పెద్దదిక్కు లేని రిజిస్ట్రేషన్ల శాఖ
♦ వారం రోజులుగా కమిషనర్ పోస్టు ఖాళీ
♦ ఇన్‌చార్జి నియామక ఫైలు సీఎం వద్ద పెండింగ్
సాక్షి, హైదరాబాద్: కీలకమైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో కమిషనర్‌ను ప్రభుత్వం నియమించలేదు. గత రెండేళ్లుగా ఇన్‌చార్జి అధికారుల పాలనలోనే రిజిస్ట్రేషన్ల విభాగం కొనసాగుతోంది. అయితే వారం రోజులుగా ఇన్‌చార్జి కమిషనర్ కూడా లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేసే నాథుడు కరువయ్యారు. కార్మిక శాఖ కమిషనర్‌గా ఉన్న అహ్మద్ నదీమ్ కొంతకాలంగా రిజిస్ట్రేషన్ల విభాగానికి ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక పరిశీలకునిగా ఆయనను కేంద్ర ఎన్నికల సంఘం అక్కడకు పంపింది. దీంతో కార్మిక శాఖ ఇన్‌చార్జి బాధ్యతలను వేరొకరికి అప్పగించిన సర్కారు.. రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలను మాత్రం గాలికి వదిలేసింది.
నదీమ్ స్థానంలో కార్మిక శాఖ ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించిన అధికారికే రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలు అప్పగించాలని ఆ శాఖ ఇన్‌చార్జి ముఖ్య కార్యదర్శి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వారం రోజులుగా ముఖ్యమంత్రి వద్ద ఈ ఫైలు పెండింగ్‌లో ఉండిపోయింది. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖకు దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించే సంగతి అటుంచితే, ఇన్‌చార్జి కమిషనర్ కూడా లేకపోవడంతో ఫైళ్లు పేరుకుపోయాయి. ఈ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలను చెల్లించేందుకు వీలు లేకుండా పోయింది. బడ్జెట్ లేక మార్చి నెల వేతనాలు, కమిషనర్ లేక ఏప్రిల్ నెల వేతనాలు అందకపోవడంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు.
కమిషనర్ కావలెను
Published Mon, May 9 2016 4:14 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM
Advertisement