సాక్షి, మచిలీపట్నం : గెలుపు కోసం రాజకీయ పార్టీల అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తే.. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చేసిన ఖర్చు కూడా కోట్లు దాటింది. ఎన్నికల నిధుల వినియోగంలో లోపాలు జరిగాయన్న ఆరోపణలు మాత్రం జిల్లా యంత్రాంగం పరువు తీస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం చేసిన ఖర్చు రూ.18.98 కోట్లు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాకు రెండు విడతలుగా విడుదలైన ఈ నిధులను సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారు(ఏఈఆర్వో)లకు నాలుగు దశల్లో కేటాయింపులు జరిపారు. గతంలో ఏ ఎన్నికల్లోనూ లేనివిధంగా ఈసారి ఎన్నికల నిర్వహణ కోసం పెద్ద ఎత్తున నిధుల కేటాయింపులు జరగడం విశేషం.
నియోజకవర్గానికి రూ.కోటికి పైగా...
జిల్లాలో రెండు లోక్‌సభ, 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ఏర్పాట్లు చేసేందుకు ఇబ్బడి ముబ్బడిగానే నిధులు కేటాయింపులు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ఆదేశాలతో ఎన్నికల బడ్జెట్‌ను కేటాయించారు. వాటిని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ ఏఈఆర్వోలకూ దశల వారీగా కేటాయింపులు జరిపారు. దీనిలో భాగంగా ఈ ఏడాది మార్చి 13న రూ.6,33,44,000, ఏప్రిల్ 18న రూ.12,64,73,600 నిధులు జిల్లాకు విడుదలయ్యాయి. వీటిని మార్చి 18, ఏప్రిల్ 22 తేదీల్లో జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఏఈఆర్వోలకు కేటాయింపులు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ కోసం టీఏ బిల్లులు, కారు అద్దెలు, ఆయిల్, ప్రకటనలు, టెలిఫోన్, పోస్టేజీ, ఆఫీసు ఖర్చులు వంటి బిల్లులను పెట్టారు. ఇలా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.కోటికి పైగా నిధుల కేటాయింపులు జరగడం గమనార్హం.
ఎన్నికల ఖర్చుపై ఎన్నో అనుమానాలు..
జిల్లాలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల నిర్వహణ వ్యయంపై అనుమానాలు వెంటాడుతున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన మొత్తం నిధుల్లో 60 నుంచి 70 శాతం వరకు ఖర్చుచేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం నిధులను రికార్డుల్లో ఖర్చులు చూపించి మిగుల్చుకున్న నిధులను కొన్ని తహశీల్దార్ కార్యాలయాల పరిధిలోని సిబ్బంది పంచుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికల నిర్వహణలో భాగంగా అవసరమైన సామగ్రి విజయవాడలోని ఒక స్టోర్స్‌లో కొనుగోలు చేశారు.
మిగిలిన మొత్తాలను పలు నియోజకవర్గాల్లో తలా కొంచెం పంచుకున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వాస్తవంగా చేసిన ఖర్చులు తక్కువే అయినా లెక్కల్లో మాత్రం వాటిని సరిచేసుకుని సంబంధిత అధికారులతో ఆమోద ముద్ర వేయించుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం సంబంధింత అధికారులకు స్థాయిని బట్టి ముడుపులు ముట్టజెబుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత అకౌంటెంట్ ఆడిటర్ జనరల్ (ఏజీ) కార్యాలయం నుంచి వచ్చే ప్రత్యేక సిబ్బంది ఆడిట్ నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు.
పెడనలో రోడ్డున పడ్డ నిధుల గొడవలు..
పెడన నియోజకవర్గంలో పలు మండలాల్లో ఎన్నికల నిధుల కైంకర్యంపై వివాదాలు తలెత్తడంతో సిబ్బంది నడుమ గొడవలతో రోడ్డున పడ్డారు. మిగులు నిధులు తమకు వాటా వేయడంలో జరిగిన అన్యాయాన్ని రెవెన్యూ అసోసియేషన్ సమావేశంలో లేవనెత్తుతామని, నిధులు కాజేసిన వారి బండారం బయటపెడతామని దిగువస్థాయి సిబ్బంది ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. పెడన నియోజకవర్గానికి కేటాయించిన నిధుల్లో ఖర్చుచేయగా మిగిలిన మొత్తాన్ని కొందరు పంచుకున్నట్టు వివాదాలు రేగాయి. ఈ నియోజకవర్గంలో ఒక మండలంలో మిగిలిన మొత్తం నిధులను ఒక అధికారికి 80 శాతం, ఆయన దిగువస్థాయి అధికారికి 20 శాతం చొప్పున వాటాలు పంచుకోవడంతో వీఆర్వోలు వివాదానికి దిగినట్టు సమాచారం.
ఎందుకొచ్చిన గొడవలు అనుకుని మరో రెండు మండలాల్లో మిగిలిన మొత్తాన్ని ఒక్కొక్కరు రూ.5 వేలు చొప్పున పంచుకుని సొమ్ము స్వాహా చేయడంలో సమన్యాయం పాటించారు. పెడనలో ఎన్నికల ఖర్చుతో కొన్న ఏసీని సగం ధరకే ఒక ఉద్యోగికి అమ్మేసినట్టు తెలిసింది. దీనిపై తహశీల్దార్ డీవీఎస్ ఎల్లారావును ‘సాక్షి’ వివరణ కోరగా ఆ ఏసీ ఎన్నికల నిధులతో కొనలేదని చెప్పారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి తెచ్చి ఇచ్చేశామని తెలిపారు. ఎన్నికల డీటీ మల్లిఖార్జునరావు మాత్రం ఆ ఏసీ ఎన్నికల నిధులతోనే కొన్నట్టు ‘సాక్షి’కి చెప్పారు. వీటన్నింటిపై జిల్లా కలెక్టర్ స్పందించి ఆరా తీస్తే జరిగిన అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
ఎన్నికల నిర్వహణ ఖర్చులో అవకతవకలు
Published Wed, May 28 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement
Advertisement