రెవెన్యూలో రచ్చ
రెవెన్యూలో రచ్చ
Published Sat, May 27 2017 1:34 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM
ఏలూరు (మెట్రో) : జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌లో విభేదాలు రచ్చకెక్కాయి. అసోసియేషన్ నాయకులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి చేరాయి. ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ రెండు వర్గాలుగా చీలిపోగా.. ఒక వర్గం రెవెన్యూలో రచ్చ అశోక్‌బాబు తరఫున, మరోవర్గం బొప్పరాజు తరఫున పనిచేస్తున్నాయి. జిల్లాలో మాత్రం ఒకే రెవెన్యూ అసోసియేషన్ నడుస్తుండగా.. ఇందులో విభేదాలు తారస్థాయికి చేరాయి. జిల్లా రెవెన్యూ శాఖలో 2,500 మంది వీఆర్‌ఓలు, 909 మంది వీఆర్‌ఏలు, 900 మంది జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ఆర్‌ఐలు, సూపరిం టెండెంట్‌లు, ఏఓలు కలిపి మొత్తంగా 4,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరి సమస్యల పరిష్కారానికి కృషి చేసే జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌లో 12 మంది జిల్లాస్థాయి నాయకులు, ఏడుగురు కార్యవర్గ సభ్యులు, ఒక రాష్ట్ర కార్యదర్శి, 10 మంది డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు ఉన్నారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాపత్రయం
వ్యక్తిగత ప్రయోజనాల కోసమే అసోసియేషన్ నాయకులు వెంపర్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అసోసియేషన్ తరఫున ఏదైనా ఆందోళన చేయాల్సి వస్తే ముందుగా సమావేశం నిర్వహించి.. అజెండాలో ఆ అంశాన్ని పొందుపర్చాలి. సభ్యులందరి నిర్ణయం మేరకు తీర్మానం ఆమోదించాలి. అనంతరం కలెక్టర్‌కు నివేదించాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే నల్లబ్యాడీ్జలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలపడం వంటి దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే, ఫిబ్రవరి 13న అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లాం విద్యాసాగర్ ఇవేమీ చేయకుండానే నేరుగా వర్కు టు రూల్ ఉద్యమానికి తెరతీశారు. ఇది ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చేశారంటూ యూనియన్ సభ్యులు విమర్శలు సంధించారు. దీంతో ఆ ఉద్యమం విఫలమైంది.
కేసుల పరంపర
సంఘ అధ్యక్షుడు విద్యాసాగర్ అసోసియేషన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ మార్చి నెలలో రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులు విచారణ జరిపారు. సంఘ సభ్యులే తనపై ఫిర్యాదులు చేశారని విద్యాసాగర్ ఆరోపించారు. అనంతరం అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.రమేష్ కుమార్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు విద్యాసాగర్ ప్రకటించారు. తనను తొలగించే అధికారం ఎవరికీ లేదంటూ రమేష్ మంగళవారం కార్యవర్గ సమావేశం నిర్వహించగా.. రమేష్ తనపై దాడి చేసేందుకు సభ్యులను కూడగడుతున్నారని విద్యాసాగర్ ఏలూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం విద్యాసాగర్ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో రెండువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందనే ఉద్దేశంతో పోలీసులు జిల్లా రెవెన్యూ భవనం వద్ద పికెట్ ఏర్పాటు చేశారు.
రూ.20 లక్షలు కాజేసేందుకు కుట్ర !
రెవెన్యూ అసోసియేషన్‌లో రూ.20 లక్షల సొమ్ము ఉన్నట్టు చెబుతున్నారు. ఆ మొత్తాన్ని కారు కొనేందుకు, స్వలాభాలకు ఉపయోగించుకునేందుకు అసోసియేషన్ నాయకులు కుట్ర పన్నుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అసోసియేషన్ ప్రతిని ధులు బుధవారం వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటూ పత్రికలకు ప్రకటనలు విడుదల చేశారు. ఇది ఎటు దారితీస్తుందోననే ఆందోళన, ఉత్కంఠ రెవెన్యూ ఉద్యోగుల్లో నెలకొంది.
Advertisement
Advertisement