ఊరూవాడా ఏకమై జిల్లాలో సమైక్యపోరు ఉధృతంగా జరుపుతున్నారు. సమైక్యాంధ్రను కాపాడుకునేందుకు ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ గొంతెత్తి నినదిస్తున్నారు. సోమవారం సింహగర్జన, జనజాగరణ, ఎడ్ల బళ్లు, ట్రాక్టర్ల ప్రదర్శన, మానవహారాలు, విఘ్నేశ్వర పూజలు నిర్వహించి నిరసనలు తెలిపారు.
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఇప్పటికైనా వెనక్కి తీసుకోండి.. సమైక్యవాదుల ఉద్యమ ఉధృతిని చూసైనా ఓట్లు, సీట్ల రాజకీయాలు మానుకోండి.. సీమాంధ్రుల ఆవేదనను అర్థం చేసుకోండి.. అంటూ జిల్లాలో సమైక్యవాదులు తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. రాష్ట్ర విభజన వల్ల ఎదురయ్యే కష్టనష్టాలను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సోమవారం జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ హోరు కొనసాగింది. న్యాయశాఖ జేఏసీ నాయకులు, ఉద్యోగులు మచిలీపట్నంలో జిల్లా కోర్టు ప్రధానగేటు ఎదుట వినూత్న నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు రోడ్డుపైనే అల్పాహారం తిని గుంజీలు తీశారు.
మచిలీపట్నం కోనేరుసెంటర్‌లో కొనసాగుతున్న రిలేనిరాహారదీక్షలో గ్రంథాలయ ఉద్యోగులు, బందరు, గూడూరు మండలాల్లోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సర్వే ఉద్యోగులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. 150 మంది సిబ్బందితో మచిలీపట్నంలోని 50 వేల కుటుంబాల వద్దకు వెళ్లి సమైక్యాంధ్రకు మద్దతుగా వారి అభిప్రాయాలను సేకరించటంతో పాటు సంతకాల సేకరణ చేయాలని మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ నిర్ణయించారు. ‘మీ కాళ్లు మొక్కుతాం.. మీ గడ్డాలు పట్టుకుని బతిమాలుతాం.. దయచేసి సమైక్యాంధ్ర ఉద్యమానికి సహకరించండి’ అంటూ జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్‌వీ చంద్రశేఖరరావు జిల్లా అధికారులను కోరారు.
గుడివాడలో మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గుడివాడ సింహ గర్జన కార్యక్రమం జరిగింది. ఈ గర్జన సభకు వేలాది మంది మహిళలు, విద్యార్థులు హాజరయ్యారు. పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జనజాగరణ కార్యక్రమం జరిపారు. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము వరకు వివిధ కార్యక్రమాలతో ఈ ఆందోళన కొనసాగనుంది. పామర్రులో జేఏసీ, ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో దీక్షలను నిర్వహించారు. పెదమద్దాలి పంచాయితీ సభ్యులు రిలేదీక్షలలో పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర కోరుతూ విఘ్నేశ్వరునికి ప్రత్యేకపూజలు చేశారు. ఈ నెల 20న జరిగే సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కావాలని మహిళా ఉద్యోగులు విజయవాడ దుర్గగుడిలో అమ్మవారికి మెట్ల పూజలు నిర్వహించారు. తేలప్రోలు రాజా హైస్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ప్రదర్శన, స్థానిక నెహ్రూబొమ్మ సెంటర్‌లో మానవహారాన్ని నిర్వహించారు. జగ్గయ్యపేటలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల బస్సులతో ర్యాలీ జరిపారు. రిలే దీక్షలో స్కూల్ బస్సుల డ్రైవర్లు, క్లీనర్లు కూర్చున్నారు. పెనుగంచిప్రోలులో దీక్షల్లో తిరుపతమ్మ ఆలయ నాయీబ్రాహ్మణ ఉద్యోగులు పాల్గొన్నారు.
కైకలూరు దీక్షలు 41వ రోజుకు..
కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు సోమవారానికి 41వ రోజుకు చేరాయి. తాలూకా సెంటర్ వద్ద ఎన్జీవోల దీక్షలు 34వ రోజూ కొనసాగాయి. వత్సవాయి, కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి, మైలవరం, హనుమాన్‌జంక్షన్, జి.కొండూరు, పెడనలలో వివిధ జేఏసీల ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. రెడ్డిగూడెం సెంటర్‌లో రైతుల ఆధ్వర్యంలో వంటావార్పు చేశారు. కోస్తాంధ్ర ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో తిరువూరు బోసు సెంటర్లో రిలే దీక్ష చేపట్టారు. కూచిపూడి, పెదపూడి, మొవ్వ గ్రామాల్లో భారీగా ఎడ్లబండ్ల ర్యాలీలు నిర్వహించారు. నూజివీడులో నిర్వహిస్తున్న రిలేదీక్షల శిబిరాన్ని వైఎస్సార్ సీపీ నూజివీడు సమన్వయకర్త మేకా ప్రతాప్, ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య సందర్శించి మద్దతు తెలిపారు.
ఉండమ్మా.. బొట్టు పెడతా..
కంచికచర్లలో ఉద్యోగ సంఘాలకు చెందిన మహిళా అధికారులు, కళాశాల విద్యార్థినులు కలిసి ఉండమ్మా బొట్టుపెడతా అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నందిగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు పట్టణంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్ పెద్దలకు బుద్ధి ప్రసాదించమని వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, పట్టణ కన్వీనర్ మరీదు కృష్ణమూర్తి గుడివాడలో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.
గన్నవరంలో ఉద్యోగులు జాతీయ రహదారిపై కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు ఇందుపల్లి-ఉంగుటూరు రహదారిపై సహపంక్తి భోజనాలు చేశారు. కైకలూరు పరిధిలోని పోలరాజ్ కాలువలో ఎన్జీవోలు, ఉపాధ్యాయులు జలదీక్ష చేపట్టారు. ఉయ్యూరులో శ్రీవిశ్వశాంతి విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సోనియా మనసు, విభజన ద్రోహుల కుట్రలు భగ్నం కావాలని విశేష పూజలు జరిగాయి.
ఉక్కు సంకల్పం
Published Tue, Sep 17 2013 1:11 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
Advertisement
Advertisement