- సోమవారం ఉదయం ఉద్యోగుల తరలింపునకు అన్ని ఏర్పాట్లు
- వెళ్లొద్దంటూ ఆదివారం రాత్రి సీఎస్ ఆదేశం
- వెలగపూడిలో కార్యాలయం పనులు పూర్తికాకపోవడమే కారణం
- బుధవారానికి వాయిదా వేశామన్న మంత్రి నారాయణ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి : వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి శాఖలు, ఉద్యోగుల రెండో దఫా తరలింపునకు ప్రభుత్వం నిర్ణయించిన ముహూర్తం వాయిదా పడింది. సోమవారం హైదరాబాద్ నుంచి రహదారులు-భవనాలు శాఖతో పాటు విజిలెన్స్ కమిషన్ తరలి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక సచివాలయంలో కార్యాలయాలు సిద్ధం కాకపోవడంతోనే వారి తరలింపును వాయిదా వేశారు. నిజానికి ఈ నెల ఆరో తేదీనే వెలగపూడిలోని ఐదో భవనం తొలి అంతస్థులోకి ఆ రెండు శాఖలు వెళ్లాల్సి ఉంది. అప్పటికి ఆ భవనంలోని తొలి అంతస్థు పూర్తికాకపోవడంతో 11వ తేదీకి వాయిదా వేశారు. సోమవారం ఉదయం ఉద్యోగులను తరలించడానికి బస్సులు ఏర్పాటు కూడా చేశారు. అయితే ఆదివారం రాత్రి 10:30 గంటలకు రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరలింపును వాయిదా వేసుకోవాలని రహదారులు-భవనాలు, విజిలెన్స్ కమిషన్ అధికారులకు ఫోన్లో సూచించారు. దీంతో వెంటనే ఆయా శాఖల అధికారులు ఉద్యోగులకు ఫోన్లు చేసి వాయిదా సమాచారం ఇచ్చారు.
మంత్రుల చర్చలు..: ఐదో భవనం మొదటి అంతస్థులో సోమవారం ప్రారంభించాలని భావించిన శాఖలను బుధవారం ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. వాయిదా పై ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు మంత్రులు, అధికారులు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఐదవ భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఇంకా పనులు పూర్తికాకముందే మొదటి అంతస్థుని సోమవారం ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. దీంతో మంత్రి నారాయణ రోడ్లు, భవనాలు, రవాణా శాఖ కార్యాలయాలను ప్రారంభించాలని మంత్రి శిద్ధా రాఘవరావుపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. పనులు పూర్తి కాకుండా ప్రారంభిస్తే పరువు పోతుందని సన్నిహితుల వద్ద మంత్రి శిద్ధా ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సోమవారం ప్రారంభించాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆదివారం అర్ధరాత్రి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏదో ఒక గదిని సిద్ధం చేసి ఇస్తామని మంత్రి నారాయణ చెప్పినా.. తాను వచ్చేది లేదని శిద్ధా తేల్చి చెప్పినట్లు తెలిసింది. సోమవారం ఉదయం ప్రారంభిస్తామని నారాయణ మీడియాకు సమాచారం ఇచ్చారు. కొద్ది సేపటికే వాయిదా వేసినట్లు ప్రకటించారు.
‘రెండో’ ముహూర్తం వాయిదా
Published Tue, Jul 12 2016 1:12 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement