ్యులు బాలవెంకటేశ్వర్లు, వివిధ మండలాల తహశీల్దార్లు శివరాముడు, భూలక్ష్మి, అనురాధ, ఎంఆర్‌పీఎస్ జిల్లా నాయకులు సోమసుందరం, ఉద్యోగులు, వీఆర్‌ఓలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆ ఎమ్మెల్యేను అరెస్టు చేయండి
Published Fri, Jul 10 2015 2:58 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement
Advertisement