సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ముగిసి పదిరోజులు దాటినా రాష్ట్రంలో భూపరిపాలన గాడిలో పడడం లేదు. కోడ్ కారణంగా గతంలో నిలిపివేసిన నాలుగైదు వెబ్‌సైట్లను పునఃప్రారంభించకపోవడమే ఇందుకు కారణమని రెవెన్యూ వర్గాలంటున్నాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) పరిధిలోకి వచ్చే ల్యాండ్ రెగ్యులరైజేషన్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఎల్‌ఆర్‌ఎంఎస్), యూఎల్‌సీ రెగ్యులరైజేషన్, ఈల్యాండ్స్ టీఎస్, జీవో 58, 59ల ద్వారా ప్రభుత్వ భూముల్లోని కట్టడాల క్రమబద్ధీకరణకు సంబంధించిన వెబ్‌సైట్లతో సహా ఇతర భూపరిపాలన వెబ్‌సైట్లు పనిచేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది.
వాస్తవానికి, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత భూముల క్రమబద్ధీ కరణ నిలిచిపోయింది. ప్రభుత్వ భూముల్లో కబ్జా ఉండి నిర్మాణాలు చేసుకున్న వారికి ఆ భూములను క్రమబద్దీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు లక్షలాది మంది జీవో 58, 59 ద్వారా భూముల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోగా, అందులో 30–40 శాతం మాత్రమే దరఖాస్తులను పరిష్కరించారు. ఈ దరఖాస్తులను పరిష్కరించే అధికారం కలెక్టర్ల లాగిన్‌లకు మాత్రమే ఉండడంతో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే చాలా చోట్ల ఈ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుదారులు ఎన్ని కలు ముగిసిన తర్వాత క్రమబద్దీకరణ జరుగుతుందని భావించారు.
ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం రానుండడంతో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రారంభమవుతుందని రెవెన్యూ యంత్రాంగం భావించింది. కానీ, ఎన్నికలకు ముందు మూసేసిన వెబ్‌సైట్‌లను ఇప్పటివరకు ప్రారంభించకపోవడంతో రాష్ట్రంలో భూముల క్రమబద్దీకరణ పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలనా పగ్గాలు మారిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వ నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నామని, ప్రభుత్వ విధానం ఎలా ఉంటుందోనన్న ఆలోచనతోనే తాత్కాలికంగా నిలిపివేశామని చెపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment