ప్రకటన సరే.. ఉత్తర్వులేవీ?
- బాణసంచా మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపు కోసం వెలువడని జీఓ
- జిల్లా నిధుల నుంచి తక్షణ సాయం అందించిన కలెక్టర్
- ఇది చంద్రన్న బీమా పరిహారమని ప్రకటించిన మంత్రి నారాయణ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని పొర్లుకట్ట వద్ద అనధికారిక బాణసంచా తయారీ కేంద్రంలో గత నెల 31వ తేదీ సంభవించిన పేలుడులో మృతులకు పరిహారం పంపిణీలో ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయలేదు. మృతుల కుటుంబాల దయనీయ పరిస్థితి చూసిన కలెక్టర్ రేవు ముత్యాలరాజు ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురు చూడకుండా జిల్లా నిధుల నుంచి సాయం అందించారు. నూతన సంవత్సర వేడుకలకు ఒక రోజు ముందు నెల్లూరు నగరంలో జరిగిన పేలుడు జిల్లా వాసులను ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రమాదంలో నాగరాజు (40), లక్ష్మయ్య (35) అక్కడిక్కడే మృతి చెందగా, ఒకరి ఆచూకీ తెలియలేదు. 13 మందిని విషమ పరిస్థితుల్లోను, ఒకరిని కొంత మేరకు గాయాలతో నారాయణ ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించారు.
సాయం అందజేతకు ఉత్తర్వులేవీ?
పై సంఘటన జరిగిన రోజే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే బాధితులకు తక్షణ సాయం కింద ఈ మొత్తం చెల్లించడానికి అవసరమైన అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు స్పందించి మృతుల కుటుంబాలకు ఆదివారం రూ.5 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేయించారు. చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నారాయణ ఈ మొత్తం చంద్రన్న బీమా నుంచి పంపిణీ చేశామని ప్రకటించారు. అయితే బీమా మొత్తం చెల్లింపునకు కనీసం 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉండటంతో కార్మిక శాఖ అధికారులు అంతిమ సంస్కారాల కోసం కొంత మొత్తాన్ని మాత్రమే అందించారు.
ఈ నేపథ్యంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇండ్ల పోలయ్య,(35) శ్రీకాంత్ (16) ఆదివారం కన్ను మూశారు. శనివారం నాటి ఘటనలో ఆచూకీ లేకుండా పోయిన జి. రమేష్ (18) కూడా ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు ఆనవాళ్లు లభించాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు వైద్యానికయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించినా, వారి కుటుంబాల పరిస్థితి ఏమిటనేది పాలకులు పట్టించుకోలేదు.
శ్రీకాంత్, పోలయ్య కుటుంబా లకు కూడా రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించడానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి సోమవారం కూడా జీఓ విడుదల కాలేదు. దీంతో ఈ కుటుంబాలకు కూడా జిల్లా నిధుల నుంచే రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందించారు. మృ తుల కుటుంబాలను ఏదో ఒక నిధి నుంచి ఆదుకోవాలనే ఉద్దేశంతోనే రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందించామనీ, ప్రభుత్వం ఏ నిధుల నుంచి దీన్ని సర్దుబాటు చేస్తుందో చూడాల్సి ఉందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. 17 కుటుంబాలకు సంబంధించిన ఇంతటి తీవ్రమైన విషాదకర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వేగంగా స్పందించక పోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.