సచివాలయం తరలింపు జూన్ 15న
♦ ఆరోజే ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళిక
♦ జూలై ఆఖరు నుంచి హెచ్‌వోడీల తరలింపు తొలిదశ
♦ ఉద్యోగ సంఘాలతో మంత్రి నారాయణ, సీఎస్ టక్కర్ భేటీ
♦ స్పష్టత ఇవ్వడంలో సర్కారు విఫలం.. ఉత్తర్వులివ్వాలి
♦ ఉద్యోగ సంఘాల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని అమరావతికి సచివాలయం తరలింపును ఈఏడాది జూన్ 15న ప్రారంభిస్తామని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు తెలిపింది. పురపాలకశాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ సోమవారం సచివాలయంలో.. ఉద్యోగ సంఘాల నేతలు, సచివాలయ భవన నిర్మాణ కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సచివాలయం తరలింపును ఒకేదఫా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించామని మంత్రి, సీఎస్ వెల్లడించారు. శాఖాధిపతుల కార్యాలయాల (హెచ్‌వోడీ) తరలింపును రెండు దఫాలుగా పూర్తి చేయాలనే యోచనలో ఉన్నామన్నారు.
జూలై ఆఖరున తొలిదశ, ఆగస్టు ఆఖరులో మలిదశ తరలింపు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. సచివాలయం కోసం జీ+1 అంతస్తు నిర్మిస్తున్న భవనం మీదే మరో రెండంతస్తులు నిర్మించి, శాఖాధిపతుల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని వెల్లడించారు. సచివాలయం కోసం మొత్తం 6 బ్లాకులు నిర్మిస్తున్నామని, అందులో 1, 2, 3 బ్లాకులు సచివాలయానికి, 4, 5 బ్లాకులు శాఖాధిపతుల కార్యాలయాలకు, ఆరోబ్లాక్‌ను శాసనసభ, మండలికి ఇవ్వాలనే ప్రతిపాదన ఉందన్నారు.
స్పష్టత ఇవ్వడంలో విఫలం..
తరలింపుపై స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తరలింపు తేదీలు, ఇతర డిమాండ్లపై కేవలం ప్రకటనలు చేయడమే కాకుండా ఉత్తర్వులు ఇస్తే ఉద్యోగులు మానసికంగా సిద్ధమవుతారని సూచించారు. 30 శాతం హెచ్‌ఆర్‌ఏ కొనసాగింపు, సీసీఏ, ప్రత్యేక అలవెన్స్, వారానికి 5 రోజుల పని విధానం, పిల్లల స్థానికత, విద్యాసంస్థల్లో సీట్లు.. తదితర అంశాల్లో ఉత్తర్వులివ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, వచ్చే సోమవారం మరోసారి ఉద్యోగ సంఘాలతో సమావేశమై వెల్లడిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
తరలి వెళ్లాల్సిన ఉద్యోగులు 6-7 వేలకు మించరు
సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో కొత్త రాజధానికి తరలి వెళ్లాల్సిన ఉద్యోగుల సంఖ్య 6-7 వేలకు మించదని ఉద్యోగ సంఘాలు కొత్త లెక్కలను తెర మీదకు తెచ్చాయి. ఈ కార్యాలయాల్లోని శాంక్షన్ పోస్టుల్లో దాదాపు సగం ఖాళీలున్నాయని, కాంట్రాక్టు-ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులంతా కొత్త రాజధానికి తరలివచ్చే అవకాశం లేదని చెబుతున్నాయి. ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులు 10 శాతం ఉంటారని అంచనా. 15-20 శాతం సిబ్బందిని ఇక్కడే కొనసాగించనున్న దృష్ట్యా.. కొత్త రాజదానికి వెళ్లే ఉద్యోగుల సంఖ్య 6-7 వేలకు మించదని చెబుతున్నాయి.
తాత్కాలిక సచివాలయం నిర్మాణపనుల్లో ప్రమాదం
పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మికుడి దుర్మరణం
తుళ్లూరు: తుళ్లూరు మండలం వెలగపూడిలో జరుగుతున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనుల్లో అపశ్రుతి దొర్లింది. సోమవారం ఉదయం పునాది పనులు నిర్వహిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు దుర్మరణం చెందాడు. పశ్చిమబెంగాల్‌కు చెందిన సామ్రాట్ రౌతు(20)అనే యువకుడు రిగ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. పునాదుల కోసం రిగ్‌మిషన్ ఆపరేట్ చేస్తుండగా సోమవారం ఉదయం 6.30 సమయంలో మిషన్ పక్కకు పడిపోయింది.భయపడిన సామ్రాట్ కిందకు దూకగా మిషన్ కింద పడి మరణించాడు. మృతదేహాన్ని భారీ కేన్ల సాయంతో రెండుగంటలకు పైగా శ్రమించి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. షాపూర్జీ పల్లోంజీ సంస్థకు సంబంధించి పునాదులు తవ్వే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.