ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి ఉద్యోగుల తరలింపు తొలి దశలో 20 శాఖాధిపతుల కార్యాలయాలు, సచివాలయం నుంచి 20 శాఖలను తరలించాలని
♦ 20 హెచ్‌వోడీలు కూడా
♦ తరలి వెళ్లాల్సిన మొత్తం సిబ్బంది 9,750 మంది
♦ లెక్క తేల్చిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి ఉద్యోగుల తరలింపు తొలి దశలో 20 శాఖాధిపతుల కార్యాలయాలు, సచివాలయం నుంచి 20 శాఖలను తరలించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు తెలిపింది. పురపాలకశాఖ మంత్రి నారాయణ, సీఎస్ ఎస్పీ టక్కర్.. సోమవారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. అయితే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న స్థానికతపై స్పష్టత, 30 శాతం హెచ్‌ఆర్‌ఏ, తరలింపు అలవెన్స్, 5 రోజుల పనిదినాలు, ఉద్యోగుల వసతి కల్పన.. తదితర అంశాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోయింది. సీఎంతో మాట్లాడి చెబుతామంటూ పాత పాటే పాడింది.
రాజధానికి తరలి వెళ్లాల్సిన మొత్తం ఉద్యోగుల సంఖ్య 9,750 అని ప్రభుత్వం నిర్ధారించింది. తొలి దశలో సచివాలయంలో 20 శాఖలు (20 మంది కార్యదర్శులు, వారికి అనుబంధంగా పనిచేస్తున్న సిబ్బంది), 20 శాఖాధిపతుల కార్యాలయాల (హెచ్‌వోడీ)ను తరలించాలనే యోచనలో ఉన్నామంది. రెవెన్యూ, వ్యవసాయం, జలవనరులు, వైద్యం, అటవీ, విద్యాశాఖల పరిధిలో 20 హెచ్‌వోడీ కార్యాలయాలున్నాయని, వాటి ని తొలిదశలో తరలించనున్నట్లు వెల్లడించారు.
ఏ కార్యాలయానికి ఎంత స్థలం?
ఏ కార్యాలయానికి ఎంత స్థలం అవసరం అనే విషయాన్ని నిర్ధారించడానికి ఈ నెల 30న వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజ్ పాణిగ్రాహి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో.. కార్యాలయాల వారీగా స్థలాల అవసరాలను నిర్ణయిస్తారు.
2న మళ్లీ భేటీ: ఉద్యోగ సంఘాలు, సచివాలయ నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఏప్రిల్ 2న మరో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30న జరగనున్న భేటీలో నిర్ణయించే అంశాలను సంఘాల ముందుంచాలని సర్కారు భావిస్తోంది.